బలవంతంగా కోరికను విరిచి
ఆఘమేఘాల మీద ఏర్పాటు సిద్ధం చేసిన
ఆనందం ముఖం లో
సేవలందించడానికి రెండు గ్లాసులు
వేపుడు అటుకుల పప్పు
రెండు స్పూనుల కరుణ
ఉల్లిపాయల వాసన
నిమ్మ రసం లో తడిసి
చల్లని పులుపు శ్వాస గొంతులో
అరచేతిలో అడుగు భాగం హత్తుకొని
ఎక్కువ తక్కువ తూకం ఒక్కో చుక్కతో సరిపోల్చి పోసి
బుస్సు బుస్సు సోడా నీళ్ళతో నింపిన మహాద్రవం
తనివి తీరా గర్వం తడిసి పోయి
ఆనందం బుడగలు బుడగలు గా కిందికి మీదికి
ఇక ఇద్దరి చేతుల్లోడీ కొట్టిన గ్లాసుల శబ్ధం జారిపడి
మౌనంగా మొదటి గుటక
నాలుకకు తెలిసిన తిమ్మిరి తడి
మత్తు చుక్కల జారుడు బండ గొంతుక
కొన్ని కరకర లు ,సోడా బుడగల్ ఈదులాట
మత్తులోకి జారుకుంటున్న గాలి
వాడి ముఖం నిండా రక్తం పొంగిన ఆనందం
రెండవ సారి నింపుతూ 'మాట్లాడు బావా' అన్నాడు
'జీవితమంటే ఏంట్రా 'అడిగాను
క్వార్టర్ అహం,క్వార్టర్ స్వార్ధం,క్వార్టర్ మోసం ...
మిగిలింది ....క్వార్టర్ ప్రేమ బావా!
మత్తు దిగింది వెంటనే
మాటలు వెంట వచ్చాయి .