Friday, June 29, 2012

చల్ చల్ గుర్రం



చల్ చల్ గుర్రం 
చలాకి గుర్రం 
ఆటలు పాటలు సాగాలి 
ఆనందమె అంతా నిండాలి 




పారే నీటిని కలవాలి 
వీచే గాలిని నిమరాలి 
కోకిల గొంతును తడమాలి 
పిచ్చుక గూళ్ళను నేయాలి 




నెమలి ఈకలా మెరవాలి 
గాలి పటంలా ఎదగాలి 
రోజా పూల సొగసడగాలి
మందారంలా మురవాలి 




అక్షరాలతో ఆడాలి అహ
లెక్కలతోన ఎగరాలి 
తీసివేయాలి కోపాలు 
కలిసిపోవుటే కూడికలు 




ఒకటి నుండి పది స్నేహాలు
ఎక్కడ కూడా విడిపోవు 
భాగాహరమే వివేకము 
గుణకారాలౌ మంచితనం 




ఎందుకు?ప్రశ్నను విడవద్దు 
ఏమిటో?తెలుసుకో ప్రతి పొద్దు 
వదిలి వేయకు ప్రతి పేజి 
వెంటపడితే ప్రతిదీ ఈజీ 




పెద్దలయెడ నీ గౌరవమే 
వెంటవచ్చునీ బతుకంతా 
మానవత్వము ఎదగడమే 
మనుషుల తరగని విలువంతా                     " చల్ చల్ "




              .....

Thursday, June 28, 2012

వెంటపడుతున్నది...



స్పష్టమైనది ఏదీ 
కానరావటం లేదు 
విప్పుకున్నట్లుగా ఏదీ 
ఒప్పుకోవటం లేదు 


ఎక్కడ నడిచినా 
కాళ్ళ ఉపయోగమే తప్పనట్టుంది 
ఆలోచనని ఇంకే 
అవయవమూ పంచుకో 
అర్హత కలిగి లేనట్టుంది 


నేనే విశ్వవ్యాప్తమై 
అన్నింట్లో హతమౌతున్నాను 
నేను గాలం వేయక ముందే 
బల్లి నోట్లో చిక్కి 
రెక్కలు కొట్టుకుంటున్నాను 


అడపా దడపా పూల వాసనలు 
చూచినంత మాత్రాన 
మకరందం దోచుకున్నట్టా?
ప్రసాదం చప్పరించినంత మాత్రాన 
దేవుడు వశమైనట్టా?


నివాస యోగ్యత ఎక్కడా ఉన్నట్టు లేదు 
మనసు పారదర్శకత 
కాపాడు కునేటట్టు లేదు 


ఎన్ని విషాదాలు 
ఇంకా వెంటాడతాయో!
ఎన్ని అసత్యాలు ఇంకా 
తూటాలౌతాయో!


రక్షక పత్రాలు ఉన్నట్టులేవు 
లోహపు అవయవాలు లేవు 
మనసు గుండెని చుట్టి 
దుర్భేధ్య కట్టడాలు లేవు 


ఎవరి మాటలకి భస్మ మౌతామో 
ఎవరు పాదం మోపితే నలుగుతామో 
ఎవరి చప్పట్ల మధ్యన చిట్లుతామో 
హఠాత్తుగా 
ఎవరు మూసిన పుస్తకంలో అనిగిపోతామో


        .....

చిటపటలు



నీ కంటే 
నీ మాటలే వెంటాడతాయి 


నేనేమంటానోనని
నీవు విసిరే బాణాలు గుచ్చుకొని 
నా లోపలి వాక్యాలు కూడా 
విరిగి వికలాంగాలై మూలుగుతాయి 


నీ ఒక్క దానికే 
సువాసనా స్పందనలు తెలిసే 
హృదయమున్నదని నీ ఊహ 
అలా చేసేందుకు నా గుండె 
ఎన్ని గిరికీలు కొడుతుందో 
నీకు తట్టదు,పట్టదు.


ఎప్పుడూ విచారాలు 
వివాదాలు ,తర్కాలు 
బాణాసంచాలు  ...


ఇద్దరమూ కలిసి 
ఈ సమయానికి కాస్త 
విశ్రాంతి నివ్వకూడదూ ...


        .....

తిరుగుబోతు



చాలా ఏళ్లుగా ఇంట్లో ఫ్యాన్ 
మా కోరికల మీదుగా 
తిరుగుతూనే ఉంది 
మా బాధల మీదుగా కూడా 
మా పిల్లల చల్లగా ఆడిస్తూనే ఉంది 
మా చెమటల్ని జోకొట్టింది 


హఠాత్తుగా 
మోకాళ్ళుఅరిగినట్టున్నాయో ,
లేదా,బుర్ర తిరిగినట్టుందో 
విమానం లా గొంతెత్తింది


ఏది ఏమైనా 
నిన్నటి రాత్రి 
కళ్ళు మూసుకున్ననన్ను 
ఆకాశమంతా తిప్పుకొచ్చింది


       .....

Tuesday, June 26, 2012

చినుకు చినుకు



చినుకు చినుకు చినుకు 
చినుకు చినుకు చినుకు 
చిట్టి చిట్టి చినుకు 
తేనె జల్లు చినుకు 


రాత్రంతా చినుకు 
నిద్రంతా చినుకు 
చెవి నిండా చినుకు 
చెట్టు నిండా చినుకు 


పల్లె మీద చినుకు 
పశువు మీద చినుకు 
మట్టి మీద చినుకు 
మనసు నిండా చినుకు 


దారినిండ చినుకు 
దాయలేని చినుకు 
గాలి వెంట చినుకు 
గోల గోల చినుకు 


గుడిసె లోన చినుకు 
గుడి నిండా చినుకు 
రాతి కొండపై చినుకు 
రైతు గుండెలో చినుకు 


పిట్ట రెక్కపై చినుకు 
కోడి జుట్టుపై చినుకు 
ఎద్దు కొమ్ము పై చినుకు 
ఎక్కడైనా చినుకు 


రాక రాక చినుకు 
గడ్డి వాకిట చినుకు 
తాటి కొమ్మన చినుకు 
తోట కడుపున చినుకు


కొర్రు మీద చినుకు 
కోరికలపై చినుకు 
అమ్మాయి నవ్వు చినుకు 
అక్షింతలై చినుకు 


ఆకాశం పాట చినుకు 
మేఘాల మాట చినుకు 
మెరుపు ముక్కై చినుకు 
ఎగిరొచ్చిన సంద్రమే చినుకు 


తెల్ల మల్లె చినుకు 
అమ్మ చెయ్యి చినుకు 
భూమికి బువ్వ చినుకు 
ఆనందం మువ్వ చినుకు 


        ..... 


రిపేర్



ముందు చేయగలవా లేదా 
చూడు ...


అక్కడ విచ్ఛిన్నమైనవో 
శిధిలమైనవో 
పెచ్చులుగా రాలినవో 
తనంత తానుగా వదిలి వెల్లిపోయినవో 
ఎవరైనా తగిలి కూలి పోయినవో 
మాటకు మసిబారినవో 
నడుస్తూ నడుస్తూ విడిపోయినవో 
చూపులతో సగం కాలినవో... 




ఇంకా...ఇంకా...
నమ్మకం రాలిపోయినవో 
ఇచ్ఛ వాలిపోయినవో ఉంటాయి .


ఎలా చేస్తావో 
ఎలా కలుపుతావో 
కలిసే గుణమే లేని ఛిద్రాలని 
ఎలా పూరిస్తావో...


మళ్లీ అందులోంచి ఒక వసంతం చూడాలి 
బాల్యపు దూది చంద్రున్ని చూడాలి 
ఒక యవ్వనపు చిగుళ్ళు చూడాలి
ఓ కసితనపు కాంక్ష చూడాలి 
నునుపు వాంఛల్ని చూడాలి 


ఎలా కూడ బెడతావో
ఎలా అతుకుబెడతావో
మళ్లీ దాంట్లోంచి వశం కాని ప్రేమని చూడాలి 
దూప తీర్చే ఆలింగనం పొందాలి 
నిలువెల్లా వెలిగించే జ్వాల కావాలి 
ఎలా...ఎలా...


నిజంగా
దాని కిచ కిచలు మళ్లీ వినిపించగలవా
మళ్లీ దాని రాగాలతో కడిగేయగలవా
మళ్లీ ఈ ప్రపంచాన్ని అనుభవం గల 
గాయపడ్డ కాన్దిశీకునిగా దర్శించగలనా
మళ్లీ ప్రసాదానికి లైన్లో నిలబెట్ట గలవా 


అసలు వీలౌతుందా 
సూచాయగా ఓ నిర్ధారనకు రా
కొంచేమేమైనా తెలుస్తుందా...
చేయగలవా...
గలవా...


చేస్తూ చేస్తూ 
నువు కూలిపోగలవేమో
చూడు .




     ***** 





Monday, June 25, 2012

అంతం ఎటు చివర?

1


కొన్నాళ్ళే ఇక్కడ 
సాయంత్రం పుట్టే చంద్రకాంత పువ్వులా 


ఇది తాత్కాలిక భూమి 
ఆ తొమ్మిది నెలల తర్వాత 
అంతా మనది కానిదే 


మనుషులందరితో కాసేపు 
తిరుపతి కొండ మీద కలిసిన యాత్రికునిలా 


ఖరీదైన బంగారపు ఉంగరాలు
గింగారపు సోయగాలు 
ఆనందింప చేసే అంగవస్త్రాలు
కొంతకాలమే ......బాల్యంలా
కలకాలం పొందడానికి 
చంద్రున్ని కల్గిన భూమి కాదు మనం 
దాని మీది పురుగులం 


యవ్వనంగా 
మబ్బులు పట్టిన సాయంత్రం చినుకులా
నీ నవ్వుతో 
నడిచొచ్చి ఆక్రమించాక
మొత్తం బరువంతా తెల్లారినట్లు అనిపించినా 
అదీ కొన్నాళ్ళే 
కొంతసేపే .....


సౌందర్యం శాశ్వతమైనదేమో !...కానీ 
నేను?


తడుము కుంటున్నంత సేపే స్పర్శ 
ఆతర్వాతంతా ....ఊహ ,లేదంటే 
ధ్యానం .


2


శరీరం లోని రసాయన పదార్థాలన్నీ చలించి 
ఒక చోట కేంద్రీకృతమై 
ద్రవింప చేసిన నీ 
కనుచూపునొకదాన్ని గురించి 
మరిగి ఆవిరౌతుంటుంది 
నా శరీరానికి దూరంగా నిలబడి చూస్తూ ఉంటాను 
ఐనా ఎంత సేపు ?


నా కను తెరల మీద 
నిద్రపోయిన వాంఛల్ని
పిట్టల్లా లేపుతావు
కొంత తాండవం తర్వాత 
మళ్లీ నా చెట్టు మీద వాలుతూనే ...


వేల నరాల నాడులు దాడులు 
కొన్ని లీటర్ల ప్రేమ 
విసర్జిత వాంఛలు ..ఏవైనా 
పడమటి దిశకు వాలిపోతూ 
ప్రశ్నిస్తాయి.


అసహ్యాన్ని కూడా కొన్ని సెకన్లు 
ప్రేమించగలం ,లేదా
దుఃఖించగలం


ఉత్తేజిత కండరాల్లోని వీరత్వం కూడా 
మెరుపు లాంటిదే 


గమ్యమనే ఓ ప్రదేశం ఉంటుందా 
దేనికైనా?




    *****





Saturday, June 23, 2012

తెర్గాల లేసి .....

నేను నీ కోసం 
అటూ ఇటూ వాక్యం లేని 
ఓ ఖాళీ పొద్దునౌతా 




ఇంకించుకునే మనసు కోసం 
ఓ తెల్ల కాగితమై 
పరుచుకుంటా 




అనేక కువ కువల 
కిచ కిచల,గల గలల 
నిశ్శబ్దమౌతా 




నైరాశ్యాన్నంతా  
కళ్ళనుండి ఒంపుకునే 
కట్టేసిన మూగప్రాణి నౌతా 




(తెర్గాల=తెల్లారగట్ల )


      *****

Friday, June 22, 2012

తనకి

అన్నమై 
నా ఆకలి వెంటపడే 
తనకి 


ఆహ్లాదమై 
నా ఆలోచనల 
స్వచ్ఛపరిచే 
తనకి 


నా కోసం 
రెండు బంగారుగనులు 
కొల్లగొట్టిన 
తనకి 


ఒక్కోసారి 
నా దుఃఖాన్ని
చేవిపట్టి గెంటేసే
తనకి 


నా తప్పుల్ని 
భస్మం చేసి 
శుభ్రంగా క్షమించే 
తనకి 


ప్రతి ఆనందం లో 
నా అడుగుతో 
ఒక అడుగు వేసే 
తనకి 


పోస్టు చెయ్యని 
కవిత్వాన్ని 
భద్రపరుచుకునే 
తనకి 


మరో ఆమ్మై 
మరో నాన్నయి
నాకో చెట్టు నీడైన 
తనకి 




అక్షరాలా కానుక.


(మల్లేశ్వరి పుట్టినరోజుకి )

Wednesday, June 20, 2012

కరెంటు పురుగు

ఎక్కడున్నవోనని 
నిదుర పట్టని క్షణాలకు 
నచ్చచెప్పి 
ఖాళీ సంచి లో కడుపు నింపుకొని 


చీకటి మైదానాల మీదుగా 
మనుషుల విసర్జనాల 
నగ్నత్వాన్ని పీల్చుకుంటూ 
రైలు టాయిలెట్స్ పక్కన నక్కి 


రెక్కలొచ్చిన ఆత్రుతని 
దొర్లించుకుంటూ 
నీటితీరాన
తడిసిన పాదాలు తాకి
అచ్చోత్తుకున్న ఇసుక చాతీ మీద
కదిలి  




ఎక్కడున్నవోనని 
విశ్రమిస్తున్న 
గుడి మెట్లని లేపి 
ముచ్చట్లలో నింపి 
ఉదయ స్తోత్రాల తాకిడికి వణికి 
పసుపు కుంకుమల శోభను మోసుకొని 


నగరాల నాడుల మెలికల్నిదాటి 
కోటల మీదుగా పాకి 
పురాతన ఊడల మీదుగా ఊగి ఊగి 
కాలపు రహస్య జ్ఞానంపై పొర్లాడుతూ 


మళ్లీ మళ్లీ 
చీకటిని రోజూ కోలుకోమని 
వెలుగును ఆరబోకని 


ఆకు చివర్లనుండి రాలుకుంటూ 
పాటల తన్మయం లోకి చొచ్చుకొని 
పక్షుల కువ కువల హత్తుకొని 
గాలితపనలతో కలిసి 
ఎగిరెగిరి పారి, ఈది  


ఎక్కడ ఎక్కడ 
ఎక్కడున్నవోనని 


      *****





విత్తనపు వేళ్ళు

రెండు 
దూప మెదళ్ళు 
మెలికలు తిరిగి 


కోరిక పుట్టిన 
నదీ లోయల్లో కరిగి 


కంటి కండరాల 
దడ దడ ల ఢంకారావంతో 


గడ్డి పోచల వలె 
శూలాలైన వెంట్రుకల నరాలు 
నిటారు ప్రాణంతో 


వెన్నెముక నిండా 
విద్యుత్తు నాట్యం చేస్తూ 
నాడుల సొగసు కోరల మీద 
మంత్ర దాడుల పొగ లేచి 
లేచి  
రక్తం రచించిన జీవంతో 


ఎర్రెర్రని దూది 
నిండిన హార్మోన్ల తేజస్సు 
చేసిన తాండవం తో 


జలదరించిన మేఘాలు 
రాల్చిన వర్షపు చుక్కలో 
ఒదిగిన ఓజస్సు 


నేల రాలి 
సృష్టిని మోసే 
భావి విత్తనమై 
కలలను  పొదుగుకుంటూ 


      *****

Monday, June 18, 2012

ముసురు ముసిరే

పొద్దుట్నుండి
వాటేసుకున్న చలి ముసురు 


పిడికెడు పిడికెడు 
చినుకుల్ని 
కలబంద ముళ్ళ చివర్న 
వాడి పోతున్న జామ మీద 
నా లోపలి జటరాగ్నికొమ్మల మీద 
బుస్సున పొగలు అగడై 


ఏదో తినాలని 
మెదడులోకి మొలకెత్తిన 
నాడులు వణికి 
నోటితో శ్వాసిస్తూ ,ఏగుతూ...


నీ నిప్పుల మీద 
నడిచే వాడికి 
ఇదో లెక్క కాదు కాని 


ఆకలికి మంత్రం 
తెలియదు  


నీ గుర్తు రేపిన 
గొయ్యిలో  
నేను  ముసురు తో 
కలిసి మునిగి పోతున్నా 


      .....

శూన్యం ఒకటే.....

ఒకటి  
ఎప్పటికీ ఒకటే 


రెండుకూ
ఒకటికన్నా బిగువే 


తొమ్మిది వరకూ 
ఇదే తంతు 
ఎవరేం తక్కువ ?


ఏదైనా చెప్పు 
కూడికలు తీసివేతలు 
భిన్నాలు శాతాలు 
బిగుసుకున్నవలలు 


ఆ తర్వాత 
అంతా లయం 
శూన్యం లోనికి ప్రవాహం 


*    *     *


ఉన్నదే ఉంటుంది 
ఇంకోరకంగా 
కన్ను తిప్పుతావ్ 
మెరిసే మెదడుతో 


నేను ఒకటంటాను 
నీవు తొమ్మిది లోంచి 
ఎనిమిది పోతుందంటావు


ఇంకో మిత్రుడు 
ఆరు నుండి ఐదు 
తీస్తానంటాడు 


ఒకటి 
ఎప్పటికీ ఒకటే 


*    *    *


ఒకటికి 
ఒకటి కలిపితే 
తర్వాతి వాడు 


ఒకటికి 
ఎనిమిది ఒకట్లు 
కలిపితే 
తొమ్మిదో వాడు 


ఎన్నైనా చెప్పు
కలయికలు 
విడదీసే భాగాహారాలు 
లోలోపలి చేతి వాటం చర్యలు 


శూన్యంతో
అందరికీ 
పరిమళమే...


*    *   *


నీవు 
ప్రకృతి 
నేను 
పురుషుడు 


నేను
ఒకటి 
నీవు 
శూన్యం 


    .....



Saturday, June 16, 2012

నునుపైన వ్యధ

హాయిగా మాట్లాడుకోవడం గురించే 
నా విలువైన సందేహం 


నువు గాలికి పూసిన 
కస్తూరి వాసన తిరిగిన ఈ గది 
ఇప్పటికైనా 
తేరుకున్నదో! లేదో !


అన్నీ వేసేవి వేసాక ,ఇస్తూ 
చుంబించి ఇచ్చిన జిలకర చాయికి 
ఎంత పరిమళం అబ్బిందని?


నీ సవ్వడి వినని 
చిన్నబోయిన రాత్రుల్ల గొడవకి 
నేను రోజూ దోషిగానే 
మిగిలిపోతున్నానని 
తపనగా లేదో ...


నడిచే దారిలో 
కాగితపు పూలకు 
సుగంధాన్ని అద్ది పోయిన 
ముహూర్తం నుండి 
అవింకా తెరుకోలేదట 


కావాలంటే 
ఏడాదిలో ఒక 
గొడవ దినాన్ని మొదలుపెడదాం 
మన గుర్తుగా అందరూ 
పంచుకుంటారు 


మనసున ఒక నావ 
నీవైపుకే ఎప్పుడూ నడుస్తూ
కథలు కథలు గా నీ గుర్తులకి 
రెప రెపలాడుతూ ...


కాన్చనార పూల చెట్టు 
మనల్ని వెన్నెల్లో వెలిగించిన రోజు 
నీ నవ్వులతో పోటీని తట్టుకోలేక 
మబ్బుల్ని వెంట తెచ్చుకోవటం 
మరవగలనా?


నీ వెంట నడుస్తూ 
సముద్రపు ముంగుర్లతో తడుస్తూ 
నీ కై కానుక కోసం విసిగి 
నేనే  మల్లెనై నీ మనసంతా 
నాటుకున్నది మరుపు లోకి రాలిపోయిందా?


తగాదాలు రద్దు 


పరీక్షలు ప్రశ్నలుగా వదిలితే 
చేతులుకట్టుకొని నిలబడతా ...
మౌనమే సంతృప్తి పరిచే సమాధానం 
అయినా...! కాకపోయినా ...!


హాయిగా ప్రకృతి నిండా 
పరుచుకోవడం గురించే 
నా విలువైన బాధ 




      .....







Friday, June 15, 2012

DECLARATION




The heavy minds 
knelt around the 
silence 


stopping their 
grief at 
the gate reservoir

........

in rest 
a muscled heart

ceasing the movements
all sinews stiffening


cold skin 
left memories 

pupils fixed 
and dilated 

time that has 
stopped in the sight 

an unfinished 
query from the mouth 

cannot find 
the breathing place 


..........


do you know 
a kid believing
that i could awaken her 
threw me a confident glance 

bowing my head
i declared 


her 
last leave ....






.....


(TRANSLATED BY JAGATHI)

A SHOWER OF POMEGRANATE NUTS




Without a fervent feel, without it
My lovely darling
The entire world is but unreal!

Softly, I wiped
My tender heart
With your silky kerchief
And thoroughly washed
With the water of my two eyes
Just cut
At your comfort and convenience,dear!

We shall sit for a while
Let us allow
Even silence to communicate.

(Translated by M V L Narasimham Naresh)

దానిమ్మ గింజల జల్లు 6



అనుభూతి చెందడం అనేది లేకపోతే 
ఈ ప్రపంచమంతా 
అవాస్తవం ప్రియురాలా!

గుండెని మృదువుగా నీ 
కర్చీఫ్ తో తుడిచి నా 
కన్నీళ్ళ తో కడిగి పెట్టా 
నీ వీలుని బట్టి కోసుకు పో 

మనిద్దరం కూచుందాం
కాసేపు మౌనాన్ని కూడా
మాట్లాడుకోనిద్దాం





    .....

Thursday, June 14, 2012

బజార్లో కలిసి పోతావ్....

ద్రవించే సమయాన్ని 
గ్రంధస్థం చేయను 
కంటస్థం చెయనూ 


అత్తరు సౌరభం లా 
అలా గాలి మోసుకుపోగా 
ఏ సమయమూ 
వరండాలో నీ కోసం కూర్చోదు


రాతలు రాసిపెట్టినా 
పాటలు పాడిపెట్టినా 
నీ బాధకి అనువాదం 
ఏ వాక్యమూ స్వీకరించదనే 


ఓ పురాతన జ్ఞాపకానికి 
ఇప్పుడు కాల్లొచ్చినట్టు 


నువు తెరిచిన ద్వారాల్లోకి 
నాతో పాటు ప్రవేశించే 
దుఃఖానికి నిలకడ లేదు 


నీ బెదురు కరచాలనం స్పర్శకు 
కలవరపు కండరాల ఉరుములు 
మూర్చనల నాడుల మెరుపులు 


ఎన్ని సగంలో ఆగిపోయిన 
శిల్పాలు 


ఇంకా బీజం నాటుకోని
నవ్వులు 




     .....



Wednesday, June 13, 2012

ఒక మెట్టిక్కిన కాలం

చిట్టి గులాబీలు 
గుండ్రని మల్లెలు 
నూనేరాసి పౌడరద్దుకొని


సముద్రాన్ని 
బాటిళ్ళలో నింపుకొని 


ఇంకా ఎదగాల్సిన 
చిన్ని చిన్ని వెన్నెముకలు 
తెలియని భవిష్యత్తును 
సగం పచ్చి నిద్రను
కొత్త బాగుల్లో మోసుకొని 


తప్పొప్పుల పాఠాలు
చివర్లో కొత్త ఖాళీలు 
నిశ్శేష భిన్నాలు 
చీకటి చరిత్రలు 
దవడకు పెట్టుకొని 
చప్పరిస్తూ 


బ్రాకెట్లలో ఇమడని 
కొట్టుకులాడే మెదళ్ళను 
డ్రిల్ టైం లొ ఎగరేసుకుంటూ 
మమ్మీ స్నాక్ నవ్వుల్ని
నములుకుంటూ ...


స్కూల్ 
పులకింతలు 
చూద్దాం వస్తావా!


     ..... 

Tuesday, June 12, 2012

డిక్లరేషన్

నిశ్శబ్దం చుట్టూ 
మోకరిల్లిన 
బరువు మెదళ్ళు 


దుఃఖాన్ని
ఆనకట్ట గేట్ దగ్గర 
ఆపి ఉన్నారు 


...  ...  ...


విశ్రాంతిగా ఓ 
కండరాల గుండె 


కదలికలు ఆపుకున్న 
నాడులన్నీ 
బిగుసుకు పోతున్నాయి


చల్లని  చర్మం 
జ్ఞాపకాలు వదిలింది 


పూపిల్స్ ఫిక్స్డ్డ్డ్డ్ &
డైలేటేడ్ 


చూపులో 
స్తంభించిన కాలం 


నోటివెంట 
సగం లో నిలిచిన ప్రశ్న 


శ్వాస చిక్కిన చోటు 
దొరకదు...వెతకలేం 


--- --- ---


నీకు తెలుసా 
ఓ పసిపాప 
దూరం నుండి ఆమెను 
లేపగలనని 
నమ్మకపు చూపు విసిరింది 


నేను తలవంచుకొనే 
ప్రకటన చేసాను 


ఆమె 
అంతిమ సెలవు 


     .....
(ఈ రోజు ఒక చావు నిర్ధారణకి వెళ్లి వచ్చాక )





















Monday, June 11, 2012

కోపం కింద నీడ



నేను సగం నిద్రలో ఉన్నట్టున్నాను 
ఏదో అడుగుతున్నావు 
కోపానికి కొంచెం రంగులద్ది 
భూచక్రం లా చేసి వదులుతావు 

నీ ప్రశ్నలు బాణాలే
వదిలిన వెంటనే అవి 
రూపం మార్చుకొని కొరడాలౌతాయి 
ఏం చేయను 
సమాధానాలు వినే శక్తిని 
నీ ప్రశ్నలు కోల్పోతాయి 
అంటే... అవి అంగ వైల్యపు ప్రశ్నలు 

సరే ...ఎటూ ఒక దేశంలో 
తన్నులాడుకునే రెండు జాతుల్లా 
పోరాటంలో మన జీవితం 
మంచు ముత్యం కాక తప్పదు 
వయసుకు ముడత లొచ్చాక 
పల్లూడిపోతాయి ...
తప్పదు తప్పదు 

అప్పుడు నీ ప్రశ్నలు 
దూది వత్తుల్లా చేసి 
దీపం పెట్టు....
ఆ వెలుతుర్లో నిను చూసుకుంటూ
గడచిన కాలం లోని 
తేదీలను జోకులుగా వదులుతా 

నువ్వూ ముసలి నవ్వు 
నవ్వుదువు గాని 

.....


మన ముచ్చట్లకి పేరెందుకు ?

పరాయి ప్రపంచం లో 
బతుకుతున్న నేను 
నా జాడలు తప్పిపోయిన చోటు 
వెతుకుతున్నాను 
అందులో నిన్నూ _


నువు కలిసిన ఆకాశం 
ఇప్పటికీ ఉంది 
కానీ మన ముచ్చట్లు విన్న 
మబ్బులు దూరమయ్యాయి 


నీ గోరింట చేతులు వెన్నెల నింపి 
వేళ్ళ సందుల్లోంచి 
నా ముఖం మీదికి ఒంపితే 
తడుముకున్న నా చేతికి 
తడి తగిలింది 


రోజూ కొన్ని పొరల్ని 
పోగొట్టుకుంటూ 
మౌనాన్ని నీ కంపనాలతో 
రాజేసుకుంటూ 
పొద్దుట సూర్యున్ని బతిమిలాడి 
పక్కకు తోసి 
బాధల్ని ఉదయింప  చేసుకుంటూ 


నిన్ను చేరే ప్రయాణానికి 
ముగింపు ఉందొ లేదో 
కాలానికి గడియారపు ముల్లునై
పంచాలోకాల మీదుగా వెళ్తూ వెళ్తూ 
కొన్ని అక్షరాలని జార్చుకుంటాను 


నీకు వీలున్నప్పుడు చదువు 


అదే నా ప్రేమ జాడ 


     .....

Sunday, June 10, 2012

నీ హృదయంలో పట్టని ....

ఎందుకో ఓ సందర్భం 
ముచ్చట పడుతుంది 
గాలిని మచ్చిక చేసుకొని 
మన మధ్య చెండులా మారటం కోసం 


ఓ రహస్యం కనుగుడ్లు చిట్లి 
మోదుగు పువ్వులా అగ్గి వెదజల్లి 
మన ఉపరితలం ఫై 
మనసు సహా స్ఫోటకపు వాత  కాల్చివేస్తుంది


ఓ తలా తోకా లేని కౌగిలింత 
చిన్నప్పటి తాటి మట్టల బండిలా
గుంజుకుపోయి 
గుండెను డీ కొట్టి చిత్తడి చేస్తుంది 


ఓ రాత్రి 
మన యుద్ధాన్ని చూడలేక 
ఉడతలా ఉరికురికి 
పడకగది పుస్తకాల్లో నిర్వీర్యమౌతుంది 


నీ చేతులకి నా గుండె కణాలు 
ఏ సమాధానమూ చెప్పలేవు



ఓ చెలమ తోడి సిద్ధంగా ఉంటుంది
నన్ను చూసుకొమ్మని 








      .....