Monday, December 31, 2012

నడిచినదంతా వసంతమే



పాచిక నువ్వే 
విసిరుంటావ్  

నీ గుండె ధైర్యానికి 
మృత్యువు మురిసి పోయింది 

నా చిన్ననాటి చెలికాడా 
శివ శివ రాజ రాజా శివరాజా..

సూర్యునికి ముఖం లేదు 
ఈ పూట తో ఈ సంవత్సరమూ 
నీతో పాటు  కాలి మసవుతుంది 

జ్ఞాపకాల్లో ప్రాణం పోసుకుంటావు
బతికిన జాడలన్నీ 
సతత హరితంగా చిగుళ్ళు తొడుగుతాయి

నా గుండె మీద 
అంటుకుపోయిన ఆలింగనం
కామంచి సైకిల్ తొక్కుడం నేర్పుతుంది 

నువ్వు జేబు నిండా తెచ్చిచ్చిన 
రేగు పండ్ల తియ్యని కాలం 
మళ్ళీ కోసుకొస్తావా...!

పరుగు పందెం లో 
ముందుకు పోయావు మిత్రుడా!
సెలవు సెలవు .

ఈ ప్రపంచం నుంచి 
నువ్వేం నేర్చుకున్నావో తెలియదు కాని 
నీ నుంచి తెలుసుకున్నది మాత్రం 
కమ్మని స్నేహం .

  .....

Sunday, December 30, 2012

మనుషులు రేపే తుఫాను

తైలవర్ణ చిత్రమై 
జ్ఞాపకం పరుచుకున్న 
ఉచ్వాస నిశ్వాస మధ్య 
శుభ్ర లిప్త సమయాన్ని 
నీకిస్తున్నా ...

నిశ్శబ్ద సమయాల్లో 
సూర్యున్ని పూసుకున్న ప్రకృతి 
ఎర్రెర్రగా ...
నా గుండెల మీద చిగురిస్తున్నది 

ఒడ్డున ఉన్న నన్ను 
ఆలోచనల సేలయేరొకటి కొట్టుకు పోయి 
దిబ్బలా విసిరిన సమయాలు 
కరుకు గా కుచ్చుకుంటున్నాయి 

దూది కన్నుల్లోంచి 
పిండిన కొద్దీ దుఃఖం 
తడుస్తున్న దేహం 
ఆవిరి సెగల మౌనం తో 
దీనంగా పలకరిస్తున్నది 

ఆకలి పేగుల బంధాలు 
తరతరాల కాలాన్ని చుట్టుకొని 
బతికిన ఆనవాళ్ళని 
బందించి  ఆగిపోయిన 
కమలిన రాత్రి కలవరపెడుతున్నది

సజీవంగా ఉన్న సకలం  
స్పర్శ కల్గి ,
ప్రశ్నల్నిమర్మంగా 
నరాల్లో మెలికలు పెడుతున్నాయి 

మనసు చుట్టూతా పొంగిపోతున్న 
సముద్రం.


Sunday, December 16, 2012

స్వభాష 1


ఈ ప్రపంచం ఇట్లా సాగకుండా ఆగదు.దాని పుట్టుక నీకు అంతు పట్టనట్టే ఎట్లా దొర్లుతుందో మాత్రం తెలుసుకునే తాపత్రయం వదులు.మనం ఇక్కడ గుండెలలో గుండెల్ని వెలిగించుకుంటూ మనసు నిండా మార్మోగుతున్న భజంత్రీల సాక్షిగా అణువణువును ఆలింగనం చేసుకుంటూ, అడ్డదిడ్డంగా బుద్దిని బెత్తం నీడన సవరించుకుంటూ బండి గిల్లను అనుకరించక తప్పదు .దూరాలను చేరుకోవటం ఏమీ ఉండదు.నీ దగ్గర కొచ్చేదే నిలువు అడ్డంగా చీల్చినా ,తర్కించినా మిగిలేది క్షణమే ...ఇంకా విభాగించినా ఆ క్షణ కణమే.నీ సంచీ ఖాళీ చేసుకో,మున్దేముందో పదునుకు నేర్పు .పనికిరాని ఆవరణలో లేని దుమ్ము నిండిన వాక్యాల్ని శుభ్రపరుచుకో .పరిమళపు నవ్వుల్నీ ఆశ లేకుండా ఆస్వాదించే మనసు గదుల్ని శుభ్రం చేసుకో.

ఆనందుడా...!

ప్రాణాన్ని వెన్నెల తో తడుపు.


ఇంకొంచెం



ఊపిరి నిండా పరిమళపు
వెల్లువ ఉప్పొంగనీ 


కన్నుల్లోపలికి కనిపించని 
మార్దవ వాతావరణాన్ని ఇంకించుకోనీ 


కలతల వ్యవధి దాచిన 
కన్నీటి తలాన్ని నిద్రించనీ 


గరుకు  గుణాంతర భ్రమల్ని 
వేళ్ళ నుండి తుడిపేయనీ 


కడుపునిండా తడి మూలాల్ని 
ఉన్నదున్నట్టు ప్రేమించనీ 


చెరసాలల మందాల్ని 
గుడ్డి గునపాలతో నైనా సరే  ఛేదించనీ 

ఆకర్షించనీ 

భూమి నిండా పొదిగిన కాంక్షను 
పరిణతి రంధ్రాలలోంచి జారనీ 

మనసు నొదిలిన అంగాల కుతిని
భయంగా కాంక్షించనీ  


అతి విలువైన దేహాడంబరాల్ని 
మినరల్ నదుల్లో కడగనీ 

రంగు రంగు ల చీకటిని 
గొంతు నిండా దాచుకోనీ 

పసి కణాలు కదులుతున్న 
దారి తెగులు తొలగించనీ 

మౌనం వెనకాల దాగిన అనేక 
కాక్టస్ కలల గొంతు నులమనీ 

ప్రియురాలా...!
ఇంకొంచెం దుఃఖించనీ 

   .....

Saturday, December 15, 2012

నా సెలయేరు హృదయం .....35


సందర్భాలు నీతోనో నాతోనో
ప్రాణం పోసుకుంటాయి 


ప్రేమను చుట్టిన ఆలోచనల్ని 
ఆనందంగా దిగంతాలకు ఎగరేయవచ్చు 


నన్ను చేరని వాక్యం 
నీదగ్గర పదిలమే కదా...!

ఈ మసకలోకానికి 
ప్రసంగాల పనెక్కువ 
ప్రియురాలా ...!
నీ సమయానికి వందనం.

     .....

Friday, December 14, 2012

2442



ఎటు చదివినా 
దుఃఖ పు తలరాత ఒకటే 

ప్రతిబింబానికి 
మనసు తెలుసు 

రెట్టింపు కలలు 
నాట్యం చేసుకుంటూ 
ప్రతిమలౌతాయి 

నీ మనసు కోసం 
ఆవిరౌతున్న 
నా లోపలి ఊహల గాలి 

ఎవరు కలుపుతారు 
రహదారుల్ని?

మెరుపుల చుట్టూతా 
చీకటి కుట్టినారు 

అసలు మాట్లాడుతున్నది 
అద్దం నిశ్శబ్ధం .

Wednesday, December 12, 2012

‎12.12.12



ఎక్కడ కనబడతావో?

నన్ను నీలో కనుక్కుంటా ...

నీ వెంట తిరిగే సమయమూ నాదే

నీ శబ్దం శృతి లయల కోరికతో హోయలకాంతి ని పూసింది

నా అనాధ ఊహలు నిన్ను చేరలేవు

నా నవ్వుల దిక్కులు శుభ్రం

అక్షరాల చందమామా...

.....

Tuesday, December 11, 2012

మనసు నురగల ఆవిరి



నక్షత్రాల మధ్య 
మినుకు మినుకుమన్నది చీకటి 

మనసు గా మారిన రాత్రి 

ఎన్నాళ్ళ కెన్నాల్లకో 
బొంగరంలా తిరిగి తిరిగిన ప్రేమ 
కంట పూసింది 

జీవితం మాట్లాడే భాషకి 
నీవు పలికే అర్ధానికి 
ఎప్పుడూ పొంతన కుదరదు 

మోహ మూలంతో 
కరిగిన గుండె ఆనవాలు దొరకదు 


ఒకటి తర్వాత ఒకటి 
కుడురు కుంటాయనుకుంటే పొరపాటే 
కాసేపు నిలబడదాం 
దేవుడి కై వరుసలో ఒంటరిగా .


కనీస మర్యాదలు కూడా నోచుకోని 
వయసు వేసే ప్రశ్నలకి 
ఎక్కడ వెతుకుతున్నావో !


త్వరగా 
త్వర త్వరగా 
ఆకలిని కూడా మన్నించు 
భయాన్ని నిద్రలేపకు 


మనసు స్పర్శకు అంబరం తెలుసు 
కానీ ...కన్నీటిలో 
ఓలలాడుతుంటది 


ఫుట్ పాత్ కి అవమానం లేదు 
పూల రుతువు వెన్నువెంట 
ధైర్యంగా పూస్తుంది .


     .....

Thursday, December 6, 2012

నా సెలయేరు హృదయం .....34



ఏవి కొలవటానికైనా 
అనేక కొలమానాలున్నాయి 


నేనెంత దూరమో 
నా మనసు నెట్లా కొలిచేది 


ఉన్నపళంగా నీదగ్గ రుంటూ 
నా లోపలుంటాను 


ఈ మసక లోకానికి 
కొలతల మీద కోరికెక్కువ 
ప్రియురాలా ...!
కొలబద్దల్లేని కోర్కె నిండాలి .

      .....
6.12.2012.

నా సెలయేరు హృదయం .....33



అలలు కోరికలయ్యాయి 
తడి తోడైంది 


ఆకాశం నెలవు కాదు 
నెలవంక మాత్రం గుండె వీడదు 


కళ్ళనిండా ప్రకృతి 
పాట పాడుకుంటుంది 


ఈ మసక లోకానికి 
ఇదేమి అలవాటో...
ప్రియురాలా ...!
నా ఒంటరి గుండెని తవ్వుతుంటది .

     .....




Wednesday, December 5, 2012

ఈ వేళలో .....3



అనుకోకుండా వేళ్ళ సందుల్లోంచి 
మెతుకులు జారి పడ్డట్టు... క్షణాలు,
పట్టుకునే లోపే 
చిక్కకుండా చిక్కబడి 
జ్ఞాపకంగా ఘనీభ విస్తూ ...


నీకోసం రావాల్సిన ,కాకపొతే పాడాల్సిన 
రాగం దయతో మన్నించమనే 
ఏ వాతావరణపు రద్దీ లోనో 
ఒంటరైందేమో...


ఒక ఉత్తేజిత మననం 
శ్వాస గా మారి 
వాయు సంతకమై 
నీ వాకిటి మొక్కల చుట్టూ వలయంగా...


ధ్యాస లో నీవున్నావా?
ధ్యాసగా మారావా?

    .....

Tuesday, December 4, 2012

ఈ వేళలో .....2



కొన్ని బిగపట్టుకుంటున్న
శ్వాస ల్లో నువ్వుంటున్నావు 

గాలి మోసుకొచ్చేప్రతి సమయము 
నీ స్పర్శ లోనే పులకిస్తుంది 

మానసిక రహదారులన్నీ 
శుభ్రంగా నీ వైపుకే జారి ఉన్నాయి 

ఎప్పుడో గాని అసత్యం పిండదశ 
తొలగించుకోక తప్పదు 

అకాలం అసలుండదు 
ఎన్ని చెప్పినా చీకటికి 
కొంత సమయముంటుంది ...
అదే దాని ఆయువు .

వెనుదిరిగి చూసుకోక తప్పనప్పుడు 
వాదనల చెదలు చేసేపని 
తెలియనిది కాదు.

ఏమోలే!
అన్నీ సూత్రాలలో చిక్కవు 
అసలు చిక్కులన్నీ సూత్రాలనుంచే ...

తప్పులు కూడా దృష్టి మార్చు కుంటాయి 
మూడో కన్నె ప్పుడూ 
మెడ పొడవు చేసుకొని 
మెదులుతుంటుంది ,
మనం జాగ్రత్తగా దాన్ని ముయ్యాలి 
లేదా 
మన కంటి చుక్కల నైనా 
నిరపాయంగా ప్రేమించాలి 

ఆకలి మీద ఆన 
సత్యానికి అనేక వ్యాఖ్యానాలుండవు .

       .....
4.12.2012.

ఈ వేళలో .....1



రాత్రుళ్ళు వేసే ప్రశ్నలకి 
పగళ్ళు వెనకాడతాయి.
కాకపోతే మౌనంగా 
సూర్యున్ని నేట్టేస్తాయి 


సమాధానమొక సముద్రం లోపలి 
అలజడే అయితే 
లోలోపల కుతకుత లాడటమే 
విస్ఫోటనం కంటే మేలు 


నీవు ఎన్ని సముద్రాల కలయికో?
తెలియకనా.....కవీ!
కంటి తడినైనా తోడుగా ఉండనీ ...


బహుళ ప్రేమల్లో 
కలకలల వెలుగుల్లో 
మెదలక పోతేనేమి?
అక్షరాల వెంట 
చలనం ఉంటుంది 
అది నీ ఆత్మ సారమే.

     .....