Thursday, June 3, 2010

పరిచయీ.....

తల భారం
మనసు గారాబం
తలపుల జ్వర తాపం
కన్నుల తడి దహనం
నరాల కారం
ఎప్పటికీ ఆగని
అగ్గి పొటుకు.....

ఇక్కడి నేల మాత్రం
పచ్చన...
మల్లెల వెన్నెల
పూస్తుంది.

...........

Wednesday, June 2, 2010

భాధా గుత్తులు

వస్తూ వస్తూ
నా లోపలి కిటికీలు తీస్తావు
కొన్నివేల
సీతాకోకచిలుకలు
విచ్చుకుంటాయి
రెప రెప రెప రెప రెప
రంగుల గిరికీలు కొడుతూ
వాసనల బరువు మోసుకోద్దామని
తీపి రాగాలై ,నీ
కనురెప్పల మీద వాలి
ఆనందపు జ్ఞానాన్ని పంచుకుంటాయి

వెళుతూ వెళుతూ
చివరి చూపుల కొనలగుండా
కాటుక చీకటి విదిల్చి
ఊపిరి గొట్టానికి
జడ పిన్ను బిగించి పోతావ్...

............

Friday, March 27, 2009

కాలం నడిచిన దారి

చూస్తుండగానే

మంచం లో పడిన నాన్నకు

గొంతు పోయింది ...

సగం శరీరం చచ్చు పడింది...అంతే కాక

గుండె గతి మార్చు కుంది .....చూస్తుండగానే

కళ్లు తెరిచి కలియచూసి కన్ను మూసాడు



కాలం గిర్రున

చెంప దెబ్బ కొట్టింది..



వలస బతుకు

వలస వృత్తి వరి

బువ్వ తినిపిస్తుండగానే

నీటి అవతారం మారిపోయింది .



కల్లకింపు ...కంటికింపుగా

సేద బావుల నీళ్ళన్నీ

మినరల్ మేకప్ తో

గొంతులు చల్లగా కాల్చుకుంటూ

జారుతుంది ....

చూస్తుండగానే

మార్కెట్లో నీతిశిలగా నిలబడింది

భూమిలోపలి జల



చెరువు శ్మశానమై

కడుపుల పూడ్చుకుంది వూరును...



మీసం మొలిచిన పిట్టలు

అమెరికాకో ఇంగ్లాండుకో

ఎక్కడెక్కడికి ఎగిరిపోయాయో

వెతకడం సాధ్యం కాదు ప్రేమను...



చూస్తుండగానే

కరెంటు కండ్లకిచ్చిన

ఆనందమ్

తీరకముందే

చార్జీల మినుగుర్లు రాలి

చూపు కాలిపోయింది....



ఉమ్మడి కుటుంబాల సౌరభామంతా

చీలికలైన విస్తరాయే ...చూస్తుండగానే ..



పలుక బలుపాలు పోయి

పలుకుబడి డాలర్ల పాలాయె చదువు ...



పచ్చని చెట్టు

తుఫాను కు వంగిపోయింది ....అమ్మ

చూస్తుండగానే ....



..................











Monday, March 23, 2009

దు:ఖోదయం

చలి వెన్నెల జోరు జలపాతం

ఒకే పుస్తకం లోంచి

ఇరువురి సమస్యల్ని చదువుకుంటాం

మనమీద హాస్యం విసురుకునే

అనాది బాధలు

రాలిపోతాం

వానాకాలపు తాకిడికి పూలవలె

మనసు మూగగా

ఒంటరి స్తంభమై నిలుస్తుంది

దాని చుట్టూతా

బడి పిల్లలు ఆడుకుంటారు

అదే పనిగా అమ్మ

అన్నమై పిలుస్తుంది

పాటలై

శోకాలు నాట్యం చేస్తాయి రాత్రికి రాత్రి

ఖాళీ నవ్వులు

ఖాళీ ఖాళీ ఆప్యాయతలు

ఊపిరి పెనవేసుకు పోయిన

మనుషుల జాడ తెలియదు

కిటికీ లోంచి

గాలితో పాటు గాయాలు కూడా

తెలవారుతాయి

రేడియో మీద వాలిన పిచ్చుక

పాటని నింపి పోతుంది

ముల్లుని ఏ స్టేషన్ మీదికి కదిపినా

అదే కమిలిన దుఃఖ౦.

...................