నన్నొక సారి కలకలంలా
కనుక్కున్నందుకు
నా కిరణాల వేళ్ళకి
పూలు పుట్టిన్చినందుకు
ఆ గాలుల తడిసిన శరీరాలు
మానని పాటలు
చెక్కుకునేలా చేసినందుకు
తేనె కుండీలో మునిగిన పదాల్ని
నా శరీరం మీద
ఏరినందుకు
ఖాళీ మట్టి కుండలో
మిగిలిన శూన్యాన్ని
అక్షరాల తో ఆడించినందుకు
నా ఊరి కల్లెడ వాగులో
ఎండిపోయిన నత్తగుల్లని
పట్టుకొచ్చి నందుకు
ముక్కలు ముక్కలైన దుఃఖాన్ని
ఒకచోట చేర్చి
నా వీపు మీద అంటిచ్చినందుకు
రంధ్రాలలోంచి కారిపోతున్న
కాలాన్ని రంగరించి
చుక్కలు చుక్కలు గా చప్పరించమని
నోటికి మురిపిచ్చినందుకు
సెగలు సెగలౌతున్న రక్తాన్ని
వెన్నతో తడిపి
పేగుల్లోకి ఎక్కించినందుకు
కనరాని తోవల్ని
దారికాచి బిగవట్టి
నా కాల్లముందర పరిచినందుకు
నన్నొక సారి
కన్నీళ్ళలా కన్నందుకు.
.....