Tuesday, April 29, 2014

ఇక్కడ ఇలా కూడా సాధ్యపడుతుంది






ఈ వాన చినుకుల సాయంత్రాన్ని

కిటికీ రెక్కల తెరిచి ...లైవ్ గా చూస్తూ

లైక్ చేస్తుంటా



చినుకులు తగిలిన గాలి హొయలు

సున్నితమైన మెత్తని బాధల మీద వాలిపోయాక

క్రమంగా ప్రపంచ గాయాల నుండి కోలుకోవటం

తేలికైన శ్వాస ద్వారా తెలిసిపోతుంది



ఇంకా ,,,మన దేశాల పాలకులనో

విదేశీ మనుషులనో ...లేకపోతే వారి కసాయి కదలికలనో

నిమ్మళంగా

కర కర పకోడీల కింద నములుకుంటూ

జ్ఞానాన్ని పదునుచేసుకోవటం సరదా



రంగు రంగుల నక్షత్రాలై విచ్చుకొని

ఈ మసకవుతున్న సాయంత్రాన్ని

కందిపోతున్న చీకటి కిందికి తీసుకుపోయి

గొంతువిప్పి... అక్షర కాంతుల మధ్య

కాంక్రీట్ వనానికి బతుకు ఆశను తెరవటం ఇష్టం



పూల గుండెని నిమురుకుంటూ

అగడు తగలకుండా ఆత్మను తడుపుకుంటూ

సూర్యుడు విడిచిపోతున్న అందానికి

దగ్గరగా జరిగి

ఈ నాటిలా ... సాయంత్రానికి సెలవు చెప్పటం

అప్పుడప్పుడు సాధ్యమైనా...

సార్ధకమే బతుకు.




.....

29-4-2014

Sunday, April 27, 2014

నేను నీ కోసం బతకను




వేసారిన రోజులు మననుంచి వెళ్ళిపోవు
కావాల్సిన నమ్మకం ప్రసరించక పోతే
ఒంటరి యాత్రకి దిక్కు తెలియదు


అందరూ ఇక్కడ పాత్రధారులే
నిమిషాల తేడాతో నిష్క్రమించక తప్పని వారే

పరిధులు గీసే వారు తెర మీద కనిపించరు
వలయాలు వలయాలుగా మనుషులు
పేరుకుపోతారు యుగాలుగా

కొంత వెలుగు కొంత చీకటి
సంతోషాన్ని ప్రకటిస్తాయని తెలియక
అపోహల చుట్టూ తనుకులాట

చెరువంతా ఒకేసారి ఈదటం
ఏ చేప కీ చేతకాదు
బతకటానికిగల అవకాశమే అదృశ్య కానుక

దిక్కుల మీదికి విసిరేయక
దిగులును జయించడమే బలమైన గెలుపు.

రోజూ చిగురించడం తెలిసిన వానికి
చీడ ని చెరపట్టటం చాలా తేలిక


.....
27-4-2014

Saturday, April 26, 2014

కరచాలనం చేయనివ్వనిది ఏదో ఉంది


రాత్రికి చెందిన ఏ ఒక్క కణాన్నీ
నీ కోసం దాచిపెట్టలేదు

నా మీదుగా నడిచి వెల్లినవే
వెళ్తూ...
నీ గురించిన కొన్ని వాక్యాలతో
నన్ను మోహితున్ని చేసినందున

ఐనా చాలా సార్లు
నువు పరిచయమో ...అపరిచయమో లెక్క తేలదు

ఒకరు తెలియడమంటే ఎలా?

ఆకృతి పూర్తిగానో ?
చర్మపుస్పష్టంగానో ?
కొరుకుడు భావంలోనో ?
లోపలి కేంద్రకంగానో ?
చిరునవ్వుల పై వాలిన చూపుల వరకో ?
అంగాలకి అవతలి తలం లోకో ?
పయనించడమా.....

ఎప్పుడూ ఒక కొరడా నిల్చుండటమే?
ఒంపుతిరిగి.

ఒక్క సారైనా నిన్నుకలిసింది
ఎప్పుడో తెలిసిన గుర్తులు తేలుతున్నాయి

ఏమో?

మధ్య...ఓ సముద్రమో...!
లేదా ఓ ఎడారి కాక్టస్ గుంపో !
ఇంకా లేదా
ఓ కన్నీటిచుక్కో
అటూ ఇటూ కలుపుతున్నది

.....

చిక్కుముడి



అంతా బాగానే వుంటుంది
కళ్ల కింద నల్లని ఆశ కన్పిస్తుంది
బేరం చేసే వీలుండదు

రాత్రికి రాత్రి లేచి
మెడలో సంచీ తగిలించి
ప్రపంచం బతుకుతున్న చోటుకి వెళ్దామని
హడావుడి ని వెంటేసుకొని పోతూ
మల్లక్క మీద పడ్డ కాలుకు
ప్రేమ చిక్కుకుంది
" బావా ఎక్కడికి" మగత ప్రశ్న
అడుగును అడుగేయనివ్వక ...

భద్రంగా భద్రానికి అవతల
సంచరించే కోరిక తీరనే తీరదు

బయటివాళ్ల కంటే నిత్యం
లోపలి వాని వేధింపులు ఎక్కువయ్యాయి
నడకనుండి

వాడు విహారి
నేనేమో బికారి.


.....

Thursday, April 24, 2014

అదనపు వ్యధ





పోతూ పోతూ మరిచేపోతాం


చేతనైనది కూడ చేత చిక్కించుకునే
ధ్యాసే వెలగదు
పోనీ ఏదైనా మళ్లీ తెప్పించుకునే వీలు కూడా
కాకపోవచ్చు
మన దాకా చేరవేసే కాలానికి
అప్పటికి మన చిరునామా ఖాళీ కనిపించవచ్చు


నీకూ నాపని చెప్పలేను నిజానికి
నీది నీకు మోపెడంత దించే దిక్కుండదు


కలిస్తే మాత్రం
కళ్ళను ఊరడించుకుంటూ
పాదాలను పవిత్రం చేసుకోవచ్చు.


అంతుపట్టని ఆత్మ చేసే మంత్రజాలంలో
ఎవరి వంతు ఎంతనేది తెలిసేవీలుందో లేదో...


ఏదీ వెంటరాకుండా ఓ ఏర్పాటు ఉన్నాకూడా
అన్నీ కూర్చుకుందామనే కోరిక వెంట పరుగే
పెద్ద వ్యసనం


కొన్ని క్షణాల్ని మాత్రం నిలబెట్టుకోవచ్చు మనకోసం
అవి నిత్యం వాడిపోని పరిమళపు సొంపుని
పూయడం చేత .

.....
24-4-2014

అసంకల్పిత రసన





ఊహలతో కూడిన కలలు
కొన్ని నక్షత్రపు ఆశ్చర్యాల్ని
వానచినుకుల చలికాంతినీ
ధారగా ఆస్వాదించే సమయాన
నువ్వు నన్ను అవలీలగా కలిచివేస్తావు


ఒక్క వేకువ యవ్వనాన్నీ
కూడా నిరాశగా
నీ ధ్యాస నుండి వేరుగా తిప్పనూ లేను

పనికిమాలిన వ్యసనమని
తోచిన ప్రతి కలయికా నా
ఆనందపు చలనాల్లో వేడుక చేసుకుంది

నిను కలిగిన తలపు
నా అణువుల అలల పై
పూల ఋతువును వెలిగించెనెందుకో...

కళ్ళల్లోంచి కళ్ళల్లోకి
ప్రవహించిన నిశ్శబ్ధమూ
సౌందర్యంతో నిగనిగ లాడిన
సమయాన్ని దాచిన స్థలం
తెలుసుకోవటం సుళువే సుళువే

తేలికైన బతుకు
నీ లే స్పర్శను రెపరెపలతో అల్లుకుంటుంది .

.....
23-4-2014

4




సంపదలు సమకూర్చని సత్యం స్వచ్ఛంగా
నీ నీడ కిందికి చేరినపుడు


ఎవరమో తెలియని చోటు నుండి
ప్రయాణం మధ్య లో అలసట ఆవిరౌతుంది

కొద్దిసేపు లయకు కాంతి అద్దుకుంటుంది
మౌనం మెల్లమెల్లగా గుసగుసపెడుతుంది

పెచ్చులుగా రాలిపోయే బంధాల నడుమ
వేదనకి చలిచలి పరిమళం కలుస్తుంది

వెన్నువెంట సన్నని సౌందర్యపు పిలకలు లేస్తాయి
.....మనసు ఓ అద్భుత మర్మాంగం .....

.....

3



ఆప్పుడప్పుడు నువు లోపలినుండి
కనుపాపను తడుముకుంటూ వస్తావు


అపుడే గుండె లేని క్షణాలు నిల్చి
ప్రపంచాన్ని శూన్యం లోకి ప్రవేశ పెడుతుంది

ఖాళీ ఖాళీ దేహం తో ఆత్మకు
ఆసరాగా ఏదీ దొరకదు

శబ్దాలను చుట్టుకున్న నిశ్శబ్దం
నీ లేత స్పర్శ మీద వాలిపోతుంది

జీవిస్తున్నట్టు ఓ దాఖలా
అక్షరాలు చెమ్మగిల్లుతున్నపుడు.

.....
18-4-2014.

Thursday, April 17, 2014

ఆనందకాలం 9



సెలవుల్లో ఎటూ తోచట్లేదు మా ఆనందునికి
ఆడి ఆడి... అలిసి పోయి .....ఏంచేయాలో తోచక టీవీ పెట్టుకుంటడు

ఏ టీవీ లో చూసినా ఎన్నికల గోల...

అదీ చూడబుద్దికాక ...జుట్టు పీక్కుంటూ...''టీవీ పాడై పోయింది డాడీ ''అంటుండు.

''మంచిగానే ఉంది కద ''అని నేను.

''సరే గాని నాక్కొన్ని ఓట్లు తెచ్చి పెట్టు ''అన్నడు ఓ రోజు .

నాకేం అర్ధం కాలే.

''అవి తెచ్చేవి ఇచ్చేవి కాదు రా...వేసేవి''అన్నాను.

''ఎట్లా ఏస్తారు...''దీర్ఘం తీస్తూ అన్నాడు.

ఎట్లా చెప్పాలా వీడికి అని నేను ఆలోచిస్తున్నా...

వాడే...''సరేలే కొంచెం టైం తీసుకొని చెప్పు...''అనుకుంటూ జారుకుండు.

నా చిన్నప్పుడు ఓట్లు వచ్చినప్పుడు నాకు బాగా గుర్తు...
ఊరంతా తిరిగె మంది తోటి తిరిగేది.ఆకరికి ఆఫీసు కాడికి వచ్చి పరదాలు బానర్లు పట్టుకొని కట్టేవాల్లకి అందిచ్చేది.
రెండే పార్టీలు...సుత్తె కొడవలి...ఆవుదూడ

గోడలనిండా జాజు రంగు తో కొబ్బరి పీచును బ్రష్ లా చేసి రాసుకుంటూ పోయేవారు...

''ఆవుదూడ ను చిత్తు చిత్తు గా ఓడించండి''
''సుత్తె కొడవలికే మన ఓటు''
ఇంకా కొన్ని బూతులు కూడా రాసే వారు...అవతల వాళ్ళ మీద.

మర్చి పోయిన ...కంకి కొడవలి కూడా వుండేది.

చిన్న చిన్న బిళ్ళలు ఇందిరా గాంధి వి ...కంకి ..సుత్తె కొడవలివి కూడా షర్టు కు పెట్టుకొని పెద్ద వాళ్ళు తిరుగుతుంటే ...కావాలని పించేది.

కాని పిల్లలకి ఇచ్చే వారు కాదు.
అవి సంపాదించటం కోసం వాల్లెంబటి తిరిగేది.

ఒక నాడు తిరిగి తిరిగి ఒక కాంగ్రెస్ బిల్ల సాధించి...సీకటి బడ్డంక ఇంటికి వచ్చిన.

పార్టీల తిరిగోచ్చినందుకు మా నాయిన ''సుర్కు''అందుకుండు.
సుర్కు అంటే...ఒక చిన్న కొరడా లాంటింది.

ఏసిండు రెండు...ఆవుదూడ బొమ్మ బిల్లా దొరికిన ఆనందం ఎగిరిపోయింది.
మళ్లీ ఎన్నికల వైపు చూడలేదు...ఇప్పటికీ ఎన్నికలంటే అసహ్యమే.

మా ఆనందు నికి ఎట్లా చెప్పాలో ఆలోచిస్తూ ఉన్నా...
ఈ లోపు వాడు వచ్చీ రాగానే...

''బుర్రలో వెలిగిందా ఏమైనా అన్నడు.''

లేదన్నట్టు తలకాయ ఊపిన .

''డాడీ...ఓటెయ్యండి ఓటెయ్యండి ...అని టీవీ ల చెప్తుండ్రు కదా...నువ్వెప్పుడు తెస్తవ్...
మరి నేనెప్పుడు ఎయ్యాలె చెప్పు...''

అవతల మల్లక్క ''అబ్బో ...మీ అయ్య తెచ్చేది కాదు ...నువ్వు ఏసేది కాదు లే సోది..ఆపండి అన్నది.''

''అమ్మో హైకమాండు అమ్మకు కోపం వస్తుంది ''అన్నా...
''వేరే పార్టీ పెట్టుకోమను అయితే...''అనుకుంటూ ఉరికిండు.

.....

ఆనందకాలం 8



హమ్మయ్య...
పిల్లలకు పరీక్షలు అయిపోయినయ్...
నేను పరీక్షకు కుసున్నట్టు ఉంది న్ని రోజులు.
కానీ ఇవ్వాళ ఇంకో పెద్ద పరీక్ష ఉంది నాకు...కొంచెం కిందికి సదివినంక మీకే తెలుస్తది

నా చిన్నప్పుడు ఇంత ఉద్వేగం ఉన్నట్టు కూడా తోచనే లేదు.
చదవటం రాయటం రావటం....
బళ్ళో చదివిందే చదువు...

ఇంటికాడ తొక్కుడు బిల్ల కానించి ...తోట రాముడు ఆట దాక ఒకటే ఆట.
ఇప్పటి పిల్లలు అట్ల కాదు కద...

అందున మా ఆనందుడి సంగతి కొంచెం తేడా ఉంటది.

రెండు ముచ్చట్లు చెప్త

సదువు ముందట కుసున్నంక...రొండు నిమిషాలకే...
''నిద్ర రోజు రాత్రికే రావాలి క ద'' అన్నడు.

అవునన్న.

''మరి ఇప్పుడెందు కొస్తుంది'' అంటడు.
''రానియ్యకు...రానియ్యకు జర...సదివేది శాన వుంది ''అంటే

''దానికి కూడ తెలియాలి కద మరి '' అంటడు.

ఇంకోసారి...
చంద్రుడి గురించి ప్రశ్న వచ్చింది సదువులో భాగంగా...
''డాడీ...చందమామ బాయా ....గర్లా...?''
''బాయేరా...''
''మరి వెన్నెల?''

నాకంత ఆలోచన ఎప్పుడు తట్టలే...
''ఒరేయ్ పరీక్ష కోసం సదువురా...ఇవి అడగరు అందులో.''...అని తప్పుకోవాలనుకున్నాకొంచెం కోపం కలిపి.

''ఇంకొక్కటడిగి సడువుకుంట డాడీ'' అన్నడు

''సరే కానీ ''

''ఆకాశం ఎన్ని కిలోమీటర్లుంటది?''

అవతల మల్లక్క నవ్వటం మొదలు పెట్టింది.
సమాధానం చెప్పమన్నట్టు.

''ఏమోరా నాకూ తెల్వదు''అన్న కొంత గొంతు తగ్గించి.

ఒక చూపు చూసాడు లెండి...అది మాటల్లోకి రాదు.

ఇక మొన్ననే...''పరీక్ష లయ్యాక నాదో కోరిక తీర్చాలి డాడీ '' అన్నడు.
'' సరే చెప్పు'' అన్న.
''అయిపోయినంక చెప్త''అన్నడు

నాకే ఊకో బుద్ది కాక చెప్పు చెప్పవా...అని బతిమిలాడిన.
''సినిమాకు తీసుకపోవాలి డాడీ ''అన్నడు గార్వంగా.

ఇంకేమో అడుగుతడనుకున్న...అంతేగా ...ఆనందంగా'' తీసుక పోత బిడ్డా ''అని దగ్గరకు
తీసుకుని హత్తుకున్న...సదివి సదివి అలిసిపోతుండు అనుకొని

''విమానం ల తీస్క పోవాలె ''అన్నడు

పక్కనున్న మల్లక్క సంగతి మీకెరికే.....నవ్వుకుంట నా ముఖం సూడబట్టింది.

.....
12-4-2014

2



గడ్డినీ గవ్వనీ మరిచే పోయాక
కాంతిని మోయలేని కుంటివి

నేల మీద పరుచుకున్న ఆనందాన్ని
అంట డానికి చేతులు పనికి రావు

గుండె చుట్టూ రంగు రంగు గుడ్డపేగులు చుట్టుకున్నాక
కండ్ల దాకా చూపు చేరదు

ఇప్పుడు బతకలేని లక్షణమే
గడిచిన కాలాన్ని నములుతుంది

రుతువుని నిందిస్తూ
రోదనకింద పొర్లాడే వెతలన్నీ రోత.

.....

1



ఒత్తిడి లో నిద్ర నలిగి పోతుంది
చీకటి తో మొర పెట్టుకుంటే మాత్రం ఏం లాభం?

మెల్లగా రాత్రి కూడా
రక్తంలోకి జారుకుంటుంది

లావాదేవీలన్నీ ఒక్కటొక్కటే
లావా లా పైకొచ్చి చేరుతున్నై

అయినా అవేవీ
ఇష్టం ఇవ్వలేనివి .

నువ్వే
నా కమ్మని దడదడ వి.

.....

Friday, April 11, 2014

కలవరింత కలవరింత కలవరింత // డా.పులిపాటి గురుస్వామి //




ఎక్కడా దిక్కు తోచని సమయం లో
నువ్వు గుర్తుకు వస్తావు.


పరిమిత మైన జ్ఞానం నిన్ను పూర్తిగా చేరనివ్వదు.

ఒక తడి గుడ్డ చుట్టిన తపన
నోరు తెరుచు కుంటుంది

చెప్పుకోవడానికి ఎవరున్నారు దుఃఖం తప్ప

అదీ ఒక్కోసారి మాట వినక
ప్రతి కంటి చివర వేలాడుతూ ...నా లోపలికే చేరుతుంది

కలలు కూడా కనికరించని కాడ వల నిండా నేనే వుంటిని

సమయానికి కూడా
చిక్కనంత చిక్కుకుపోయాం అవునా?

ఏ చిరుగు కాడ కప్పి కుట్టు కుందామన్నా సరిపోయేలా లేవు నువ్వు

అప్పటికప్పుడు కొన్ని మాగిన వాక్యాల
ఉద్రేకం మీద నీ చూపు వాలితే ఇంకేముంది ...

అంతా శూన్యం అనిపించటం ఎంతసేపు.

.....
11-4-2014