Friday, March 22, 2013

నాలుగు


           
ఎదురుచూస్తున్నాను 
ఈ రోజు ఎవరు పుచ్చిన గుండెల్ని 
మోసుకొస్తారో తెలీదు 


ఎవరు భారీ సుతి మెత్తని గునపాల్ని 
సిద్ధం చేసుకొస్తారో తెలీదు 


ఎవరు కణకణ మనే మెసేజీల్ని
ప్రశ్నలు ప్రశ్నలు గా అల్లిన 
చెయిసంచీ లోంచి విసురుతారో తెలీదు 


ఎన్నిసార్లు పక్కనుండి పలకరించకుండా పోయిన 
హితులు ,చూసీ చూడనట్టు 
నటిస్తూ జీవించి నట్టు 
కనబడగానే కమిలినట్టు...


తెలుసుకున్న నిజాయితీ మనసు 
ఎవరి గాయాల్నీ చిన్న బుచ్చక 
శుభ్ర మర్యాదల్నీ వడ్డిస్తూ 
నీతి నీతి రోజుల్ని వెంట తిప్పక తప్పేటట్టులేదు 


అంతా సిద్ధం 
పొద్దున్నే, రాత్రి దిగుళ్ళు 
నిన్నటి పగుళ్ళు పూడుకున్నాక 
కొంత కొంత మిగిలిన పచ్చిపుండును వూది వూది 
ఎండిన దాని మీద దుమ్ము చేరకుండా 
సామెత కప్పుకొని 
ముఖం మీద సుఖనవ్వును పులుముకొని 
రేడియో పాట సేద తీర్పుకు కుదుటపడి.


ఎలాగైనా బరువు లాగక తప్పదు 
దీవించే వారికోసమే బతుకని 
మన నొసటన రాసిలేదు కాబట్టి 
శపించే మిత్రులు ,
వ్యంగ్యంగా ఓ రాయి విసిరినంత మాత్రాన 
అజ్ఞానం బాధని మేల్కొల్పడమెందుకని 
నిమ్మళంగా కాలువ కడుక్కొని 
కాళ్ళు కడుక్కొని, కొత్త నడక 
సూర్యునితో పాటు మొదలు.

              .....

No comments:

Post a Comment