Wednesday, June 20, 2012

కరెంటు పురుగు

ఎక్కడున్నవోనని 
నిదుర పట్టని క్షణాలకు 
నచ్చచెప్పి 
ఖాళీ సంచి లో కడుపు నింపుకొని 


చీకటి మైదానాల మీదుగా 
మనుషుల విసర్జనాల 
నగ్నత్వాన్ని పీల్చుకుంటూ 
రైలు టాయిలెట్స్ పక్కన నక్కి 


రెక్కలొచ్చిన ఆత్రుతని 
దొర్లించుకుంటూ 
నీటితీరాన
తడిసిన పాదాలు తాకి
అచ్చోత్తుకున్న ఇసుక చాతీ మీద
కదిలి  




ఎక్కడున్నవోనని 
విశ్రమిస్తున్న 
గుడి మెట్లని లేపి 
ముచ్చట్లలో నింపి 
ఉదయ స్తోత్రాల తాకిడికి వణికి 
పసుపు కుంకుమల శోభను మోసుకొని 


నగరాల నాడుల మెలికల్నిదాటి 
కోటల మీదుగా పాకి 
పురాతన ఊడల మీదుగా ఊగి ఊగి 
కాలపు రహస్య జ్ఞానంపై పొర్లాడుతూ 


మళ్లీ మళ్లీ 
చీకటిని రోజూ కోలుకోమని 
వెలుగును ఆరబోకని 


ఆకు చివర్లనుండి రాలుకుంటూ 
పాటల తన్మయం లోకి చొచ్చుకొని 
పక్షుల కువ కువల హత్తుకొని 
గాలితపనలతో కలిసి 
ఎగిరెగిరి పారి, ఈది  


ఎక్కడ ఎక్కడ 
ఎక్కడున్నవోనని 


      *****





No comments:

Post a Comment