Friday, August 31, 2012

శోక తరంగాల ధ్వని లాలన



రోజులు ఒలికి పోతుండగా 
చిలకరించ బడ్డ బతుకు 
కొక్కాలైపోయి 
మొక్కబోయి 
వీపు మీద అతుక్కుపోయి 
మోస్తున్న దుఃఖం జాలువారి 
చారలు చారలుగా 
అట్టలు కట్టుకొని వంకలు తిరిగి 
మురికై 
వాసన మూలాల మీద 
దేవి దేవి __
చాలా సమయం నా పక్కనే 
కూచున్నందుకు 
గట్టి పరిచయమై 
వదల్లేని పర్యవసాన 
అశుభ సందర్భాల మెడల మీద
ఊరేగి ,
ఉప్పొంగి 
నడిచి 
మోకాళ్ళు విరిగి 
వణికి ,ముసలితనం  చర్మానికి 
కథలు చెప్పి 
ఏడ్పుకు పాట నేర్పి 
గాలి కోణాల మీద రాత్రంతా 
జలకాలాడి 
సూర్యుడి ముఖాన్ని గుంజుకొని 
కడుపులో అలలై పారుతున్న 
ప్రపంచంలో 
ముంచి 
జోల పాడుకుంటున్నా .....
      .....

Wednesday, August 29, 2012

బై బై చెప్పే చేతులు



నిన్ను చూడటానికి వచ్చానా !
నా కళ్ళ భాషను
హత్తుకోకుండానే ఆనందం ప్రకటిస్తావ్

ఈ ఒక్క క్షణమే
మనసు మీదుగా
అన్ని మూసిన కిటికీలను తెరవలేక

నువ్వూ నేను చీకటికి తెలియం
చీకటైన నువ్వు తెలుసు స్పష్టంగానే

బేరలు చేడిపేస్తే మనం దగ్గరే
నీ చుట్టూ ఎన్నున్నాయో
నా చుట్టూ ఎన్నున్నాయో
ఎప్పుడు లెక్క కట్టాలె

దూరం నుండే చేతులూపుకుంటూ
గుండెను బలవంతంగా
జోకొట్టుకుంటున్నాం.

.....

Wednesday, August 22, 2012

ఐతుందంతా కానున్నదే


దురదృష్టం ఏదీ లేదు 
అదృష్టం అంతకన్నా లేదు 

ఆకాశం నుండి రాలే చినుకుల్ని 
ఒక్కోరకంగా ఒక్కోడు వాడుకుంటాడు

ఏడవటం లో ఒకడికి త్రుప్తి 
ఏడిపించడంలో మరొకడికి 
ఏదో ఓ సమయంలో రెండు అవతారాల్ని 
తొడుక్కుంటావ్

ఏదో ఒకరోజు 
నీ వాహనం మీద ప్రయాణించిన కొంతసేపటికి 
''ఇది ఇంతేగా''అని 
కునిర్దారణకు దిగి 
కరుకు నిగ నిగ వెకిలి నవ్వు 
భుజం మీద కప్పుకుంటావు 

వాహనం అదుపు తప్పిన వేగానికి 
నువ్వు పట్టుదప్పి 
రోడ్డు మీద రక్తపు కుప్పలో తేలతావ్ 
రెండు చేతులు మాత్రం 
చప్పట్లు కొడతాయి 
అవి నీవే 

ఏదేమైనా 
నువ్వు పూల భాషలో 
జీవించ నంతకాలం 
మనుషుల చావు తప్పదు .
      .....

Tuesday, August 21, 2012

తీరొక్క బాధలు


ఎన్ని చెరిపినా 
ఇంకొన్ని మిగిలే ఉంటాయి 

నిన్ను తెలుపని వాసనలు కొత్తవి 
నా మీదికి తెరుచుకున్నపుడు 
నాకు సందేహమే నువ్వు 

నువ్వెప్పుడూ ఇంతే 
మనసులో కలిసి వెల్లిపోతావ్
గావర పెడతావ్ 
గుండెను చేది పెడతావ్ 

ఎవరు ఎవరికీ అర్ధం కాని బజారిది 
అలుపెరుగని కాళ్ళ శ్వాస 

ఒకరు పూర్తిగా 
అర్ధం కావాలనుకోవటం భ్రమ 
తెగదు ముడిపడదు 
యాప్యము.
    .....