Saturday, September 8, 2012

ఇది గమనించే స్థితి లోనే ఉంటే....


వచ్చే వాళ్ళు వస్తున్నారు
పోయే వాళ్ళు పోతున్నారు
ఎవరూ స్పష్టంగా దర్శన మీయరు
పై పై నీటి కింది చేపల్లా
ఎవరూ కడులుతున్నట్టు లేదు

ముసుగులు బిగుసుకు పోయి
పోరాడుతున్న ఊపిరి,
ముత్యపు గింజలు రాలుతున్న
చలిగాలి నిగ నిగల కాలాన్ని
ఎవరూ పలకరిస్తున్నట్టు లేదు

ఎదుగుతున్న కోరికలు ఎదురు తిరిగి
పసిపిల్లల వయసు ఆకాశ వీధుల్లోకి
ఊహించని స్కేటింగ్ చేస్తుంటే
అద్దం ముడతల విషాదం లో మునిగి
వాకిట్లో వాలిన వెన్నెల కిచ కిచలు
ఎవర్ని చెక్కిలిగిలి పెడ్తున్నట్టు లేదు

కాంక్రీటు ప్రేమల ఉపరితలాల మీద
వాడి పోతున్న అనుభందాల మొలకల నాడి దొరకక
కోలుకోలేని కౌగిలి వ్యసనాల మోజులో
రాత్రుళ్ళు పగళ్ళు నిద్రను మేల్కొలిపి రంగరించుకున్నా
చెమట ఆరని తృప్తిలేని బలవంతపు సజీవ యుద్ధంలో
ఎవరూ కంటి నిండా తృప్తిగా పల్కరించుకుంటున్నట్టు లేదు
మనసు మనసు తియ్యగా హత్తుకుంటున్నట్టు లేదు

వచ్చేవాళ్ళు వస్తున్నారు
పోయే వాళ్ళు పోతున్నారు
ఎవరూ స్వచ్చంగా దర్శన మీయరు
పై పై చిగురుటాకుల కదలికల్లా
ఎవరూ స్పష్టంగా శ్వాసిస్తున్నట్టు లేదు .

.....

6-9-2012

No comments:

Post a Comment