Monday, April 30, 2012

నా సెలయేరు హృదయం......6

ఆకులు రాల్చుకునే 
వృక్షాలకు ఓ కాలం కొత్తది


ఈకలు రాల్చుకునే పక్షులకి 
ఆ సమయాలు కొత్తవి 


ఏదీ వదుల్చుకోలేని
మనుషులకి ఏమున్నది కొత్తది?




                  ఈ మసక లోకానికి 
                          వలలు చుట్టుకున్నాయి 
                          ప్రియురాలా.....!
                          ఈ రాత్రిని వెళ్ళనీయకు 






                         .......




             

Saturday, April 28, 2012

నా సెలయేరు హృదయం......5

నీవు పాడిన దుఃఖం
ఎటు తిరిగి ఎక్కడికి చేరెనో


నేను పాడిన శోకమూ 
ఎటో తిరిగి అక్కడికే చేరెను 


రెండూ కలిసిన సమయాన 
భూమి మీద ప్రేమే  మొలకెత్తెను  


          
                      ఈ మసక లోకానికి 
                      ఇది ఎట్లా తెలపడం 
                      ప్రియురాలా......!
                      ఈ రాత్రిని వెళ్ళనీయకు 

Friday, April 27, 2012

నా సెలయేరు హృదయం.........4

చంద్రుడు నీటిలో పడి 
ఊరుకుంటాడా?


అలల కలలపై 
వెన్నెల సంతకమౌతాడు 


నీ కన్నుల కదలికల 
తడి తెర తెరలపై 
నేనూరుకుంటానా....!




                     ఈ మసక లోకానికి 
                     ఎలా తెలపడం 
                     ప్రియతమా.....!
                     ఈ రాత్రిని వెళ్ళనీయకు 





Thursday, April 26, 2012

నా సెలయేరు హృదయం........3

ఒంటరిగా నడుస్తున్నపుడు 
నీ వేలు పట్టుకొని వస్తాను 


అలజడిగా ఉన్నవేళ
నీ మనసు పట్టుకొని ఊపుతాను 


కనులు మూసుకున్న కలతల్లో 
నిను చల్లబరిచే కన్నీరౌతాను 


                               ఈ మసక లోకానికి 
                               ఇది అర్ధం కాదు 
                               ప్రియసఖీ ......!
                               ఈ రాత్రిని వెళ్ళనీయకు.


                         .....

నా సెలయేరు హృదయం.......2


నేను భూత భవిష్యత్ వర్తమాన 
కాలాల్లో పొర్లుతుంటాను 




నీవు కళ్ళముందర చూసి 
అడుగేయమంటావు 




కాలిపోయిన 
కాలపు మచ్చలెన్నెన్నో.....




                                     ఈ మసక లోకానికి 
                         బొబ్బల బాధ తెలియదు 
                         ప్రియురాలా .....!
                         ఈ రాత్రిని వెళ్ళనీయకు 


                                 ...

Wednesday, April 25, 2012

నా సెలయేరు హృదయం .......1

నిన్నుగా అంతటా చూస్తూ 
నన్నుగా మరిచిపోతూ


నిన్నుగా పీల్చు కుంటూ 
నన్నుగా వదులుకుంటూ 


నిన్నుగా ఆలోచిస్తూ 
నన్నుగా శూన్యమౌతూ ....


                                    ఈ మసక లోకానికి 
                                    ఇది అర్ధం కాదు 
                                    ప్రియురాలా 
                                    ఈ రాత్రిని వెళ్ళనీయకు.....

Friday, April 20, 2012

ఎప్పుడూ ఎక్కడికి వెలతావ్?

ఏ కాలం వెనకాల వెళ్ళినా 
పరిమళాల పాటలు పాడే 
పూలు వికసిస్తాయి 

బాటసారుల పరవశంతో 
వాటికేం పని?

అవి సమయానికి శోభను తెస్తూ 
నీ మనసు చుట్టూతా 
బందిఖానా నిర్మిస్తాయి 
వాటి భాషలో అవి సౌందర్యాన్ని రచిస్తాయి 

పూల భాష తెలుసుకోవడం కోసం 
నేను 
కవిత్వం వెంటపడ్డాను .....ఇష్టంగా.

Wednesday, April 18, 2012

ఎలాంటి కలహాన్నయినా మచ్చిక చేసుకోవాలి

ఇంకా పని ముగించి ఉండవు
నా పలకరింతను పసిగట్టినా
సగంలో వదిలి రాలేని పనికి
నిజం చెప్పలేవు ...

నలుగురికి జీవితాన్నిచ్చే పనిలో
నువ్వుంటావు
నేను ఒడ్డున కూచొని
ఒక్కో రాయిని నీ మీదికి
విసురుతుంటాను....

నీ ఆత్రంలో నీవు
మునకలేస్తుంటే
నా ఆత్రానికి ఒడ్డుకు
పిలుస్తుంటాను

నీ నుదుటి మీది
చెమట చుక్కలతో
సమయం ఆవిరౌతుంటే
ఆకాశంలో చుక్కల్ని
కిటికీ లోంచి ఒంపుతుంటాను ....

ఒత్తిడిలో ఎప్పుడో
కసురుకుంటావు.....
నీనూరుకోను
మళ్ళీ మళ్ళీ
నీ బెత్తపుమాటల కోసం
గడప దగ్గర
చేతులు చాస్తాను.


*****




Sunday, April 15, 2012

నీ వైపుకి వీస్తున్న గడ్డిపరకల గాలి .....3


కలలు రేపిన అలజడి 

నీ తలపులతో కూడిన 

కలత నిద్ర ...


చేతులు కలిసే ఉంటాయి 

వాయిద్యాలు అనేకం 

వాతావరణాన్ని విందు చేస్తాయి 


శూన్యంలో వుండే ఆకాశంలో 

అనేక కోట్ల నక్షత్రాలు 

కోలుకుంటున్న నా లోపలి శూన్యం లో

నీతో మెరిసి పోతున్న 

అనేక కోట్ల ఆకాశాలు 


ఊపిరి నిండా 

వెన్నెలని కుట్టుకుంటూ 

జారిపోతున్న రాత్రికి, వేసిన గాలాన్ని 

నాగది కిటికీకి తగిలించక తప్పలేదు 


నీ రెండు లోకాలని 

తిప్పుకుంటూ చెప్పిన కథలకి 

ఆకాశానికి ,రాత్రికి నిద్ర లేదు 


ఓదార్పు జాడ తెలిసింది 

చల్లటి ప్రేమ కలిగిన చేతులు 

భూమండలాన్ని జోకొట్టాయి 




........***********...........
నీ కోసం ఋణపడ్డాను 


నిశ్శబ్దానికి చాలా 
ఋణపడి ఉంటాను 

ఎన్నిసార్లు నిను 
నా ముందటికి తోసి 
మిగిలిన తలుపులు మూసెనో 


ఎన్ని కథనాల్ని తినిపించెనో
అలిగిన,ఊరట కలిగించెనో


సౌందర్యాన్ని రంగరించి పోస్తూ 
మన నిస్తంత్రీ ప్రేమను 
ఎట్లా కాపాడెనో


ఆశ చావనివ్వకుండా 
ఊపిరిని బతికించి నందుకైనా 
నిశ్శబ్దానికి చాలా 
ఋణపడి ఉంటాను.


      *****

















Thursday, April 12, 2012

నీ వైపుకు వీస్తున్న గడ్డి పరకల గాలి

         2

''మీరు కాల్ చేసిన 


సబ్ స్క్రైబర్ 


నెట్ వర్క్ఏరియా లో లేరు


దయచేసి కాసేపాగి 


ప్రయత్నించండి.....''





నేను చొరబడలేని 


వాతావరణంలో నీవున్నావని...


ఈ యంత్రముగ్ధ


ప్రతిసారీ వెటకరిస్తుంది ...





మన సంగతి 


దానికెలా తెలిసిందని.....!?



మరోసారి ప్రయత్నించమని 


సలహా ఇచ్చాక---


ఊగిసలాట కొంత 


నిలకడకు చేరింది....





        *****
నీ వైపుకి వీస్తున్న గడ్డి పరకల గాలి 
      1 


నీ తీయని పాటలు విన్నాక 


తెలిసింది 


అవి నాదగ్గర 


గుమికూడిన రాగాల లోనివి 





అవి నన్ను గుర్తు పట్టి 


చేతిలో చేయి వేసి 


గుండె నరాల్ని మీటుకుంటూ ......



వెళ్తున్నామని చెప్పకుండా 


కన్పించలేదు......నీలానే.





        *
****
ఏకాంతం వాలిన వేళలందు ....



సూర్యుడు నిను 

వెంటబెట్టుకొని ఉదయిస్తాడు...


నిన్నటి రోజు 

నేను చేసిన తప్పోకటి 

నీ చూపుడు వేలుని నా మీదికి ఎక్కుపెడుతుంది 


ఓ ఎడతెగని 

కాగితంపూల సంభాషణ.



ఒంటరిని కావడానికి వీలులేదని 

నీ కంఠస్వరం మంత్రం చదివేను....



నాడులకెలా తెలుస్తుందో 

నీ జ్ఞాపకం రాగానే 

సీతాకోక చిలుకల గుంపుల మధ్య 

పూల గుత్తి లా మారుతుంది గుండె 



ఎప్పటికీ ఓ ప్రశ్న 

ప్రశ్నిస్తూనే ఉంటుంది 

ఓ జవాబుకు మాత్రం 

ధైర్యం లేక

కన్నీటి బిందువులో దూకుతుంది.......



          *****