Friday, January 10, 2014

ఆనందకాలం 4



''డాడీ నాకో కైట్ కొనిస్తవా'' అడిగిండు ఆనందుడు .
ఆర్నెళ్ల పరీక్షలు రాసి అలిసిపోయిండు గావచ్చు పోరడు ఒకటో తరగతివి.

ఇగ పిలగాల్లకు పనేముంది సంక్రాంతి సేలవులాయే.

మా సిన్నప్పుడు గూడ ఇట్లనే ఆడుకునేదనుకో ...
''కొనుడెందుకు రా నేను చేసిస్త...ఆ న్యూస్ పేపర్ పట్టుకరా ''అని నేను రెండు ఆం ఆద్మీ పొర్క పుల్లలు తెచ్చిన.{పొర్క గురించి చెప్పినప్పుడు ఆం ఆద్మీ ని తలుచుకోవటం ఇప్పటి మాట.}

''గదెందుకు''?అంటూ ముఖం ఏదోలా పెట్టిండు.

''న్యూస్ పేపర్ , పొర్క పుల్లలతో పతంగి చెయ్యొచ్చు'' అన్నాను .ఎన్కటి కి గవే చేస్తుంటిమి.

''థూ....''

''ఇవతలికి అవతలికి ముఖం కన పడ్తదా దీంతోని ...''

''ఎగిర్తే సాలు కద...ముఖం ఎందుకు కనపడాలె?''అన్న...
ఇప్పుడు ప్లాస్టిక్ పతంగులాయే...

''అందరి పతంగులు నవ్వుతయ్ మనదాన్ని చూసి..పో డాడీ ఇదొద్దు..''అనుకుంటూ అవతలికి పోయిండు నిష్టూరంగ.

అసలు నాకు పతంగులు ఎగరెయ్యడం ఇస్ష్టం లేదు .దానికో కథ వుంది.కొద్దిగ చెప్త.

... ... ...

గిట్లనే నా సిన్నప్పుడు ...సెలవులల్ల ...పతంగి చేస్కొని పేపర్ తో...మాంజ దారం పేనుకొని...నానా తంటాలు పడి మిద్దెక్కిన .

ఎవ్వరు లేరు ఎంట ...ఎవరి మిద్దె మీద వారు ఎగరేసు కుంటున్నరు .

నేనొక్కన్నే ...అటుతిప్పి ఇటుతిప్పి ...దారం గుంజుతుంటే పతంగి ఎగిరింది.

''హే''...

ఆనందం ల ఎనకెన్కకు పోయి...గండి గూడుల కెళ్ళి కింద పడ్డ మిద్దె మీది నుండి.

ఎన్కట మా ఇండ్లల్ల దర్వాజ దాటంగ నే గజంపావు పొడవు గండి గూడు ...వెల్తురు కోసం ,వానకోసం వుండేది.అండ్ల కెళ్ళి కింద పడ్డ.

లొల్లి విని సుట్టు పక్క లోల్లు ఉరికొచ్చిరి.

కొద్ది సేపు నేను బేవోషి అయిన్నంట .

''ఎంత సక్కని పోరడు ...ఇట్లా పడే ...పతంగులు పాడుగాను'' అనుకుంట లేబట్టి కుసపెట్టి
ఏడేడ దెబ్బలు తాకిన యో చూసి ...ముఖం మీద ఇన్ని సన్నీల్లు జల్లి ...లేపి కుసపెట్టిండ్రు .

ఎన్కకు పడ్డ గద...మోచేయి బాగ గుద్దుకుంది.

తల్కాయకు తగలలే...మా అమ్మ అదృష్టం .

మోచేయికి బట్ట తడిపి సుట్టిండ్రు.

ఇంతల మా నాయిన వచ్చిండు.అప్పటి దాక లేడు ఏదో దావతుకు పోయిండు.

ఇగ సూడు నా బయం కాదు .
ఏమన్లె కాని ...మల్లెన్నడు ...పతంగి ఎగిరెయ్యనియ్యలే...అంతేనా సైకిల్ తొక్కనియ్యలె...
ఈతకు పోనియ్యలె ...
ఇంకో వూరికి పంపియ్యలే ఒంటరిగ.

ఇగో గా బయంతో నేను కూడా ఎప్పుడు పతంగుల సూసుడే గాని ఎగరేసుడే చెయ్యలే...

ఇప్పుడు ఆనందుడు వూకునే తట్టు లేదు .కొనిద్దామనే అనుకున్న.రేపటె ల్లుండి కొనియ్యోచ్చు లే అనుకుంటుంన్న.

నేను బయటకెళ్ళి వస్తుంటే ఆనందుడు దోస్తులతో మాట్లాడుతున్నది ఇనబడి పరిషాన్ అయిన.

వాడి దోస్తు...''ఒరే ఆనందు...మీ డాడీ కైట్ కొనిస్త లేడా''అడిగిండు.

''హే...చాల కొనిస్తన్నడు.కానీ నేనే వద్దన్న.''అన్నడు.

''ఎందుకురా'' దోస్తు అడిగిండు.

''విమానాలొచ్చి తగిల్తే పతంగి పాడైతదని నేనే వద్దన్న'' అన్నడు.

అక్కడి నుండి ఆపుకొని ...ఇంట్లకొచ్చి నవ్విన.

ఇన్నంక మల్లక్క కూడా ఆపుకోకుండ నవ్వింది.
కొడుకుకు పతంగి కొనియ్యలేదని అలిగింది కూడ.

.....
10-1-2014

No comments:

Post a Comment