Sunday, March 31, 2013

పుట్టుక



కొన్ని ప్రశ్నలతో పుట్టినందుకు 
అవెప్పుడూ నాతో పాటే 
పెరిగి ,ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తాయి 


ఒక్కోసారి అవి నా ముందు 
పరుగెడతాయి 
నిద్రలో పక్కకు తిరిగితే 
ఒత్తుకుపోతాయి 


కళల మీద రాళ్ళు వేస్తాయి 
మెలకువకు రాగానే 
వ్యంగ్యంగా వెక్కిరిస్తాయి 


ఎప్పటికీ ఓ దుఃఖం 
ఈ ప్రశ్నలకు నాకు మధ్య 
సంధి చేస్తుంది 


ఈ శరీరం చుట్టూ అల్లుకున్న 
అనేక వలల్ని 
తెంపుకోవాలని చేసే ఏ ప్రయత్నము 
సఫలం కాకుండా ఈ ప్రశ్నలు 
అడ్డం తిరిగుతాయి 


నా నవ్వుల వెనక 
గుచ్చుకునే కొన్ని ప్రశ్నలు 
ఎప్పుడూ రగులుతూనే ఉంటాయి.

             .....

Saturday, March 30, 2013

ఇంకా



ఐనా 
"ప్రేమ రెప రెప లాడుతూనే ఉందా?" అడిగాను 

"దుఃఖం దూరం కాలేదుగా "అన్నది తను 

మళ్ళీ తనే 
"దుఃఖం తో పదిలమైన ప్రేమకు 
కాలంతో,అవయవాలతో పని లేదు"


మిగిలిన సంభాషణ సిగ్గుతో 
మౌనంలో లీనమైంది.

       .....

అయినా వెళ్లవు...



నువ్విలాగే వెంటాడతావ్
చెప్పిందే చెప్పి 
మొదటిది చివరికి వేసి 
చివరిది మధ్యకి చేర్చి 
తిరగేసి తిప్పేసి ...


ముఖం లోని ముడతల మధ్య 
కములుతున్న రక్తం చుక్కలు కనిపించవు 
చెమట చేతికి చిక్కిన క్షణాల్ని 
సేద తీర్చుకునే యోగ్యత వుండెందుకో ...


ప్రశ్నల్ని మోహించుకుంటూ 
ప్రశ్నల్ని ప్రోగు చేసుకుంటూ 
ప్రశ్నల మీద ప్రశ్నల్ని పేర్చుకుంటూ 
వాలిన వసంతాలు 
ఎండిన కాలువలు 
పండుబారిన ప్రయాణాలు 


నేనెక్కడికి పోతానో?
నువ్వెందుకు?


అద్దం గురించే అర్ధం కాక 
ఒంటరినై పోతున్న నన్ను 
అందులో కనిపించని దాని 
నాట్యాన్ని చూసి గర్వించమంటావ్


నువ్వెప్పుడూ ఇంతే 
నా వెంట పడితే పడ్డావ్ 
నా నిద్రని ,
కలల్ని 
వొదులొదులు జ్ఞానాన్ని 
పేరుకుపోతున్న దుఃఖాన్ని...

ప్లీజ్ 
వదిలివెళ్ళు 

ఎన్నో భరించలేని 
భస్మ క్షణాల్ని వదిలి వెళ్ళు .

      .....

Thursday, March 28, 2013

పునర్జన్మ ప్రయత్నం



మళ్ళీ పరిచయం చేసుకుందాం 
కొత్తగా నడక మొదలుపెడితే బాగుండునని...


ఇప్పటికే వచ్చిన దారి మనల 
ఆహ్లాదంగా ఆహ్వానించినా పట్టించుకోని 
నిర్దయులం.


అయినా సరే
ఏ సలహాలు సహాయపడకుండా 
ఎవరూ ఉపోద్ఘతాలతో 
ఉపమాన రసాలతో అలంకరించకుండా 


ఉన్నదున్నట్టుగా 


౩జి లో ,౩డి లో ప్రయాస పోకడల్ని 
పోగొట్టుకొని 


నిమ్మళంగా 


కళ్ళని మనసుని మాత్రమే కష్టపెట్టకుండా 
ప్రతిబింబాలకి పరవశించినట్టు 


పాలు చిట్లి పోకుండునట్లు 
ఏ పక్క చూసినా వెన్నెలే కలిసినట్టు 


సితాకోకల సందడిలా 
పుప్పొడి ఘుమ ఘుమ లకి 
సారధ్యం వహించుకుంటూ 


గడ్డి పరకల నిగ నిగలతో 


నిద్రలోని పసిపాప నవ్విన పరిమళపు నిశ్శబ్దం లా 


మనం మళ్ళీ 
దేహాత్మలను పిసికి 
ఒకే మొక్కలా ...
చిగుళ్ళని వెలిగిద్దాం 
వేళ్ళని బతికిద్దాం .


        .....



మనిషికాక



దేనికోసమో నాలుగు దిక్కుల్ని
నమ్మలేని దిగులు

పొర్లినంత మేరా ఒత్తిడికి
నలిగిన వెన్నెల గమనానికి రాదు

రసం రుచించని రక్తికి
రంగులపూత

అపోహ సొంతమే
దురూహా సొంతమే

అజ్ఞానపు బాధలో గుమికూడి
ఎగపడతాయి

మేధస్సు కున్న అన్ని లక్షణాలు
తెలుసుకునే వీలులేదు

చిలక ప్రాణం ఎక్కడో
దానికీ తెలియదు

ఒక లెఖ్ఖ కోసమే
కాలం అక్కరకొస్తుంది.


.....
28-3-2013.

Wednesday, March 27, 2013

ఎప్పుడో తెలియదు


ఎన్ననుకొని ఏం లాభం

కోమలమైన కాంతి
కోరికల్ని కోసుకుంటూ పోతుంది

పచ్చని చిలుకల పాటకి
గాలి కూడా తట్టుకోదు

ఎదురుచూసే ఆత్మలకి
వసంతం రాక మాననైతే మానదు

ముహూర్తం దాగివుండే
కలశం మూతతీయాలి

ఊరిచ్చి ఊరిచ్చి
సమయాన్ని కూడా ఆశ్చర్య పరచాలి

అప్పుడే కొత్తగా
ఊపిరితో స్నేహం చేయవచ్చు.

.....
27-3-2013.

Sunday, March 24, 2013

ఐదో బాధ


ఎందుకోగాని
 ...కోలుకోనివ్వవు 

కొన్ని కోసుల దూరాన 
వుండి కుడా కోసేస్తావు 
మర్మం చిక్కని మాయ 


పాటల కింద కళ్ళు మూసుకుంటాను 
ప్రత్యక్షమయ్యేది నువ్వే 
పరవశించడానికి ఏముంది?
ఫై ఫై కాగితాల రాతల మీది చెత్త 
చికెన్ తీసిన స్కిన్ కంపు ఈకల కలవరింపు 
నువ్వెక్కడో......
నిద్ర ముసురుకున్న వొడిలో 
చొంగల రాత్రి 
ఇక పోలేక పోలేక ఒలికిన చుక్కలు 
అదే మీ భాషలో నక్షత్రాలు 

ఛీ....థూ....
బతుకును తిట్టాలో 
మనసును తిట్టాలో 
తెలియని సందిగ్ధ లంపటం 
రెండు ఇంచుమించు ఒకటే అర్ధమా 
ఐతే కానీ 

బండ జారుతుంది 
అమ్మో పగిలిపోయే అద్దం 
పగలకోసే ప్రతిబింబం 
పెంట కుప్పలో కోళ్ళ గోళ్ల కెలగింత 
గిలిగింతల పులకింతల 
పెచ్చులూడిన ఫంగస్ జిల 


జీవితాలు కొన్ని 
వెన్నెల్లా మెరిసిపోతాయట 
ఏమో?

చీకటే ఎవడ్నీ ఏమీ అనదు 
ఏడ్చినా ఎవడికీ కనపడదు

        ..... 




Friday, March 22, 2013

నాలుగు


           
ఎదురుచూస్తున్నాను 
ఈ రోజు ఎవరు పుచ్చిన గుండెల్ని 
మోసుకొస్తారో తెలీదు 


ఎవరు భారీ సుతి మెత్తని గునపాల్ని 
సిద్ధం చేసుకొస్తారో తెలీదు 


ఎవరు కణకణ మనే మెసేజీల్ని
ప్రశ్నలు ప్రశ్నలు గా అల్లిన 
చెయిసంచీ లోంచి విసురుతారో తెలీదు 


ఎన్నిసార్లు పక్కనుండి పలకరించకుండా పోయిన 
హితులు ,చూసీ చూడనట్టు 
నటిస్తూ జీవించి నట్టు 
కనబడగానే కమిలినట్టు...


తెలుసుకున్న నిజాయితీ మనసు 
ఎవరి గాయాల్నీ చిన్న బుచ్చక 
శుభ్ర మర్యాదల్నీ వడ్డిస్తూ 
నీతి నీతి రోజుల్ని వెంట తిప్పక తప్పేటట్టులేదు 


అంతా సిద్ధం 
పొద్దున్నే, రాత్రి దిగుళ్ళు 
నిన్నటి పగుళ్ళు పూడుకున్నాక 
కొంత కొంత మిగిలిన పచ్చిపుండును వూది వూది 
ఎండిన దాని మీద దుమ్ము చేరకుండా 
సామెత కప్పుకొని 
ముఖం మీద సుఖనవ్వును పులుముకొని 
రేడియో పాట సేద తీర్పుకు కుదుటపడి.


ఎలాగైనా బరువు లాగక తప్పదు 
దీవించే వారికోసమే బతుకని 
మన నొసటన రాసిలేదు కాబట్టి 
శపించే మిత్రులు ,
వ్యంగ్యంగా ఓ రాయి విసిరినంత మాత్రాన 
అజ్ఞానం బాధని మేల్కొల్పడమెందుకని 
నిమ్మళంగా కాలువ కడుక్కొని 
కాళ్ళు కడుక్కొని, కొత్త నడక 
సూర్యునితో పాటు మొదలు.

              .....

మూడు




లేత పసుపు ఎండ
పొద్దు పొద్దున్నేపలకరిస్తున్నప్పుడు
పిచ్చుకలు,మైనాలు,గువ్వలు
బావి తొర్రల్లో బుర్రున ఎగురుతూ
టపటప రెక్కల్ని గాలికి తాడిస్తూ
వాయిద్య కారులంతా వాకిట్లోకోచ్చినట్టు...

కచేరీ వింటున్న వెడురుకొమ్మల నుండి
కిందికి పాకిన లతలు,గూడూచి తీగలు
పసి మెత్తని చేతులూపి
ప్రతి రోజును ఒకేలా స్వాగతించే నేర్పును
ఏరోజుకారోజు జీవించే సొగసు ను పరిచయం చేస్తున్నట్టు.

ఎవరి స్వభావాన్నో చర్చకు ముందుకు లాక్కొని
తినే తిండిని,తాగే ద్రవాన్ని కలుషితం చేసుకుంటూ
నీవి నావి
నిజాలో అబద్దాలో
విన్నవో ,వినలేనివో
కలగాపులగంగా కుప్పపోసుకున్న అనుమానాల్ని
కెలికి కెలికి
కుల్లుకుంటున్న ,వాసన ముసురుకుంటున్న
పదార్ధ జ్ఞానాన్ని
పదేపదే నవ్వుల్లోకి ,నరాలలోకి వొంపుకొని.....

ఏ రోజూ పక్షిలానో
జంతువు లానో
పచ్చనాకు లానో
జీవించలేని భాగ్యానికి
తలదించుకుంటూ.

.....
22-3-2013.

Thursday, March 21, 2013

రెండు



ఎక్కడో పోగొట్టుకుంటాం .వెతుకుతూ ఉంటాం.పాత పాత పుస్తకాల
వెలిసిన కాగితాల కువకువల్లో
రాలిన ముత్యాల వాసన వసంతాలలో
గజ్జెల ఘల్లు ఘల్లు కాలువనీటి హోరు కాంతిలో.

ఎక్కడో దారి తప్పుతాం.పురాతన రహస్య రాతి చెక్కడాల మీద
దుమ్ముగా రాలిపోతాం.
గట్టిగా ఊపిన గాలి కోసల వేలాడిన
పూల సువాసనలా తెగిపోతాం.

ఏదో కల లేపిన నిద్రని వేడుకుంటాం.ఎప్పటికీ వేడుక చేయని
ఉదార భారాన్ని ప్రయత్నించి ప్రయత్నించి,
మనసుమీది దూది కలతను
విసుగ్గా వదిలి తలుపేసుకుంటాం.

ఎప్పుడూ దేని కోసమో ఎదురు చూస్తుంటాం .పచ్చని వాగు నీటి
పరకల గెంతులా ఊరేగుతూ ,
ఆశ్చర్యం అణువణువునీ ప్రియంగా తడుముకుంటూ
పసి లేత చూపులా కాలాన్ని కౌగిలించుకుంటూ .

.....
20-3-2013.

పద్యం ౧



అనంతంగా ప్రవహిస్తున్న మనుషుల గురించి కొత్త ఏమీ లేదు.
అన్ని మూలలూ తడిమిన పెద్దలు కావ్య చరిత్రలై ....నిక్షిప్తమై.

బతకడం గురించిన బాధ లేదు.బతుకే బతికిస్తుంది.

నడుస్తున్నపుడు ఏదో ఓ మూల పచ్చని చెట్టు పుష్పించిన వాసన
పసిగడుతుంది.పట్టించుకోకుండా పరుగు తీస్తావు.
అదే కోల్పోయేది.

నీడగా వెంట పడుతున్న సూక్ష్మ నిశ్శబ్దాన్ని పట్టించు కోవు.
అదే జారిపోయేది.

పరుగెడు తున్నపుడు మీదుగా ఆకాలం తీపి గాలుల కాంతి
ప్రవహిస్తుంది.గమనించకుండా పరుగు తీస్తావు.
అదే సంపాదించలేనిది.

.....
20.3.2013.

Tuesday, March 19, 2013

అజ్ఞానం 5



ఏదీ నిన్ను కోరి వెంటపడదు 

సంపదల కొలమానం 
ఆనందపు కోలాహలం
అదృష్టపు పాచికలు 
దురదృష్టపు గ్రహపాటు 
మెచ్చుకోలు నటన 
ఏవీ నిన్ను కోరి అనుసరించవు


నీ భాషకి నువ్వు  సలహాదారువి 
నీ మనసుకు నువ్వు ప్రత్యక్ష సాక్షి 


సందు తిరిగింతర్వాత 
నువ్వు నవ్వుకుంటూ పోతావు 
ఇక్కడ వదిలిన విషయాలు కూడా 
అలాగే నవ్విస్తాయి 

ఏవీ నిన్నే కోరి వ్యతిరేకించవు 
ప్రియమైన ప్రేమ 
ఆత్మీయ స్పర్శ 
నిష్కల్మష భవిష్యత్తు 
చింతపండు లా బంగారం 
పట్టుబట్టు పట్టుబట్టలు 


నీ కోపం తయారీదారువు నువ్వే 
నీ భావాల మూల భూమి నువ్వే 


నా వెంట రమ్మనే వాళ్ళెవరూ వుండరు 
నీకు దిశానిర్దేశం కోరుకోవటమే భ్రమ 
నిన్ను అనుసరించే వాల్లుండాలనుకోవటం 
పెచ్చు భ్రమ 


కుండలో కలిగింది తింటే 
ఆకలికి కూడా మర్యాద 
లేనిది లేదని కుండని నిందిస్తే 
జీవితానికి అమర్యాద .

         .....
19-3-2013