Friday, February 8, 2013

చలిమంచు జలపాతం లో.....




మంచు మఖమల్ మనసు మీద 
నడిచి రా...!


ఇక్కడ ఆకాశం విరిసి
ప్రవహించిన గాలులు 
నింపుకున్న నేరేడు ,చింత వేప సోయగాలు 
నిలువెల్లా మీటడానికి  
నీ నాద శరీరం సిద్ధమేనా...!


పక్షులు నేర్చుకున్న రాగాల 
పరవశం నీకోసం 
గుప్పెట్లో పట్టి ఉంచుకున్నాయి.


చలిగింతలు 
మాటు కాస్తున్నాయి 


పండు ఊహల సవ్వడి 
వినటానికి 
చిటారు కొమ్మల చిలిపి చిగురాకులు 
నిశ్శబ్దంగా ...
చూపుల్ని భద్రపరిచాయి.


వేకువలో జారిపోయే 
ఈ పచ్చని వెన్నెల తాగగలిగితే 
అమరత్వం దగ్గరగా జరుగుతుంది.


గుండెని భద్రంగా 
అమలినంగా పట్టుకొని రా...!


ఒలకని సౌందర్యసత్త్వం 
నిండుగా నింపుకొని పొదువు...


          .....

No comments:

Post a Comment