Friday, March 27, 2009

కాలం నడిచిన దారి

చూస్తుండగానే

మంచం లో పడిన నాన్నకు

గొంతు పోయింది ...

సగం శరీరం చచ్చు పడింది...అంతే కాక

గుండె గతి మార్చు కుంది .....చూస్తుండగానే

కళ్లు తెరిచి కలియచూసి కన్ను మూసాడు



కాలం గిర్రున

చెంప దెబ్బ కొట్టింది..



వలస బతుకు

వలస వృత్తి వరి

బువ్వ తినిపిస్తుండగానే

నీటి అవతారం మారిపోయింది .



కల్లకింపు ...కంటికింపుగా

సేద బావుల నీళ్ళన్నీ

మినరల్ మేకప్ తో

గొంతులు చల్లగా కాల్చుకుంటూ

జారుతుంది ....

చూస్తుండగానే

మార్కెట్లో నీతిశిలగా నిలబడింది

భూమిలోపలి జల



చెరువు శ్మశానమై

కడుపుల పూడ్చుకుంది వూరును...



మీసం మొలిచిన పిట్టలు

అమెరికాకో ఇంగ్లాండుకో

ఎక్కడెక్కడికి ఎగిరిపోయాయో

వెతకడం సాధ్యం కాదు ప్రేమను...



చూస్తుండగానే

కరెంటు కండ్లకిచ్చిన

ఆనందమ్

తీరకముందే

చార్జీల మినుగుర్లు రాలి

చూపు కాలిపోయింది....



ఉమ్మడి కుటుంబాల సౌరభామంతా

చీలికలైన విస్తరాయే ...చూస్తుండగానే ..



పలుక బలుపాలు పోయి

పలుకుబడి డాలర్ల పాలాయె చదువు ...



పచ్చని చెట్టు

తుఫాను కు వంగిపోయింది ....అమ్మ

చూస్తుండగానే ....



..................











Monday, March 23, 2009

దు:ఖోదయం

చలి వెన్నెల జోరు జలపాతం

ఒకే పుస్తకం లోంచి

ఇరువురి సమస్యల్ని చదువుకుంటాం

మనమీద హాస్యం విసురుకునే

అనాది బాధలు

రాలిపోతాం

వానాకాలపు తాకిడికి పూలవలె

మనసు మూగగా

ఒంటరి స్తంభమై నిలుస్తుంది

దాని చుట్టూతా

బడి పిల్లలు ఆడుకుంటారు

అదే పనిగా అమ్మ

అన్నమై పిలుస్తుంది

పాటలై

శోకాలు నాట్యం చేస్తాయి రాత్రికి రాత్రి

ఖాళీ నవ్వులు

ఖాళీ ఖాళీ ఆప్యాయతలు

ఊపిరి పెనవేసుకు పోయిన

మనుషుల జాడ తెలియదు

కిటికీ లోంచి

గాలితో పాటు గాయాలు కూడా

తెలవారుతాయి

రేడియో మీద వాలిన పిచ్చుక

పాటని నింపి పోతుంది

ముల్లుని ఏ స్టేషన్ మీదికి కదిపినా

అదే కమిలిన దుఃఖ౦.

...................

Sunday, March 22, 2009

జిలేబి దుఃఖం

ఓ బొమ్మ గీసి
దుఃఖాన్ని
గోడకి తగిలించాలి

లేదా

ఓ స్త్రీ పెదాలను
ఎప్పటికీ కనిపించేటట్టు
అలంకరిస్తే చాలు

నరాల మీద
తమ మగత పాదాలతో
గిలిగింతలు పెట్టేవాళ్ళను
ఇష్టమైన ద్రవంగా
మార్చి త్రాగాలి

రాత్రి
నిద్రమీద వాలేటప్పుడు
దుప్పటి కింద
అతికించిన
దుఃఖాన్ని
నిద్ర లేపాలి
కాసేపు దాంతో
సరదాలాడాలి

ఓ మిఠాయి లా
తినాలి
దుఃఖాన్ని...

.............

Thursday, March 19, 2009

గావర గావర

గోరు వెచ్చని పలకరింత

కన్నీటి కింద తడిసిన భూమి
బంగారు పచ్చని చర్మపు
సుతి మెత్తని తాడన రేపిన
అలజడి

అలనాటి పొరల కింద
పచ్చి అక్షరాలు తడిపిన దేహం

నోరు లేని
చేవ లేని
నిర్వీర్య సందర్భాల
నిస్సత్తువ

అందరమూ
పోనిచ్చుకున్నాం
చేతిలోని బంతిని
గాల్లోకి విసిరి
కొత్త దిశలు తెలియనంత ....
జీవితం అడిగినా
తర్వాత తెలిసిన అసహాయ శూరత

కంఢర సంకోచాల వ్యాకోచాల మధ్య
దేహం
రోడ్డు రోలర్ కింద

వాస్తు దోషాల ప్రేమ

నిజం బ్రతక లేని జ్వాలా కాలం
హాలా హల కోలా హలం

వ్యాప్తి చెందిన
విసుగు

పౌరుష కిరణాల దాటికి
చెలిమి చెలమ బరిబత్తలాయే

గోరీలు మోసుకుంటున్న
మనుషులం

వేడెక్కుతున్న వెన్నెల కింద
బతుకంతా బొబ్బలు బొబ్బలు...

వెల

సాయంత్రాల మీద
వాలలేని
గుడ్డి సీతాకోకచిలుక

వేధించే ప్రశ్నలన్నింటికి
రెక్క లూడిపోతై...
టేబుల్ మీదనో
పుస్తకాల సోరుగుల్లోనో
ఒక్కోసారి పుస్తక పుటల మధ్య
అక్షరాల్లో
కెలుక్కున పలకరిస్తాయి

కంపూటర్ని పడుకోబెట్టి
పక్క దులుపుకునేలోపల
తుపాకుల గుంపు
దభేల్న....
నిదురను కాల్చిపోతాయి
తేరుకునే లోపల
టీవీలో స్క్రోల్ అవుతూ
ఫ్లాష్ ఫ్లాష్

రోజూ పడిలేచే
రక్తపు నొప్పులకి
గిరాకి ఎక్కువ

జీవితం
చాలా అగ్గువ

అనీమిక్ ప్రేమ

పునాది లేని పరిచయం

గాలి మేడల్లో
ఊగే ఊయల

దరిదాపు లేని వెన్ను
వెన్నుకు చేరగిలపడి
ఖాళీ ప్రపంచం

ఆరు రుచుల సమ్మేళనం
కొంత కాలానికి
ఒకే చేదై....