ఊపిరి నిండా పరిమళపు
వెల్లువ ఉప్పొంగనీ
కన్నుల్లోపలికి కనిపించని
మార్దవ వాతావరణాన్ని ఇంకించుకోనీ
కలతల వ్యవధి దాచిన
కన్నీటి తలాన్ని నిద్రించనీ
గరుకు గుణాంతర భ్రమల్ని
వేళ్ళ నుండి తుడిపేయనీ
కడుపునిండా తడి మూలాల్ని
ఉన్నదున్నట్టు ప్రేమించనీ
చెరసాలల మందాల్ని
గుడ్డి గునపాలతో నైనా సరే ఛేదించనీ
ఆకర్షించనీ
భూమి నిండా పొదిగిన కాంక్షను
పరిణతి రంధ్రాలలోంచి జారనీ
మనసు నొదిలిన అంగాల కుతిని
భయంగా కాంక్షించనీ
అతి విలువైన దేహాడంబరాల్ని
మినరల్ నదుల్లో కడగనీ
రంగు రంగు ల చీకటిని
గొంతు నిండా దాచుకోనీ
పసి కణాలు కదులుతున్న
దారి తెగులు తొలగించనీ
మౌనం వెనకాల దాగిన అనేక
కాక్టస్ కలల గొంతు నులమనీ
ప్రియురాలా...!
ఇంకొంచెం దుఃఖించనీ
.....
No comments:
Post a Comment