Thursday, January 24, 2013

నీడల ముఖం


పూరి గుడిసెలో వున్నా 
నగరాల గోడల్లో వున్నా 
నువ్వు నువ్వే 


ఆకాశం అందదు  
భూమి వదలదు 
మసిపూసిన దుప్పటి 
కాలం తగిలి 
మాసిపోక మానదు 


చాతీ మీది 
గర్వం కనిపించక పోయినా 
మనసు లోని బిలాలు 
కప్పబడి కనిపించినా 
నువ్వు నువ్వే 


అగ్గిని పట్టుకోవాలంటే 
చేతులు వదులుకోక తప్పదు 
దిశలు తిరిగిన కాళ్ళు 
దిగుల్లో దిగబడక తప్పదు 


నగిషీలు చెక్కిన 
నటనలు కప్పుకున్నా 
నమ్మలేని నవ్వుల్నీ 
పూతగా అంటించు కున్నా 
నువ్వు నువ్వే 


తూరుపును పిడికిలిలో 
మూయలేవు 
వెన్నెల మీద 
చీకటి విసరలేవు 


తరాల చరిత్రని 
మాసికలు చేసి అలంకరించినా 
ఆ నాటి నేతి వాసన తెచ్చిన 
మాంత్రికుడిగా అవతరించినా 
నువ్వు నువ్వే 


జ్ఞాన రంద్రానివి 
అమావాస్య శిఖవి 


     .....     
24.1.2013.

No comments:

Post a Comment