Saturday, December 28, 2013

ఈమాత్రం దానికి 2



ఒక లిప్త కాలంలోనే
అనేక ఆలోచన్లు కలుసుకుంటాయి
పొంతన లేకుండా
ఒక మెరుపు తునకలా
ఒళ్లు ఝళ్లు మనేలా వచ్చి పోతాయి

మనసు పచ్చని పైరులా వుంటే
పిల్ల గాలుల్లా వచ్చే ఆలోచన్లు
హాయిని తెలుపగా
గుండెని తడుపుతాయి

గాయమైన చర్మం లా మనసుంటే
ఆలోచన్ల మంటలు
ఆ భగ్గుమనే అంటుతాయి

సంపదకనుకూలంగా కూడా
కొన్ని చమక్కుమంటాయి
కానీ...లేనపుడు
ఏకాకి విచారమే ముసురుకుంటుంది

ఈ రోజు మనకేం కావాలో
అదే పనివైపు జరుగుతాం
అనుకోకపోయినా

కొందరు కొన్ని పనుల్లో
ఆరితేరివుంటారు
డబ్బుకు సంబంధం లేనివి
ఉదాహరణకి ఎదుటివాడి జీవితంలో కాలు పెట్టడం

స్నేహం ను గొప్ప వేషం లా
రక్తి కట్టించడం అలవాటైన విద్య కొందరికి
ఈర్ష్య ...ద్వేషం
కోపం...అహంకారం
అనేక వేషాలు ఒకేసారి వేయగల సత్తా
సరిపోను నిల్వ కలదు

ఇక

ఏది మనకు అనుకూలం కాకపోయినా
బోలెడు చింత జమా.

చింత చిగురించి చిగురించి
పూతై...కాతై
బీపీ నో.....సుగర్ నో
ఒంటి నిండా నింపాక...

ఇంకేముంది
గిలగిలబతుకు

.....
27-12-2013

అంతర్నివాసి


నువు వచ్చివెల్లాక
నువు తెచ్చిన రంగులచొక్కా ఊరుకోదు

పక్కన కూర్చొని
ఒక తరాన్ని పరిచయం చేస్తుంటే
మా తాత ఒకచేత్తో నడిపించిన
రోజు యాదికొచ్చింది

ఎక్కడికెక్కడికో నిన్నూ నన్నూ
మోసుకెల్లిన బతుకుదెరువు
బలమైనది

రక్తంలో లేని దూరం
రోడ్ల మీద కొలతకు చిక్కదు

అనేక వస్తువల మధ్య
వాటి నీడల నిభందనల మధ్య
నొచ్చుకుంటూ పోతున్న శ్వాసకి
కలయిక కొంత ఊరట

భూమి దరిదాపుల
నువ్వున్నావన్న ధ్యాస కూడా
నులివెచ్చని భాగ్యం

.....
24-12-2013

బతికిన ముద్రలు



ఎప్పటికైనా
ఒకే ఒక రోజైనా
బాగా పండుతుంది
కన్నీటి వలయం మధ్య

రక్తం కూడా
ఎర్రమట్టి నీడల్ని పూసుకొని
చల్లబడుతుంది

గోపురాలు కట్టుకోలేని
రాల్లురప్పలు
పసిపసి పాదాల కింద
ముసిముసిగా నవ్వుతాయి

ఒక్కరోజైనా
నీ వెంట పడి
ఎర్రెర్రటి ఎండ గొడుగును పడుతుంది

అడుగడుగున దాగిన
కాంతులు
రాగాలై ఎగురుతాయి

విచ్చుకున్న సమయంచుట్టూ
తేనె చుక్కలు
ముసురుకుంటాయి

ఎప్పటికైనా
ఒక్కరోజైనా
జడుసుకోని నీ పసిమనసు
ఆకుపచ్చని ఆకాశాన్ని హత్తుకుంటుంది

.....
26-12-2013

Friday, December 20, 2013

లోపలివాని నీడ



నిన్ను తలపించేది
మరోటి లేనప్పుడు
ఇక పోలికతో పనిలేదు

ఓ దయలేని మధ్యాహ్నం
అంతు తెలియని ఆకలి
మొత్తం నమిలేస్తున్నది


ఎర్రటెండ ఆకలిమీద పడి
భస్మమై పోతుంది


వెలుగును మించిన వెల్తురు కోసం
ప్రయత్నించడం వృథా

గుడెకింద తడి లేని చోట
విత్తనం మొలకెత్తదు

ఒంటరితనం కూడా
మోడుబారింది

జీవితమా...
నువు దుఃఖానివైతే చాలు
ఇక నెట్టుకు రావటం కష్టమేమీ కాదు.

.....
21-11-2013

? ? ?



పొద్దున లేస్తే అదే పని
పొద్దు దూకితే అదేపని
మధ్యలో కూడా ఎప్పుడు చేసేదే

ఇంత మాత్రం దానికి
రోజూ బతుకుతున్న పేరు

ఒకరు రోజు కూలి
ఒకరేమో నెల కూలి
కొందరి బతుకే కూలి
ఎట్లయుతేంది కూలి బతుకే

ఇంత మాత్రం దానికి
రోజూ బతుకుతున్న పేరు

జేబులో పైసలున్నోడు
జబర్దస్తిగ మాట్లాడ్తడు
కొంచెం తక్కువున్నోడు
నంగి నంగి మాట్లాడ్తడు
ఏమీ లేనోడు కూడా వుంటడు
వూరికే చూస్తుంటడు

ఇంత దానికి రోజూ
గొప్పగా బతుకుతున్న పేరు

ఎవ్వరి బతుకైనా
ఒక్కటే తీరుంది
పైకి చూడ మాత్రం
ఆస్మాన్ పరఖుంది

ఈ మాత్రం దానికి
? ? ?

...

తోచనివ్వనిది


ముడుచుకు పోయిన మనసు
పేరుకొనిపోయిన ప్రేమ
వాసన లేని వాసన

కాంతిని సృష్టించక పోయినా
అవసరమైనప్పుడు దారికి తెప్పించుకోగలగాలి

నీతిని దువ్వితే చాలు
మెత్తబడి చతికిల బడుతుంది
మళ్లీ లేమ్మన్న దాకా లేవదు

మంత్రజాలం ఏమీ వుండదు
మంత్రమే ఐనప్పుడు ...

కొన్ని సత్యాలు ప్రకాశ వంతంగా వెలిగినా
గుప్పెట్లో మూసినపుడు
నోరుమూసుకుంటాయి

ముందూ వెనుకా
ప్రశ్నలే నడిపిస్తుంటే
సుఖం పరుగు తీస్తుంది

జీవితం గమ్మత్తైన పాఠం గాను
పరీక్ష గానూ ఒకేసారి నిలబడుతుంది.
కొన్ని వయసుల్లో .

.....
27-11-2013.

బాలపౌరులు



మన పిల్లలు అదృష్ట వంతులు
ముప్పై ఏండ్లు దాటిందాకా కూడా
తల్లిదండ్రులు సంకనుండి దింపరు

సుప్రభాత సేవ,దేహశుధ్ధితో సహా
అన్నం కలిపి ఆహారనాళం లోకిి
సాగనంపుతారు

అదృష్ట వంతులు ఈ- పిల్లలు
కంట్లో నలుసెరుగరు
చూపు చుట్టూతా అమ్మానాన్నలు
దడికడతారు

నిజంగా అదృష్ట వంతులే...
అమ్మనాన్నలు
ఒకరికితెలియకుండా ఒకరు
ప్రేమను కొనిపెడతారు

వీపుకు బాంకును జమ చేస్తారు
ఒక నూతన వాహనంతో ఆశ్చర్య పరిచి జీవిస్తారు
"చిరంజీవ సుఖీభవ"

కాలం కలిసొస్తే
ఒకమేడకట్టి ...కాపురం చేసేలా
కనికట్టు కడతారు

చివరికి కూడా
ఈ -పిల్లలు అదృష్టం వెంట పడిపోతారు
అనాధ ఆశ్రమాల్లో అమ్మనాన్న కి
ఒక ఫోన్ కొడతారు.
టైం దొరక్క పోతే ఏకంగా
దింపుడు కల్లం దగ్గరే విమానం దింపుతారు.

.....
బాలల దినోత్సవాన్ని యువ పిల్లలకి శుభాకాంక్షల తో.

పొరల కింద...


ఇదీ మామూలుగానే
తెల్లారింది
నీ మనసులోనే ఏదో ఉంది
కొత్తనీ
పాతనీ

అదీ మామూలుగానే
పరుచుకుంటుంది
నీ మనసులోనే ఏదో ఉంది
దగ్గరనీ
దూరమనీ

ఏ క్షణమైనా ఒకేలా ఉంటుంది
ప్రేమగా
నీ మనసులోనే ఏదో ఉంది
ఎక్కువనీ
తక్కువనీ

.....

బై బై చెప్పే చేతులు



నిన్ను చూడటానికి వచ్చానా !
నా కళ్ళ భాషను
హత్తుకోకుండానే ఆనందం ప్రకటిస్తావ్

ఈ ఒక్క క్షణమే
మనసు మీదుగా
అన్ని మూసిన కిటికీలను తెరవలేక

నువ్వూ నేను చీకటికి తెలియం
చీకటైన నువ్వు తెలుసు స్పష్టంగానే

బేరలు చేడిపేస్తే మనం దగ్గరే
నీ చుట్టూ ఎన్నున్నాయో
నా చుట్టూ ఎన్నున్నాయో
ఎప్పుడు లెక్క కట్టాలె

దూరం నుండే చేతులూపుకుంటూ
గుండెను బలవంతంగా
జోకొట్టుకుంటున్నాం.

.....

Wednesday, December 4, 2013

మనకు అధీనం ఉండదు




అంతా బాగానే ఉంటుంది
ఆ క్షణమే ,పాట పల్లవి కాగానే
కరెంట్ పోతుంది


ప్రశ్నలు పెట్టె పోరుకు
పారిపోవటం తప్పని సర్డుబాటుగా తోస్తుంది


అంతా సవ్యంగా సాగటం కోసం
తిప్పలు ,తీర్ధ యాత్రలు

గుండె వెనకభాగపు గోడలన్నీ
మసిబారి బూజు నిండి నిలబడతాయి


మాసం మాసం ఉపవాసాలు
జీవితం మొత్తాన్ని హాయిగా ఉంచనపుడు
ఏంటీ తప్పని తంతని
లోపల్లోపల తంతూనే వుంటుంది


అంతా బాగానే ఉంటుంది
అనుకోకుండా చేరిన మిత్రుడి ముఖం
మన నవ్వుకు కంది పోతుంది
కొన్నేండ్ల దోస్తాన
దొవలు తప్పి చిక్కుకుంటుంది


కళ్ళ కింద జీవితం
నల్లని గీతాలుగా మిగులుతుంది
ఆశ్రమాల్లో వార్తలు వింటూ
వృద్ధాప్యం సెల్ ఫోన్లో కుంటుతుంది


అంతా బాగానే ఉంటుంది
జీవితం చెప్పే పాటం మాత్రం
ఎప్పుడూ అర్ధం కాని లెక్కలా
మనసు మూల మూల్గుతుంది .

     .....
4-12-2013

Monday, December 2, 2013

ఎట్లా కుదిరితే అట్లా బతకడమే




ఈ పూటకి అంచుకు వున్న
చింతకాయ పచ్చడి రుచిని చప్పరించడమే

ఎదుటివారి వెటకారంలో
భాగమైతే ఆనందించడమే.

ఎట్లా నడుస్తామో ...ఎదురవ్వడమే

వున్న స్థితిని హత్తుకోవటానికి
మనసుని మురిపించటమే

ఏదీ తప్పించుకోలేని దశని
నిశ్శబ్దం తోడుగా నింపుకోవడమే.

ఎట్లా అని అడగకుండా వుండటమే

దుప్పటి లేకపోతే
చలిని వణుకుతూ వుడికించడమే

చీకటిని చూడగల్గిన కళ్లకి
హృదయాన్ని ధారపోయటమే.

.....
20-11-2013

తడి తడి కాంతులు కళ్ళలో కలుసుకున్నపుడు


ఒక్కోసారి
ఒంటరి నిశ్శబ్దం కదులుకుంటూ
నిన్ను నాలోకి తోసి పోతుంది

ఆత్మలా హత్తుకున్నపుడు
తడిసి తడిసి వెన్నెల కురిసి
కాగితం పూల కొమ్మ కళ్ళు నింపుకుంది

నీ కోసమే ఇక్కడ
ఒక ప్రత్యేక మందిరం లాంటి పవిత్రాశయం
ఎదురు చూస్తున్నట్టుంది ...వెన్వెంటనే

నాడుల మీదుగా ,నాదంగా
ఎర్రెర్రని సూర్య కాంతిలో తేలుతున్న
హృదయం కనులలోకి తొంగి చూస్తుంది

ఏమో!
అభయమో! భయమో!
లేక రెండూ కలిసిన కౌగిలింతో ...

ఎవ్వరికీ తెలియనివ్వని
ఆ సమయాన్ని సేద తీర్చుకుంటున్న
జీవ ద్రవ్యపు అంతరకాంతి
పడవపిల్లలా అటూ ఇటూ

కొన్ని నీళ్ళు తాపి
గోడమీది పటం లో బిగిసిన దేవుడి మీద
నిలిచిన చూపును తట్టి
ఎవరొస్తారోనని తలుపుకు తగిలి ...

ఇంకాసేపు
నిన్నట్లాగే కణజాలం నిండా
పొదివి పట్టుకోలేని చేతకాని తనానికి
తలొగ్గి ,
నిను ఊపిరి తీయకుండా రెప్పల మధ్య అదిమి
కంఠం లో బిరడా బిగించి

మరో సారికి రప్పించుకునే మర్యాదకి
నమస్కరించి
అప్పుడప్పుడిలా వచ్చిపొమ్మని మాత్రమే...
వేడుకోగలిగి.

.....

సం ''దేహం''


ఊరికే ఉదయించడమొక్క 
సూర్యుడికే చేతనౌను 

పది నిమిషాలు మనసు నిలుపుకోలేక 
కలగాపులగపు అభిప్రాయాల మధ్య 
ఈ ప్రపంచాన్నే ఇరుకున పెట్టేస్తాం 

పారిపోవడం తెలుసు 
ఉన్న భావాల్లోంచి 
ఉన్న మూలల్లోంచి 
దగ్గరి మనుషుల్లోంచి 
కూలిపోతున్న ఊరినుంచి 

కొత్త లోకమొకటి 
తయారుగా కొన్నాళ్ళు నచ్చుతుంది 
తర్వాత, పిడికిలి లోకి 
లోకాన్ని కూర్చడం కోసం తంటాలు 

సౌందర్యాన్ని స్వీకరించడం వదిలేసి 
మెరుగులు దిద్దడం మొదలెడతాం 
అనాకారులం 

ఊరికే గమనించడమొక 
కాంతికి తెలుసు 

పోలికల కింద 
పీలికలు పీలికలై పోతం 
కనిపించి నంత వరకు 
కాలం కలిసొస్తే కబలింప సాహసిస్తాం 

జీవించినంత మేర 
బతకడానికొక గొప్ప సూత్రం కోసం 
వెతుకుతుంటాం 

.....
2-12-2013.