Tuesday, July 31, 2012

పరుగెడుతున్న కాలం కిటికీ లోంచి


సూర్యున్ని వీపు మీద మోసుకొని
కన్నీళ్ళ కలలు కంటూ
నిర్వీర్య వీరుడవై
నమ్మకం పెచ్చులూడుతున్న
వయసు గాలుల్లో...


నీ మట్టుకు నీవు
కొట్టుకు పోతుంటావు


...ఓ కమ్మని పాటను
తయారుచేసుకున్న విలుకాడు
శబ్ద లయలలో పొదిగి
తడిసేలా నీ మనసు
విసురుకుంటూ పోతాడు


* * *


చిల్లర గాయాల్ని ఏరుకుంటూ
నీ పిల్లల భవిష్యత్తు పై చెయివేసి
నిమురుకుంటూ నీ దగ్గరికి లాక్కొని
నీ గుండె కొక్కాన్ని తగిలించి
ఊయలలూపుతూ ...


నీ మట్టుకు నీవు
ఉబలాట పడుతుంటావు




...చేమ్కీలతో కలిసిన వెన్నెల
రాత్రిని కాసేపాగమని
వేపచెట్టు గాలిని బతిమిలాడి
నీ తపనల తాపం మీదికి
ప్రవహించుకుంటూ పోతాది


* * *


సున్నపు గీతల గోడల మీద
నువు కలలు కన్నా చిత్రాలు
కనిపిస్తాయేమోనని వెతుక్కుంటూ
అద్దం లోని నీ మీద
అక్షింతలు చల్లుకుంటూ
నువు కుట్టుకున్న బతుకు
నెత్తిన పెట్టుకొని ...


నీ మట్టుకు నీవు
మునకలేస్తుంటావు


...ఓ చల్లని చెరుకు తేనె పాటను
పూసుకొని
ఏడేడు వర్ణాల నీకు
నచ్చిన వాటిని ఏరుకొని
నీ దాహం తిక మక పడేటట్టు
లేత వయసు చిగురుటాకుల
సొగసు కాలాన్ని నీకోసం
చెంచాడు చెంచాడు తినిపించడం కోసం
ఓ మల్లె నీచుట్టూ
వ్యాపించుకుంటూ పోతాది

      .....

No comments:

Post a Comment