Tuesday, May 27, 2014

అనేక పొరలు పొరలుగా భ్రాంతి



జీవితం ప్రారంభంలో కనిపించినదేదీ
ఇప్పుడు మసక కింద ముడుచుకుంది
లెక్కల్లో తేలని జ్ఞానం
మాటల్ని సవరించుకుంది
ఒక చల్లని పరిమళం తన ఉపరితలాన్ని పంచుకొని
మురిసిన కాలం రంగు వెలిసింది
నాకోసం పాటపాడిన చిటారుకొమ్మన చిలుక ఎగిరిపోయాక,
రాగం తిరిగి తిరిగి నా వెంట శోకం లో కలిసిపోయింది
వ్యధ కూడా వెన్నెల లాంటి చల్లదనం కురిపించిన విషయం తెలిసి
దానికీ గుండెని పంచి పెట్టాను.
ఇప్పుడు అది కూడా నా ఆనందకేంద్రకమే.
ఎప్పుడూ కనిపించే ఆకాశం లో కూడా
ఎన్ని రకాల కదలికలు ప్రవహిస్తాయి కదా …
అంగీకరించడమే దాదాపు మెలిక
ఐనా
నా కోసం కొన్ని తలుపులు మూసే ఉంటాయి
వ్యామోహం లేని స్పర్శ కోసం
కొంత జీవితం వెంట నడుస్తున్నా …
అందుకే కావచ్చు కొన్నిటిని కోల్పోయింది
ఎంత చెప్పుకున్నా
మనసుకీ… హృదయానికీ
ఈ వస్తు ప్రపంచానికీ దారులు కలియడమే కుదరనట్టుంది.
దుఃఖమే ఏ వాంఛా లేకుండా
తన మీదికి తీసుకొని లాలిస్తుంది.
ఓ అపరిచితురాలివలె.


        .....

ఇది వాకిలి ఈ పత్రికలో వేసుకున్నారు .సంపాదకులకు ధన్యావాదాలు.

మనసు పొరల జల

కథా ఆరంభానికి ,
ముందు జరిగిన కథ
ఎప్పుడో బయటకు రాక తప్పదు

* * *

ఎందుకో పసిగట్టే పరికరాలు నా కాడ లేవు
నిన్ను చూడంగానే
ఎక్కడో పేరుకుపోయిన దుఃఖం
ఊపిరాడనివ్వదు

ఇంత వేసవి తీవ్రతని తడుపుతూ
నీ తలపొకటి
లోపల ప్రవహిస్తే తప్ప
దుఃఖం కోలుకుంటుంది

నిరాసక్త క్షణాలకి మనమే కదా ప్రాణం పోసి
జ్ఞాపకాల వరుసకి చేర్చేది
ఆ దుఃఖ భాండాగారం
ఎప్పటికీ తొణికిసలాడాలి
అది జీవిస్తున్న ఉనికిని నిలుపుతుంది

నువ్వు ఆనందాన్ని
వెంట తెచ్చుకున్నట్టే
నేను దుఃఖాన్ని కలిగివున్నట్టు
నిన్ను కలిసిన పిదప తెలిసిపోయింది

రెండూ కలిసిన సందర్భాలు
పూల మీదికి ఎట్లా చేరుకున్నాయో
ఇప్పటికీ సందేహమే నాకు.

పక్వ అపక్వత శరీరానికి అంటుతుంది కానీ
మనసెప్పుడూ దుఃఖపునురగతో
ఎప్పటికప్పుడు తేటమౌతుంది


నువ్వు నన్నుగా
నా మనసుకి కోరుకుంటావు కదా!
దాన్ని అలా స్వచ్చంగా నీకందించటం కోసం
దుఃఖంలో మునిగితె తప్ప కుదరదు

* * *

కథ ప్రారంభానికి ,
ముందు ఒంటరిగా,కారణం లేని వెలితి
ఎడారి వ్యసనంలా
పగుళ్ళు బారిన దాహం ఎదురుచూసేది


దుఃఖమే ఒక పాయలా
కథనంతా ప్రవహించి
పచ్చని ప్రపంచాన్ని నవ్వులతో పువ్వులతో
కళకళా ప్రకటిస్తుంది.


.....
సారంగ ఈ పత్రికలో వేసారు ఈ కవితను.సంపాదకులకు ధన్యావాదాలు.

ఆనంద కాలం 10



''గార్వం అంటే ఏంటి డాడీ ''అనుకుంట వచ్చిండు ఆనందుడు.

వీడు ప్రశ్న వేస్తే ఓ తిరకాసు ఉంటదన్నది మీకెరికే...

''ఎవరన్నారో చెప్పు ''అడిగాను... ఏదో ధ్యాసలో ఉన్నట్టు.

''ముందు నువ్వు చెప్పు కదా ''మూతి సున్నాలా చుట్టి నా మీదికి విసిరాక ఏమంటాను...అదే కదా దాని అర్ధం కూడా ....

వీడికి ఎలా చెప్పాలా ఓ క్షణం అలోచించి...
''రాత్రికి చెప్తా లేరా ''అన్నాను.

''ఇప్పుడు చెప్పు డాడీ ప్లీజ్...''

''ముందు ఎవరైనా ఏమైనా అన్నరా చెప్పు ...చెప్తాగానీ ''అన్నాను.

'''అయ్యో ఈ మాత్రం దానికి అంతొద్దు...నువ్వు చెప్పు...''వ్యవహారం సీరియస్ కొస్తుంది గొంతులో...

''ఇప్పుడు నువ్వు ఏదైనా తప్పు చేసావనుకో...నీ మీద ఇష్టం తో నేను ఏమీ కోప్పడకుండా పోనీలే అని ఊరుకుంటే అది గారాబం చేసినట్టు అన్నమాట...''

ముఖం ఆలోచనల్లోకి పంపి నన్నే చూస్తున్నాడు...
అర్ధం కాలేదేమో అనుకొని...ఇంకొంచెం సరళంగా చెప్పాలని...
''నువ్వు ఇష్టం లేని పని ఏది చేసినా నేను సహించడం గారాబం అన్నమాట...''
బాగా చెప్పానా?

వాడి ముఖం అదోలా వుంది...ఏక్షణమైనా ఏదైనా పేల్చవచ్చు...

''బుర్రలోకి పాకిందా''అన్నాను...

''పాకింది పాకింది...''అని వెంటనే
''మనం గారాబాలు చేసుకుంటే వేరేవాల్లికి ఏంటి నష్టం...''అన్నాడు.

''ఏం లేదు కాని...ఇంతకీ ఎవరేమన్నారో చెప్పు...అడిగాను.

''అది సరే కాని ...మీరు కొంచెం గారాబాలు తగ్గించుకోండి అమ్మ గారు''...అంటూ మల్లక్క దిక్కు చూసాడు.

''నేనేమన్నారా?పిల్లల్ని ఆమాత్రం గారాబం చేయరా ''...అన్నది.

''పిల్లల్ని కాదు ...అయ్యవారిని...ఇందాక ఎవరో అనుకుంటే నా చెవిన బడింది...మీ మంచి కోసం చెప్తున్నా...మీ ఇష్టం...''అంటూ తుర్రుమన్నాడు...

''ఒరినాయనో''మల్లక్క నోరెల్ల బెట్టింది .

ఈ సారి నేను నవ్వందు కున్నా...

.....
22-5-2014

Thursday, May 15, 2014

అటు జరుగు




గొప్ప ప్రారంభము
అంతే గొప్ప ముగింపు
నడుమ ,అద్భుతమైన కొనసాగింపు
ఏ జీవితానికీ సరిపడదు


ఒక రోజులో కూడా అంతే
ఐతే కావచ్చు
పరిమితిదేముంది...మనం గీసిన
తాత్కాలికహద్దు

చేయినిండా చేరిన అన్నం ముద్ద
ఈ ప్రపంచానికంతా ఆసరా
కడుపునిండిన సందర్భమే
గొప్ప అవకాశము ,అదృష్టమైనది

స్పష్టంగా చూడదగిన కళ్ళు కూడా
మనకి లేవు కొన్ని జంతువుల వలె.
అవికూడా కాలాంతరాన మబ్బులు కమ్మి
గుండెకి పడ్డ చిల్లులా మారిపోతాయి
దుఃఖపు బొట్లు విడువటం కోసం

మనది కాని ప్రాంతాల్లో
మన మాట వినని శరీరాల్తో
ఏముందనిక్కడ ?
దాచిపెట్టితిమా ఏమైనా?
ఏరోజుకారోజు...
దొలుపుకుంటూ,మలుపుకుంటూ
తోటి మనుషుల మధ్య వినయం నటించుకుంటూ...
ఓహ్.....ఇక్కడిదాకా వచ్చాక
ఎవగింపు కే ఎక్కువ బలం

బచ్చలాకు మీది పచ్చ పురుగులు నయం
కాకపొతే మరేమిటి?

ఒరేయ్ ఆనందుడా!
ఉన్నట్టుగా ఉంటూ
లేనట్టుగా మసలుకోవటమే
జీవించడంలో నేర్పు.

.....
15-5-2014

శకలస్వరం





ఎప్పటికీ
ఏదో ఒక బాధ
దానికి రూపం ఉండదు
నువ్వనుకుంటున్నట్టు సరిహద్దులు
కూడా ఉండవు .

నన్ను కాపాడుకోవటం కోసం
అది ఆవహించుకు పోతుంది
వందశాతం వశీకరణ మంత్రమేదో ఉంది.
నేను దాన్ని ప్రేమించినట్టే
అది కూడా నన్ను ......

కనికరింపుల కలత
దుఃఖాన్ని సాదరంగా
చేయి పట్టుకు తీసుకువచ్చి
నిలబెడితే...
దాని దీనమైన ముఖానికి
నవ్వాగదు నాకు.....

నాకు నువ్వు కావాలి
దుఃఖం కూడా కావాలి .

..............
14-5-2014

Sunday, May 11, 2014

బతకటమే సాధన





ఎల్లప్పుడు పరిమితమైన భయంతో
ఎట్లా చేరుకుంటావు

నువు ఒంటరిగా వస్తే బాగుండు
స్వఛ్ఛమైన కపోతకాంతిలా

సంచులు మోసుకురావద్దని తెలియక
పాతవీ కొత్తవీ
దుమ్ము నిండిన క్షణాలవీ
ఇప్పటికే బతికిన వాసన నిల్వలవీ వెంటపెట్టుకుంటావు

శ్వాసించటానకి ఎవరి సాయం అక్కరలేనట్లే
ప్రేమించడం సహజంగానే జరిగిపోవాలి

ఏమో...ఈ ప్రపంచమంతా నీ వైపు నటిస్తుంది
నేనొక్కన్నే వాత్సల్యం వైపు దాచుకున్నాను

హృదయానికి దగ్గరి దారి
తెలుసుకోవటం కోసం మన మధ్య
దూరం సాగుతుంది.

.....
10-5-2014

Monday, May 5, 2014

బతుకుతున్న నీడలు




నిజమే కదా?
మనుషుల కంటే మనం
ఇంక దేన్నో ప్రేమిస్తున్నాం


మొత్తం నాటకమంతా గ''మ్మత్తు''గా నడవటానికి
అసూయ నింపిన పాత్ర ఒక్కటి చాలు

చిందర వందర వ్యక్తిత్వం పరుచుకోవటానికి
పిసరంత ద్వేషం అంటుకుంటే మహా

వలలు చాలా పరుచుకున్నాక
హృదయానికి శ్వాస దొరకదు

ఏ జీవీ భూమ్మీద
ఇట్లాంటిది పోల్చుకోవటానికి నిలవదు

అన్నీ ఎరికే
ప్రకృతి మీదనో
పచ్చనాకు మీదనో
పూల గుత్తి మీదనో
పాల మీగడ మీదనో
పోటీకి దిగలేం
పక్కనుండి చెయ్యందిచ్చిన వాన్నే
వీపు వెనక నుండి విరిచేస్తాం

ఎన్ని యుగాలు మారితేనేం ?
సౌలభ్యం కోసమే పెనుగులాట
ఎన్ని చదువులు పారితేనేం?
స్వభావం విడువని ముసుగుబాట

కేవలం జీవించటం లో
దాగిన ఆనందాన్ని అవతలికి తిప్పి
నటిస్తూ జీవిత కథను
రక్తి కట్టిస్తున్నాం

విషాదమైన విషాదం
ఇంతకు మించి లేదేమో!

.....
4-5-2014

అన్న ప్రహసనం



చిన్నప్పుడు అన్నం తింటుంటే
కిందబడ్డ మెతుకును కండ్లకద్దుకొని
తలెల వేసుకోవడం నేర్పిండు మా నాయిన

ఎందుకు నాయినా అంటే
''అన్నం దేవుడు బిడ్డా''
అన్నప్పుడు అర్ధం కాకపోయింది

అదెట్లనో ఇన్నెండ్లకు
తేలిపోయింది

అందుకే కూటి కోసం కోటి విద్యలని...
అందరి పని వెనకాల అన్నమే ఉన్నదన్నది
నిజమేనని తెలిసి పోయింది

అంత ముఖ్యం కనుకనే
ఒకని కడుపు కొట్టొద్దని
నోటికాడ బుక్క గుంజొద్దని
పెద్దలు సద్ది మూట గట్టిండ్రు

* * *

ఎందుకో పొద్దట్నుండి తినడానికి కుదర్లే
ఒకరిద్దరి జీవితపు దారుల్లో
ఏం జరుగుతుందీ కలబోసుకున్నాక
సాయంత్రం వచ్చి చేరింది
కానీ ఆకలి నన్ను మర్సిపోలే

అప్పటికి ఎటూకాని టైం
రోగాల రాగాల మధ్య
ఆకలి ఘీంకారం ఆగలేదు

ఇంకొంత సేపటికి
ఏదీ వినబుద్ధి కాని స్థితి
ఎవరితో మాట్లాడలేని అశక్తత
''ఫేస్ బుక్'' ఓపెన్ చేద్దామా?
ఛి ఛీ ...వద్దు వద్దు'' ఫేక్ బుక్ ''

కణజాలం లో అలజడి
లోపలంతా భూమండలం ఖాళీ
ఎడారి ఎరుపు
కళ్ళల్లోకి చేరిన చీకటి జ్వాల

మాట్లాడే మనుషులు
కనిపించే మనుషులు
మనసులో మనుషులు
ఒకేసారి గుమికూడిన చర్చ

ఎక్కడెక్కడో లోకాలమీది నడక
అసలు వాతావరణం లో తేమ లేదు
నాలుక మీద జ్ఞానం లేదు
బాధలు బంధాలు నవ్వులు జ్ఞాపకాలు అన్నీ
కట్ట కట్టుకొని కూలిపోయాయి

ఒక తేలికైన భారం
భరించలేని ఉనికి
ఆవురావురంటున్నదొకటే
ఆకలి

పద్యం రాసుకుందామా ?
చేతి వేళ్ళలో కదలికలు లేవు
మెదడంతా చీకటి వలయాల మధ్య
తప్పిపోయింది

ఈ ప్రపంచానికి ఏం జరిగిందో?
ఉందా అసలిది...
లేక నేనే కల గంటున్నానా ...!

రాత్రి పది దాటాక
ఎట్లా చేరానో ఇంటికి
ఏం జరిగిందో ఒంటికి ...
కడుపులకి ఒక్కో ముద్దా ఎట్లా చేరిందో చేరింది

మెల్ల మెల్లగా...
మెలకువ లో మెలకువ
టీవీ లో పాటలు ప్రచారం చేస్తున్నాయి

శబ్దాలకు రసం తెలిసింది
స్పర్శకు రంగులు కలిసాయి
ఆలోచనకు అమృతం దొరికింది

మా నాయిన మాట గుర్తొచ్చింది
''నాభి కాడ సల్లబడితే నవాబు తో జవాబియ్యొచ్చ''ని

అన్నం కడుపుల కొచ్చాక
ప్రపంచం లేచొచ్చింది

అన్నం పరబ్రహ్మ స్వరూపం
అన్నం తిన్నాక అన్నీ గుర్తొచ్చాయి

కండ్ల ముందట
మనసు లోపట వున్న లోకాలు
అన్నీ లేచాయి

మా నాయిన చెప్పింది నిజమే
అన్నమే దేవుడు.

.....
3-5-2014

3D కీటకం



కీటకం పాతదే
లక్షణం కొత్తది /కీలకమైనది
ఏటేటా కొత్త
జననాంగాలను పెంచుకుంటది

కరచాలనం నుంచి మొదలై
కులం వీపు మీదెక్కి
వర్గం గజ్జల్లోంచి
మెదడున చేరుకొని పుష్పిస్తుంది
దాని గుంపును అది గుర్తించుకొని
గుడ్లు పెడుతుంది

ఒకసారి నువ్వు కలిసిన పిదప
జాతకం తేలి పోతుంది
నువ్వే జాతి జీవమైనా సరే
దాని వెనకాల కదిలిన చాలు
ఫలితంగా ...అనేక ఖాళీల్లో
పీటలు వేయబడతాయి
కలిజీవిగా కాలం కలిసొస్తుంది

వ్యాపించడంలో చతురత కి
ప్రోత్సహించడంలో నాణ్యత కి
దానికి సాటిలేదు

దాని దారిన రాలేకపోతే
నీ దారిని కాపు కాస్తుంది
చుట్టూతా గూడుపుఠాని అల్లిక లో
నీ రసం తగ్గి ,రంగు వెలిసిపోతుంది

నీ కింద జలనం మాయం కావాలంటే
నీ గూటికి మహార్ధశ కలగాలంటే
కొంత సాగిల పడాలి లేదా
కొంత ధారపోయాలి /పొతే పోయింది

గమ్మత్తు తెలుసుకో...
నిన్ను భుజమెత్తి కీర్తించనూవచ్చు
భజనప్రియను సంతోషపరచరా డింభకా!

భజన చేసే విధము తెలియండి!
కలిపురుషులార మీరు .

.....
1-5-2014