Tuesday, May 27, 2014

మనసు పొరల జల

కథా ఆరంభానికి ,
ముందు జరిగిన కథ
ఎప్పుడో బయటకు రాక తప్పదు

* * *

ఎందుకో పసిగట్టే పరికరాలు నా కాడ లేవు
నిన్ను చూడంగానే
ఎక్కడో పేరుకుపోయిన దుఃఖం
ఊపిరాడనివ్వదు

ఇంత వేసవి తీవ్రతని తడుపుతూ
నీ తలపొకటి
లోపల ప్రవహిస్తే తప్ప
దుఃఖం కోలుకుంటుంది

నిరాసక్త క్షణాలకి మనమే కదా ప్రాణం పోసి
జ్ఞాపకాల వరుసకి చేర్చేది
ఆ దుఃఖ భాండాగారం
ఎప్పటికీ తొణికిసలాడాలి
అది జీవిస్తున్న ఉనికిని నిలుపుతుంది

నువ్వు ఆనందాన్ని
వెంట తెచ్చుకున్నట్టే
నేను దుఃఖాన్ని కలిగివున్నట్టు
నిన్ను కలిసిన పిదప తెలిసిపోయింది

రెండూ కలిసిన సందర్భాలు
పూల మీదికి ఎట్లా చేరుకున్నాయో
ఇప్పటికీ సందేహమే నాకు.

పక్వ అపక్వత శరీరానికి అంటుతుంది కానీ
మనసెప్పుడూ దుఃఖపునురగతో
ఎప్పటికప్పుడు తేటమౌతుంది


నువ్వు నన్నుగా
నా మనసుకి కోరుకుంటావు కదా!
దాన్ని అలా స్వచ్చంగా నీకందించటం కోసం
దుఃఖంలో మునిగితె తప్ప కుదరదు

* * *

కథ ప్రారంభానికి ,
ముందు ఒంటరిగా,కారణం లేని వెలితి
ఎడారి వ్యసనంలా
పగుళ్ళు బారిన దాహం ఎదురుచూసేది


దుఃఖమే ఒక పాయలా
కథనంతా ప్రవహించి
పచ్చని ప్రపంచాన్ని నవ్వులతో పువ్వులతో
కళకళా ప్రకటిస్తుంది.


.....
సారంగ ఈ పత్రికలో వేసారు ఈ కవితను.సంపాదకులకు ధన్యావాదాలు.

No comments:

Post a Comment