Wednesday, May 30, 2012

కొస బిందువులో బింబం

                      తెలియకుండానే అన్నీ జరిగి పోతుంటే గుండె ముళ్ళ మీద వాలి మూలుగుతున్నట్టు...
                    గది కళ్ళు తెరవగానే ,రాత్రి ఎప్పుడు వచ్చి వెళ్ళిందో వర్షపు 
వాసన...దిగులు దిగులుగా కుదిపి నిలబెట్టింది గోడవారన.
                  ఆరి పోతున్న చినుకులు వంటి మీదికి సూర్య కిరణాలు పోసుకొని మెరిసిపోతూ నా వైపు చూసి నవ్వినను రమ్మన్నాయి.
                      అద్దం ముందు జరిగిన సంభాషణలో ...మేఘాల చాటు నుండి మెరిసిన తెల్లటి తంత్రి నా వయసును తాకి దిగులు వేగాన్ని రెండింతలు చేసి వేపచెట్టు గాలిని వేడి చేసింది .
                   తెలియకుండానే అన్నీ జరిగిపోతుంటే ...నా కంటి చివర్ల చేరిన సముద్రం గడ్డకట్టి గుసగుసలు పెట్టి మొత్తానికి ఒడ్డున చేర్చాయి .ప్రేమించేవాడే మొలకెత్తగలడని గడ్డిపూల పాటలు పసిపిల్లలై గోళీకాయల చప్పుళ్ళతో ఆడి ఆడి చెట్టుకింద సోమ్మసిల్లాయి .
                                    ఆందోళనా గాలులు అనేకం కొట్టుకువచ్చి పొంచి వున్న వీధి చివర్ల వెంట నను వెళ్ళకుండా గొంతులో తివాచీ పరుచుకొని నను ఊయలలూపిన కవిత్వ మాంత్రికులు కనిపించడం మానినారు.
                          గడ్డిపూల గాలులు తగిలి కోలుకొని మనుషుల మధ్య ఆనవాలు పట్టుకొని కాలం వెంట పగుళ్ళ కాళ్ళతో పరుగెడుతూ ఒక రహస్యం చెప్పడానికి చేతుల్నిపూలగుత్తి చేసి ఇస్తున్నా...
                                 తెలియకుండానే అన్నీ జరిగిపోతుంటే ...పూడుకుపోయిన గొంతులో తవ్విన కొద్దీ ప్రేమే .

Monday, May 28, 2012

దానిమ్మ గింజల జల్లు .....5

1


రాతి కట్టడాలు నగిషీ చెక్కడాల కంటే 
నిరంతర ప్రాణంతో కళకళలాడే 
భాగ్యనగరమే గొప్ప ప్రేమనగరం 


2


వెన్నెల కూడా వానలా ,
ఎండలా కురుస్తుందా?
ప్రేమలా  వ్యాపిస్తుందా ?


3


నిధులన్నీ నీదగ్గరే పెట్టుకో స్వామీ 
ప్రేయసి నొక్కసారి 
నాకోసం నవ్వి పొమ్మను 


4


ఏమివ్వగలను నేస్తం 
అక్షరాలతో అలంకరించుకున్న 
పూలగుండె వెతలు తప్ప 


5


నా గుండె వర్ణం తెలియదు 
బహుశా
నీ మనసు వర్ణమేనేమో 


6


నిన్ను మొత్తం మర్దించుకొని 
నా గుండె మూసలో నింపుకుంటా 
పూల గుండెల్లో 
మకరందం ఎట్లా నిండునో....


7


నా అక్షరాలకి 
పట్టరాని ఆనందమట 
నువ్వు చదివే సమయాన 
నీ కంటి స్పందనలకి పులకించి 


   .....



నా సెలయేరు హృదయం .....15

నీ కంటిని అలంకరించి 
వెలిగించిన కాటుక పోక తప్పదు 


నీ పెదవుల చేరిన 
ఎర్రెర్రని సూర్యుడు వాలక తప్పదు 


నీ హృది లోపల కలగలిసిన 
నా ప్రేమకు పులకింతలు తప్పవు 


                ఈ స్మృతి లేని లోకానికి 
                ఏది శాశ్వతమో చెప్ప వా 
                ప్రియురాలా .....!
                ఈ రాత్రిని వెళ్ళనీయకు 


             .....

Sunday, May 27, 2012

దానిమ్మ గింజల జల్లు .....4

1


హొయల హొయల సముద్రానివి నీవు
వదలకుండా చుట్టేసిన 
ఇసుక తీరాన్ని నేను 


2


ఎన్ని బోనులు 
చేరి ఉన్నాయి నీలో ...
ప్రతి దాంట్లో నేనే 
ఎందుకున్నాను?


3


నీవు కళ్ళతో నవ్వితే 
నేను అక్షరాలా 
మనసు  తో నవ్వేస్తా 


4


కొన్ని సన్నివేశాలు తగిలి 
గుండె కాగితాలు 
రెప రెప లాడతాయి


5


నీవు సగమే మాట్లాడతావు 
మిగతా సగం నీ మౌనం 
ముసి ముసి నవ్వు 


6


పూలు ఆకుల మీద 
చినుకులు వాలతాయి కదా 
నేను నిన్నలా చేరనా?


7


అధరాల వరకు చూసాక 
నేను శిల నయ్యాను 
నీ కంటి చూపు తగిలి 
నేను ప్రేమికుడయ్యాను 


8


నాకిష్టమైన సముద్రభోజనం వద్దులే 
నీ గోరింట పండిన చేతులు 
ఇంకాసేపు నా ముందు ఉండనీ


9


నేను చీకటిని విసిరితే 
కోపంతో వెళ్లి 
కాటుకై నీ కంటిని చేరింది 


10


రాత్రి నా నరాల్లో 
పాకిన పాట
పొద్దున్నే గులాబి కొమ్మకు పూసింది 


      .....


Thursday, May 24, 2012

దానిమ్మ గింజల జల్లు .....3

1


నీ కోసం ఓ మల్లెను  ఇస్తే 
ఆనందం జల్లే 
వెన్నెల మనసే తెలుసుకో 


2


నీ కళ్ళల్లోంచి చూడు 
                    నన్ను 
లోకపు కళ్ళల్లోంచి 
కనబడను నేను 


3


చేతి మీది గీతలు 
ఎప్పటికీ మార్చని 
తలరాతలు 


4


కోపంతో వెళితే వెళ్లావు 
నీ ముక్కెరకు  
చిక్కుకున్నాను చూడు 


5


ఒంటరిగా నిలబడతాను 
సీతాకోక చిలుకల కొలను 
చుట్టూతా


6


నా మనసుగుండె 
మడతల్లో 
నీ పరిమళం దాగున్నది 


7


అద్దం ముందుకు వెళితే 
ముందు నువ్వు కనిపిస్తావు 
తర్వాతే నేను 


8


నా ఆత్మీయులను 
నా దుఃఖం గుర్తుబట్టి 
పలకరిస్తుంది 


9


ఎండా కాల్చేస్తున్నా 
నే  చల్లబడి ఉన్నా 
నీ తలపుల తడి తగిలి 


10


పంచాభూతాలే ఈ 
ప్రపంచము 
నేను నువ్వు ఇక గొడవెందుకు ?


     .....







Wednesday, May 23, 2012

నా సెలయేరు హృదయం ......14

అనాది కాలంతో 
పోటీ పడగలమా?


ఒక ఆకుపచ్చ గడ్డిపోచ 
సృష్టించగలమా?


ప్రేమను కల్గించడం 
ఒకరికి కుదిరే పనేనా?


                 ఈ మసక లోకానికి 
                 ప్రేమ పుట్టుక తెలియదు 
                 ప్రియురాలా.....!
                 ఈ రాత్రిని వెళ్ళనీయకు 


             .....

Tuesday, May 22, 2012

దానిమ్మ గింజల జల్లు.....2

1


కొన్ని రాత్రుళ్ళు
రహస్యాలు కుచ్చుకున్నాక 
నిద్ర కారిపోయింది


2


నీకోసం ఓ కలువ తెస్తే 
ప్రేమోత్కర్శలో మునిగిన 
గుండె గా తీసుకో





మాట కటువైనా
మనసు వెన్నెలముద్ద
కదా కలువా....!


       .....

Monday, May 21, 2012

దానిమ్మ గింజల జల్లు .....


1


జననం 
తొమ్మిది నెలలే 
తర్వాతి కాలమంతా మరణమే 




2


వెనక్కు చూసి... 
చూసి... చూసి వెళ్ళకు 
నీ తలపుకు తగులుకుంటాను 


3


నన్ను ఒంటరిని చేసి 
నిద్ర,పొద్దంతా అలిగిన స్నేహితురాలు 
ఒకటే గుస గుసలు 


4


లోపలి మనుషులతో 
స్నేహం చేసేదేట్లాచెప్పవా?
ప్రియురాలు కాని స్నేహితురాలా 


5


కళ్ళు ఆధరాలే కాదు 
మనసు కూడా 
ముసి ముసి గా నవ్వగలదు 




        .....

Saturday, May 19, 2012

నా సెలయేటి హృదయం......13

సంవేదనకు సౌందర్యానికి 
ఓ రహస్యం కలదు 


సౌందర్యానికి 
నీకు ఓ రహస్యం కలదు 


నీ నుండి నా వరకు 
ఉన్న ప్రవాహానికీ అదే రహస్యం కలదు.


                      ఈ మసక లోకానికి 
                      ఎట్లా తెలపడం 
                      ప్రియురాలా.....!
                      ఈ రాత్రిని వెళ్ళనీయకు 


                 .....

కొత్తగా పూస్తున్న గాలి

నేను నీకు
ఏదో చెప్పాలనుకున్నాను 


నా విచ్చుకుంటున్న భావాన్ని 
అందమైన పూలగుత్తిలా 
అలంకరించి ఇద్దామమనుకున్నాను 


కొత్తగా ఉండాలని 
అసలు వినగానే....
గుండె వెన్నెల ముద్దగునట్లు  
తయారుచేయదలిచాను 


మాటలు మల్లెల వంటివి 
మూట గట్టుకున్నాను 
రాత్రంతా చందనంలో తడిపి 
అత్తరు చల్లిపెట్టాను 


నిజం నీకు
ఏదో చెప్పదలిచాను ...


సంపెంగతో కాసేపు 
చింత చిగుళ్ళతో కాసేపు 
నీ గురించి మాట్లాడి 
నీ మనసురుచి సేకరించి 
వెన్నెల రాల్చిన ఆకాశపు చిత్రాల్ని 
కొత్తవి కొత్తవి కూడబెట్టుకున్నాను 


ధ్యాస ధ్యానమై 
ప్రతి నిమిషంలో 
నిను బంధించుకుంటూ 
శ్వాసను పవిత్రం చేసుకుంటూ 
ఆత్మను అలంకరించుకుంటున్నాను 


నిజం నీకు 
ఏదో చెప్ప దలిచి 
నన్ను నేను 
మార్చి మార్చిరాసుకుంటున్నాను 




         .....

Thursday, May 17, 2012

నేను లోపల వెలితి

సాయంకాలపు వేసవి గాలి 
పాడటానికి వచ్చింది... 
వెలితిగా ఉన్న నను చూసి 
చెట్టు మీది వీణను వేడుకుంది 


మనసు ఘనీభవించే సమయాన 
రాత్రి భయపడింది...
వెలితిగా ఉన్న నను చూసి 
వెన్నెలను బతిమిలాడింది 


కలతలు కలబోసుకుంటున్న సమయాన 
దుఃఖం భయపడింది ...
వెలితిగా ఉన్న నను చూసి 
మధువును వెంట బెట్టుకొచ్చింది


                 .....  



పూస గుచ్చినట్టు ....

రెండు తలకాయలు
రెండొందల గడబిడలు


ఎవరినుంచి ఎవరిదాకా పాకుతుందో...
ఎట్లా పారుతుందో తెలియదు జీవితం 


కరెంటు స్తంభాలకు చుట్టుకొని 
గాలికి కొట్టుకుపోయి 
రాళ్ళకి తగిలి 
మోరీల్లోనాని 
మోసపోయామనుకొని.......


*********
''అయిందేదో అయింది''


ఈ ఒక్క మంత్రం చాలదా 
జీవితం నేట్టుకుపోవడానికి 


           ..... 

Wednesday, May 16, 2012

నా సెలయేటి హృదయం ......12

మనసును విప్పితే 
మనిషి కాడంటారు 

నిజాన్ని తెలిపితే 
తెలివేలేని పిచ్చివాడంటారు

రహస్యం చెబితే 
రాళ్ళు విసిరి కొడతారు 

                     ఈ లోలకపు లోకానికి 
                     ఎట్లా ఉన్నా తప్పే 
                     ప్రియురాలా.....!
                     ఈ రాత్రిని వెళ్ళనీయకు 

                .....

Tuesday, May 15, 2012

నా సెలయేటి హృదయం ......11

సంపదలు విసిరే గాలాలకు 
చిక్కుకున్నారు కొందరు 


అంతస్తుల కోసం 
కాసుల వలలో చిక్కుకున్నారు కొందరు 


మనమో....ప్రేమకు వశమైన 
నిశ్చింతను కలిశాము 


                   ఈ ఆశల లోకానికి 
                   ఇది ఎట్లా అర్ధమగును 
                   ప్రియురాలా.....!
                   ఈ రాత్రిని వెళ్ళనీయకు 
               
              .....
                   


                  

Monday, May 14, 2012

అద్దం

నేను అద్దంతో 
పోట్లాడతాను 


నన్ను నా ముందర నిలుపుకొని 
అద్దం తో పరిహసిస్తాను 


నేను అద్దానికి 
చాలా ప్రశ్నలు విసురుతాను 
సంతృప్తి పరచని జవాబుల చిత్రాలు కనిపిస్తాయి 


కోపంతో 
నా గుండెకాయతో కొడతాను 


అద్దం ముక్కలౌతుంది 
ప్రతి ముక్కలో నాకు 
లోకం కనిపిస్తుంది 


నాకు తెలిసి పోతుంది 
నేను వాటికి 
ఎప్పటికీ అర్ధం కానని.


      .....

Friday, May 11, 2012

నా సెలయేరు హృదయం ......10

చంద్రుడితో కలిసిన కరుణ 
ఈ భూగోళంపై కురిసిన కానుక 


మల్లెల జత చేరిన అనురాగం 
జీవులలో కరిగిన సత్యధార 


రెండూ కలిసి ప్రణయిస్తే 
మన కాలం ఫై మొలకెత్తిన ప్రేమ 


                         ఈ నీరస లోకానికి 
                         ఇది ఎలా చెప్పను 
                         సఖియా......!
                         ఈ రాత్రిని వెళ్ళనీయకు


                    .....

Tuesday, May 8, 2012

నా సెలయేరు హృదయం ......9

గుడులు గోపురాలు 
దేనికోసం తిరుగుతాను...

నదులు గుండాల్లో 
ఎందు కోసం మునుగుతాను ...

అన్నింటా నిన్ను స్పర్శిస్తాను 
అణువణువుని ప్రేమమయం చేస్తాను 

                                ఈ కుటిల లోకానికి 
                                లీనమవటం తెలియచేయి 
                                ప్రియురాలా...!
                                ఈ రాత్రిని వెళ్ళనీయకు 

Sunday, May 6, 2012

కొన్నిఅజ్ఞాత కాంతులు నా అతనివి

         1


అదృష్టానికి పనివాడివి 
ఇక నీతో నీకు పనిలేదని 
ముఖం మీదే తలుపులు మూసాడు
                                              అతను 


నేను రంగులు మార్చుకుంటూ 
మనుషుల మధ్య 
నవ్వుల్నీ భుజాన మోసే సందర్భాలు 
                                                అతని 
కంటపడి సిగ్గు పడ్డాయి 


''ఇద్దరి సాహచర్యం మధ్య విలువలు 
ఇద్దరి ఆలింగనాల మధ్య అంతస్తులు 
మనుషులు సంపదలతో కుట్టుకొని 
సంబరాలలో తనని వదిలి పోయాడు 
వెతుక్కోవా?...వెతుక్కోవా?....''
                                               అతనే
            2


ప్రశ్నలు రాపిడి చేసి 
విసిరిన మంటకి 
బతుకు కమురు వాసన


ఒంటరితనం లో 
అతను నాతోడు 
అందరి మధ్య అజ్ఞాతం 
మా తోడు


మనసు ఉరేసుకొనే 
సందర్భాలలో అతను ప్రవేశిస్తాడు 
కొంత కొట్లాట తర్వాత 
వెతికినా దొరకడు


క్షణానికి ముందు భాగాన 
ప్రవేశించి 
క్షణానికి చివరి కొసన 
కనిపించడు 


ఆ మధ్యది అజ్ఞాతం .....


        .....

Friday, May 4, 2012

నా సెలయేరు హృదయం......8

వర్షపు హృదయం తిరిగి తిరిగి 
సముద్రపు ఒడిలో కలియక తప్పదు 


గాలి సరసాలు వీచి వీచి 
పూల తోటల చెక్కిళ్ళ మీద వాలక తప్పదు 


నేను ప్రేమదిమ్మరి నై
చివరికి చేరే చోటు తెలియదా?


                        ఈ వ్యసన లోకానికి 
                        ప్రకృతిధర్మం తెలియచేయి 
                        జవరాలా.....!
                        ఈ రాత్రిని వెళ్ళనీయకు 


                    .....

Thursday, May 3, 2012

నా సెలయేరు హృదయం.....7

ఉదయించక ముందు 
తూరుపు కదలికల సౌరభం నీవు 

వికసించే ముందు 
పూవుల మకరందపు యవ్వనం నీవు 

అటూ ఇటూ పరిభ్రమలు చేసే 
సౌందర్య పిపాసిని నేను 

                     ఈ మసక లోకానికి 
                     రసికులు పాపులు 
                     ప్రియురాలా.....!
                     ఈ రాత్రిని వెళ్ళనీయకు 

                     .....