Wednesday, October 17, 2012

జెరం,ఒళ్లునొప్పులు,క్షణం నిద్ర లేదు



వేడి వేడి పొగ 
తలకాయ దగ్గర పొగ గొట్టం లోంచి ఊదినట్టు 
వొళ్ళంతా పాకిన సెగ 


ఏ మలుపులో 
ఎవరు ఊదారో ఎట్లా తెలిసేది ?
అందరూ ఒకే రకం మనుషులు .


మనసులో నిండిన గాస్ నొప్పులు 
బరువుగా వుండే వాక్యాలు 
వాపుతో కూడిన ఓదార్పు 


పలుచని ఆప్యాయత 
కనిపించకుండా ఏదో కలిపినట్టున్నారు 
రెండు వేళ్ళ మధ్య జిగురు జిగురు 


ఎక్కడ మొదలైన వైరసో.!
ఇంటింటి సోఫాల మధ్య 
మూలుగుతూ పైకి కనిపించని ప్రశాంతత.

    .....

Monday, October 15, 2012

"ఏది నీది''


ఇక్కడికి
చూడడానికి వచ్చాం
గుర్తుంచుకోవాలి

ఏదీ లేదు నీది
నాదీ అసలుండదు
ఉన్నది ఎవరిదీ కాదు
స్థితిని పొందిన సందర్భాలు

చూడడానికి ఇబ్బందులు లేవు
కాసేపు ఆటలాడుకోవచ్చు సరదాగా!
ఉన్నదాని వెనకాల
ఏదీ లేనట్టుగా
కాసేపు అనుభవించాలి తమాషాగా

నీవు పెడ ముఖంతో
నేను వెటకారంతో
కొంతసేపు వాతావరణాన్ని
కలుషితమూ చేసుకోవచ్చు....
అవి కూడా
ఎవరికీ సంబంధించినవి కావు
దారినిండా పూసే కాగితం పూలు
హృదయంలో గుప్పుమంటాయి

నుదుటి మీది చెమట చుక్కతో
సూర్యున్ని
భూగోళం కిందికి విసరవచ్చు
పూలు వెలిగించుకున్న
చెట్ల ఆత్మ మీద
మనసును కాసేపు ఆరేసుకోవచ్చు

చుక్కల్ని నాట్యం చేయించుకుంటూ
సుఖ నిద్రలో అలసట తీర్చుకోవచ్చు

ప్రయాణంలో
కడుపొకటే
నీ వీపు మీద కూచుంటుంది
ధైర్యంగా కాళ్ళు
చేతులు తోడుంటాయి

కాసేపు దుఃఖాన్ని రానీ
అది ఊపిరాడకుండా
మూటైతే కట్టదు
దూది పింజను చేసి
గాల్లోకి విసురుతుంది

కళ్ళు కార్చే ముత్యాలు
కొంత కాలం తర్వాత నవ్విపిస్తాయి
గుర్తుందా....!
ఇక్కడివన్నీ చూడడానికి వచ్చామని!!

హాయిగా తల కింద
చేతులు పెట్టుకొని
కాలు మీద కాలేసుకో
ఆకాశం వంక చూస్తూ
నీ కనుపాపల్లో
నిండినదంతా తడుముకో

ఆ సమయం నీది
- డా.పులిపాటి గురుస్వామి
98488 87904

Tuesday, October 9, 2012

దిష్టి


ఉన్నదున్నట్టుగా చూడవు 

చుట్టూ ప్రదక్షిణలు చేసి 
మూసుకున్న కోణం నుంచి,
ఇంతకు ముందే ముడుచుకున్న స్థానం లోంచి 
వ్యాఖ్యానాలు పెట్టుకొని 
నిర్ధారణకు నిలబడతావు.

ఉన్నదానికి 
హఠాత్తు గా దూరం జరిగి ,
ఇంకా లేకపోతే ...
దాని బాల్యంలో 
అప్పుడప్పుడే పొడుచుకొస్తున్న ,లేదా 
తడ బడుతున్న సందర్భాన్ని 
ఆపాదించుకుంటూ 
మనసులో కలవని 
నిలవని అపరిచితాన్ని విసురుతావు .

ఉన్నదానికి 
దాని లో లోతుల్లోకి పోయి 
సూక్ష్మ సూక్ష్మపరమాణువుల చెంత 
దాన్ని పీలికలు చేసి 
ఒక్క లక్షణమూ సరిపోదని 
నిర్వచనాలనే 
నిందలోకి కూల్చేస్తావు.

ఉన్నదున్నట్టుగా చూడవు .

దాని చుట్టూ కొంత 
గుగ్గిలం పొగ ధూపం వేసి 
చిటుకు చిటుకు మంటూ 
చిటపట లాడుతున్నపుడు 
ఇక దాని స్వభావం గురించి 
రంకెలు మొదలౌతాయి .


దాన్ని కొంచెం 
కారం దినుసులతో 
పిండి, పిసికి 
రుచికి దోరగా వేయించి 
నిగ నిగ అవాస్తవాన్ని 
అప్పటి స్వభావాన్ని తూకం వేస్తావు.


ఉన్నదున్నట్టుగా చూడవు


తలుపు చాటుగా వంకరగా చూస్తావు 
చెవుల మాటుగా వింటావు 
వెనక నుండి ముందు భాగాన్ని 
నిర్వచిస్తావు .
కింద చూసి పై భాగాన్ని 
అంచనా ఫ్రేం కడతావు 

నీ దగ్గరికొచ్చిన అబద్దానికే 
ఫాషన్ కలర్స్ గుడ్డలు వేసి 
రంగుల మేకప్పుతో 
ఉన్నదిదేనని నమ్మిస్తావు.
దానికి కొన్ని మాటలు నేర్పి 
తన స్వభావాన్ని తనే నమ్మలేని 
సందిగ్ధం లో చిత్రపటం వేసి విసిరేస్తావు.


ఉన్నదున్నట్టుగా చూడవు


దాని వెనకాల ఏముందో....?
కనిపించకుండా పోయిన 
గతాన్ని గోళ్ళతో గీకి 
కాకపోతే ఆ కాలం మీదికి గూఢచారిగా వెళ్లి 
దొరికిన ఏ విడి భాగాన్నో 
ముందు పెట్టి నమ్మేలా చూస్తావు.


అంతే,లేదా 
అదేమీ నీకు తెలియనట్టు 
అట్లాంటిది అసలు లేదని 
మొత్తం కాలానికి వకాల్తా తీసుకొని ,
ఉండే అవకాశాన్ని కూడా 
నరికి పోగులు పెట్టి,
ఖాళీ ఖాళీ గుణాలతో 
పెళుసు జ్ఞానాన్ని నిలబెడతావు.


ఉన్నదున్నట్టుగా చూడవు.

      .....




Monday, October 8, 2012

ఖాళీ తనం


అయిపొయింది 
చేరాల్సిన వారికి,
చేయాల్సిన వారికి 
చేరాయి వార్తలు 
ఎదురుచూసేవారు ఎలాగూ లేరు 
ఇక నిశ్చలనమే. 


పాత తనబ్బీ తెరవ బుద్ది కాదు 
తాతల కాలం నాటి 
జన్యువుల బొట్టుపెట్టె
నేనే దూరం చేసాను 
స్నానాన్నిప్రశ్నించే సందర్భమూ రాదు 
అలంకరించమని నొసలు కూడా అడగదు 


మడతల కిందికి పోయి 
మసిబారిన ఇద్దరు పిల్లల ప్రియురాలు 
ఈ సమయాన్ని ప్రియంగా 
వేడుకునే అవకాశమూ లేదు 


పరీక్షల్లో పూరించలేని ఖాళీల మధ్య 
చిక్కుకున్న పిల్లలు.
తర్వాత రాయాల్సిన డిక్టేషన్ 
స్పెల్లింగ్ మిస్టేక్ తో 
రెడీగా ఉన్నట్టుంది.


ఏ చెలికాడూ బాగోగుల ప్రశ్నలతో 
బయలు దేరే దాఖలా లేదు 
ఉదారపు ఊరడింపులకు 
సాపిన హృదయమూ లేదు 
ఇక ఆ కిటికీ మూసినట్టే .


ఈ రోజంతా 
కలిసి నడిచే సమయానికి 
కొంత ఊరడింపు 
న్యూస్ పేపర్ను యదావిధిగా 
పొయ్యిలో పెట్టటం మరువలేదు 


ఇక కావలసినంత మేధో హాయి
యాతన లేమి 
కంటి నిండా చేరిన 
ఒంటరి కాంతి 


అప్పుడప్పుడు 
తాబేలు తలకాయలా 
తడుముకుంటూ 
ముడుచుకుంటూ ఆకలి.
ఈ ఒక్కదాన్ని సవరిస్తే 
మిగిలిన సమయం మీద కాలేసి 
కలలు పిల్చుకోవచ్చు .


తెలిసిన ,ఉన్న 
ఒకే ఒక్క అవతారాన్ని 
ఎవరి కోసమో ఎక్కుపెట్టడం 
కుదిరేటట్టు కూడా లేదు .


అనుకోకుండా దండయాత్ర చేసే 
ఆవేశాన్ని కదిలించడం ఇష్టం లేక 
ముందే మూసిన దారులతో క్షేమమే. 


ఇక అంతా నిర్యుద్ధమే 
గడియారం చుట్టూ తిరుగుతున్న నావెంట 
నేను తిరుగుతూ.


కొన్ని అక్షరాలు మాత్రం 
మెదడు వేళ్ళల్లో 
జీవక్రియను సిద్ధం చేస్తున్న సంకేతాలు.

        .....

Saturday, October 6, 2012

వంగిన నడుము



పచ్చని చెట్టు 
జీవితకాలం ఎదగడానికి 
ఎన్ని కాలాల్ని పుష్పించాలి 
ఎన్ని ఉరుములకి 
గుండె మోగించాలి ?


గుర్రుగా లేచిన 
దురదృష్టం మాస్టారు ముందర 
ఎన్ని సార్లు 
చేతులు చాచి నిలబడాలి ?


గండు చీమల బారు 
పాకినంత మేరా 
ఆకుపచ్చ పచ్చ బొట్టులా 
ఉబికి తేలిన రక్తనాళాలు 


ఎండలకి వానలకి 
కన్నీటి చర్మాన్ని కప్పుకుంటూనే
సాగిస్తున్న నడక 
దివ్య యాత్ర .


అన్నమై ఉడికి 
రుచిని నింపుకున్న చేతుల్లేక పోతే 
బతుకు బండ మీద 
ఎపుడో మాడిపోయేవి కదా 
జీవుల పేగులన్నీ


ఇంకా తడి చావని వేర్లు 
ప్రేమ చిగుళ్ళతో 
పలకరిస్తూనే ఉంటాయి 


ఎగిరిపోయిన కువకువలు లేక 
రాత్రిని తన గుస గుసలతో 
మేల్కొలుపుతుంది 


సదా ధ్యాసతో 
తన నీడని
తారాట్లాడిన జీవులకై 
ఒంపుతూనే ఉంది 


అవును.....
ఆ వంగిపోయిన కాండం 
మా అమ్మదే.

    .....

Wednesday, October 3, 2012

వానధ్యానం


శబ్ధాలన్నీతమ తమ
బోరియల్లోకి వెళ్ళాక ,రాత్రి
రంగస్థలం మీదికి నటుడు
ప్రవేశించేముందు తెరలేచినట్టు
మెల్ల మెల్లగా...

చినుకులు చినుకులు
వాయిద్యకారులనేకమంది
ఒకే మంద్ర స్వరంతో
ఆకాశం నుండి వినిపిస్తున్న స్వర ధార

చీకటి నిశ్శబ్ధం తడిసిపోతూ
రెండు చేతులడ్డం పెట్టి
కేవలం చినుకుల లయని
మనసు చుట్టూ అల్లుకుపోతున్న సమయాన

దుప్పటికింది అవయవాలన్నీ
ముడుచుకొని ,
వెచ్చదనాన్ని కాపుకుంటూ
చెవులని కలువల్లా తెరిచి
వాన చినుకుల్ని స్పర్శిస్తూ
పక్షుల్లా నిశ్చేష్ట మై

చినుకులు చినుకులు
ఒకదానికొకటి రాసుకుంటున్న చప్పుడు
నీటి మీద నీరు పడుతున్న గలగల

ఏకాంత లయలో మనసు తడుస్తూ

మైదానంలో ఒకే ఒక తాటి చెట్టు నిలబడి
తడుస్తున్నట్టు
ఒళ్లంతా నీరు ప్రవహిస్తున్న ధ్వని

కొంత సమయానికి
చినుకుల శబ్ధమే నేనై మిగిలి.

.....

Tuesday, October 2, 2012

మలుపులు



మలుపులు లేని ప్రయాణం 
కొత్తగా ఉండదు 


ఎంత సేపని కొత్తగా నడుస్తాం 
ఎడమకో
కుడికో తిరిగితే 
కొత్త దిక్కు
మిత్రుడి వలె హత్తుకొని 
దాచిన ముచ్చట్ల మూట 
విప్పుతుంది 


ఎంతసేపని రోడ్ల వెంట 
దుమ్ముపట్టిన నగరాన్ని 
చీకొట్టుకుంటూ
వాహన కాలుష్యాన్ని తిత్తుల్లో నింపి 
ఎగపోసుకుంటూ దోర్లిస్తాం? 
ఇంటి వైపుకి తిరిగితే 
చల్లని పరిచయమైన హస్తం 
నీ ప్రేవుల నిండా ప్రేమను నింపి 
వడపోసిన శ్వాస తో వేడి వేడిగా 
నీ కలత ను కాపడం పెడుతుంది 


ఒక పొడవైన రాత్రిని 
సాగిన పగల్నికూడా 
ఆనందించ గలమో!లేదో !


కదల్లేని వృక్షాలకి కూడా 
ప్రకృతి ఆరు అనుభవాలని 
పక్షుల కచేరీతో 
పరవశం గాలితో కలిసిన 
పులకింతను పూయిస్తుంది 
అక్కడి నుండే కదా 
బాలింతరాలై జీవులకి
ప్రాణం పట్టేది 


రోజు కొంత కొంత 
కొత్తదనాన్ని ప్రకటిస్తూ 
పక్షం రోజుల్లో 
ప్రపంచ సత్యం 
వెలుతురు చీకట్లని 
నీ కంటి ముందు నిలబెట్టే 
చంద్రుడు కూడా 
మలుపెరిగిన మహాత్ముడే 


ఎక్కడికీ పోలేని తనంతో 
స్పర్శకి రాని ప్రపంచం గురించి 
ఎంత చెప్పినా రుచి కరువే 


హే ఆనందుడా...!


కొంత అనుభవం తర్వాత
తటస్థ పడే మృత్యువు కూడా 
గొప్ప మలుపే.

     .....


కడుపుల కాలితే



మనమిపుడు
కడుపులోంచి గానం
మొదలు పెట్టవచ్చు


రాత్రిని మెలిపెట్ట వచ్చు ,ఆ
కునికు పాట్లని నగరమవతలికి
నెట్టవచ్చు ,లేదా
కరగదీసి,గడ్డ కట్టించి
దాచవచ్చు

ఆరాధించ వచ్చు ,ఆ
పిలిస్తే పోగలిగిన నడక వెంట
హృదయంతో , లేదా
తలచి తలచి
కోరిక మెడపట్టి గిల్ల వచ్చు

పేల్చవచ్చు ,ఆ
కనుబొమల మీది కాంక్షని
చెరగవచ్చు ,లేదా
అనువదించి
గోడ మీద అతికించ వచ్చు

మనమిపుడు
అక్షరాల్లోంచి అగ్నిని
వదలవచ్చు

.....