Saturday, April 6, 2013

ఏరోజుకారోజు



''నేనంతే ''అంటాను 
కాదేమోనన్న సంశయం 
నువ్వు చెప్పకుండానే 
ముఖ కండరాలు ముక్కలు చెక్కలౌతాయి


వేపపూత ప్రేమని 
ఏ గాలీ దయ తలచదు 


ఛాతీ మధ్య దుఃఖం లో 
అన్నీ మసౌతాయి పోనీ భస్మమౌతాయి 


నడక కూడా నమ్మకం లేకుండా 
వెంట పడుతుంటే నువ్వు మాత్రం ఏంచేస్తావ్ 


ఐనా 
ఒక బాధని ధ్యానించు కుంటూ 
నీ అర్ధం లో ప్రేమించుకుంటూ 
బతకడం గొప్పే నని నిశ్చయించు కున్నాక 
ఇక మిగిలిన ఆలోచనలకి 
ఆయుష్షు తక్కువే 


సరే 
నీకు మాట్లాడాలన్పించినపుడు
ఓ మిస్స్డ్డ్ డ్ కాల్ మీద నమ్మకముంచు 

          .....

Thursday, April 4, 2013

ఎరుక 1



తన్మాత్రలు లేవో 
తదర్ధాలు లేవో 
మూసిన ప్రార్ధనల వేళ
దారులు కనిపించ కుంటే మాత్రం 
నువ్వొక్కడివీ వస్తే వస్తావు 


మాటల నాడులు తెగినాయో 
తదర్దాల శరీరాలు చితికాయో 
రెండో దారి లేని కాలం వెంట 
రాతలు పులకరించకుంటే మాత్రం 
రావాలనుకుంటే వస్తావు 


కనుపాపల నక్షత్రాలు రాలాయో 
తద్దీపపు వెలుగులు కుమిలాయో 
హృదయం గడియ మూసే వేళ 
వేచిన తరువులు వీయకుంటే మాత్రం 
నువ్వొక్కడివీ,నేనెక్కడికీ పోనని 


వస్తే వస్తావు 
కడుపారా.

    .....

Wednesday, April 3, 2013

ఆత్మవెలది 50


తపనలు ఒంటరివే 
నీవు కలియక పోతే 


రాత్రి కూడా ఒంటరిదే 
వెన్నెల వెంట లేకపోతే 


నీ ఆలోచన లేకపోతే 
ప్రేమ ఒంటరిదే 


ఈ మసక లోకం 
ఎందుకనో?????
ప్రియురాలా...!
మన భాషకు చిక్కనే చిక్కదు.

          .....

ఆత్మ వెలది 49


కూర్చున్న చోట 
కుప్పలు గా కలలు రాలాయి 


వెలుతురు కింద 
ఒకటే నీడ పడింది 


చూపులు కలిసి 
చుక్కల్ని దింపాయి 


ఈ మసక లోకం 
ఏదీ ఏరుకోదు 
ప్రియురాలా...!
ఇద్దరి చేతుల్లో ఏముందో పరులకు తెలియదు .

        .....

ఆట వెలది 48



దుఃఖం రుచి తెలుస్తుంది 
ప్రేమించడం మొదలైతే 


త్యాగం గురించి తెలిసేది 
ఆనందించడం మొదలైతే 


అన్నీ పోగుట్టుకున్నాక 
జీవితం తెలుస్తుంది 


ఈ మసక లోకం 
ఎప్పటికీ నమ్మక పోయినా సరే 
ప్రియురాలా ...!
కొన్ని నిజాలు మనవెంటే వుంటాయి .

         .....


ఇట్లా అవుతుందని తెలియదు



నీకు పరదాలుంటాయి ,తొంగిచూసే 
సమ్మోహ సరదాలుంటాయి 


నువ్వు నాభి నుండి రావచ్చు 
నాలుక నుండి పేలవచ్చు 


నిజం చిలకొచ్చు 
ఎవరో నమ్మక పోవచ్చు 


అబద్దం అందరికీ నచ్చొచ్చు 
నిప్పులు కొందరినే కాల్చొచ్చు 


అందరికీ భిన్నం కాదు 
అంతా శేషం రాదు 


ప్రయాణం ఆగదు 
ప్రపంచానికి దిక్కుండదు 


          .....

Tuesday, April 2, 2013

కొంత



బాల్యం కొంత  
యా..యా...యవ్వనం కొంత 
వణుకు వార్ధక్యం కొంత 
అనుభవం కొంత 


బంధం కొంత 
స్నేహం కొంత 
ప్రేమ కొంత 
దుఃఖం కొంత 


చదువు కొంతే 
మెలుకువ కొంత 
జ్ఞానం కొంతే 
వాసన కొంత 


అసలు జీవితం?

     .....