''డాడీ నాకొక మంచి షర్టు కుట్టియ్యొచ్చు గా...''అడిగిండు మా ఆనందుడు .
'''ఎందుకురా...!'' కొంచెం ఆలోచనలో బడ్డ నేను
''అందరు టీ షర్టులే ఏస్తున్నరు ...అన్నీ ఒక్క తీర్గనే ఉంటున్నయ్ డాడీ ...కొంచెం హీరో లా ఉంటది డాడీ షర్టేస్తే...''ఒక ఫోజు పెట్టిండు .
నీక్కొంచెం ఎక్కువైంది రా...పైకి అన్లే
కానీ టీ షర్టుల్లో బొమ్మలు డిజైన్లు వేరు వేరు తప్ప అన్ని ఒక్క తీర్గనే వుంటై.
మా చిన్నప్పుడైతే ...దర్జీ కాడనే షర్ట్లు లు కుట్టిస్తుంటిమి
మా నాయిన బట్ట కొనే టప్పుడే దర్జీ దగ్గర 'ఎంత పడ్తది మావోడికి బట్ట 'అని అడిగొచ్చి తీసుకునేటోడు .
కుట్టేటాయనకు ఎన్ని చెప్పేటోడు...''కాలర్ పెద్ద గుండాలని ,(చెవుల దాకా కాలర్ వచ్చేటట్టు కుట్టించుకోవటం ఆ కాలపు పాషనుంటు౦డె)జేబు పెద్దగుండాలని ,గుండీల పట్టీ సక్కగా రావాలని ,కింద చుట్టూతా పట్టీ మడిసి కుట్టాలని ,గుండీలు మంచివి పెట్టాలని...
ఎప్పుడు కుట్టిస్త డా ఈయన...దండె మీద బట్టలన్నీ కుట్టినంక మనది కుడితే ఎన్ని రోజులు పడ్తదో అని నేను ఆలోచిస్తుంటిని.
దర్జీ చెప్పిన టైంకంటే ఓ రోజు ముందే స్కూల్ నుండి వస్తో స్త వాళ్ళింటి కానుండివస్తుంటిని ...కుడ్తే గిన ఇస్తడేమోనని .
అది వచ్చిందాక ,ఏసుకున్నదాక మనసంత దాని చుట్టే తిర్గేదనుకో.
తెచ్చినంక ఎస్కోని,చూస్కోని ...కాలర్ చెంపకు తగుల్తుంటే కొత్త అంగి అందం అప్పుడు కనపడేది .
పాత అంగీల కాలర్లు ఉతికి ఉతికి మెత్తగయ్యేవి కద...
కాలర్ కరుకు కరుకుగుంటే కొత్త అంగి మజాగ ఉంటుండె.
గుండీల దిక్కు చూస్కోని ముర్సి పోఎటో న్ని.
ఇగ ఇప్పటి పిల్లలకి ఇన్ని అనుభవాలు లేవు
అసలు కాలర్ లేని అంగీలే తొడుగు తుండ్రి
ఆ బట్టల ఏముంటది ....,గుండ్రని గల్ల.....లేకుంటే పంగల గల్ల.....సాగుడు బట్ట ,
ఎవనికేసినా అతుక్కు పాయె ...మీదంగ పిచ్చి పిచ్చి రాతలు ,బొమ్మలూ...
కాలరుండదు...కాజాలుండవు ...గుండీలుండవు ...
కాలర్ నిక్కపోడుస్తే వచ్చే సొగసు అతుక్కపోయే టీ షర్టు తో అసలుండదు
ఇగ ఇప్పటి పిల్లలకి కుట్టిచ్చే పని కూడా లేదాయే
సైజు చూస్కోని ,కొనుక్కొని ...ఆ షాప్ లనే తొడుక్కొని వస్తే ఇగ ఎంత పని
తప్పిందనుకుంటు౦డ్రు గని ...బట్ట తీస్కపోయి కుట్టించుకుంటే వుండే వుశారే వేరు.
మా ఆనందుడికి అట్లాంటి కోరిక గల్గినందుకు నాకు ఆనందమాయే...నా చిన్నతనం లోకి కొంటపోయిండు వీడు.
''అసలెందుకు కుట్టించాలర ...షాపుల కొనిస్త గద షర్టు..''అడిగాను.ఏమంటడో అని...
'' నువ్వేమో మంచిగ బనీన్లు కూడ కుట్టించు కుంట వ్...నాకేమో గబ గబ ...టైం లేదంటు ఏదో వోటి కొనిస్తావ్....అయినా బోరోస్తుంది డాడీ....వాటి మీద బొమ్మలు నచ్చట్లేదు...ఏవేవో రాతలు...''ఆక్షన్ చేస్తూ అన్నడు వికారంగా...
అంతేనా.....అన్న.ఆశ్చర్యంగా
''ఇంకోటి కూడా వుంది డాడీ...నేను చెప్ప..''అంటూ వుర్క బోయిండు.
''హే...చెప్పురా ఎమనను...''అంటూ పట్టుకున్నా.
''షర్టు తొడిగే టపుడు ...గుండీలు పెట్టుకుంట అమ్మ ఒకసారి కళ్ళలోకి సూస్తది చూడూ ...సూపరుంటది డాడీ''
గభాల్న హత్తుకున్న వాణ్ని
చూస్తున్న మల్లక్క కండ్లు తడిసినై.
...