Thursday, January 24, 2013

నీడల ముఖం


పూరి గుడిసెలో వున్నా 
నగరాల గోడల్లో వున్నా 
నువ్వు నువ్వే 


ఆకాశం అందదు  
భూమి వదలదు 
మసిపూసిన దుప్పటి 
కాలం తగిలి 
మాసిపోక మానదు 


చాతీ మీది 
గర్వం కనిపించక పోయినా 
మనసు లోని బిలాలు 
కప్పబడి కనిపించినా 
నువ్వు నువ్వే 


అగ్గిని పట్టుకోవాలంటే 
చేతులు వదులుకోక తప్పదు 
దిశలు తిరిగిన కాళ్ళు 
దిగుల్లో దిగబడక తప్పదు 


నగిషీలు చెక్కిన 
నటనలు కప్పుకున్నా 
నమ్మలేని నవ్వుల్నీ 
పూతగా అంటించు కున్నా 
నువ్వు నువ్వే 


తూరుపును పిడికిలిలో 
మూయలేవు 
వెన్నెల మీద 
చీకటి విసరలేవు 


తరాల చరిత్రని 
మాసికలు చేసి అలంకరించినా 
ఆ నాటి నేతి వాసన తెచ్చిన 
మాంత్రికుడిగా అవతరించినా 
నువ్వు నువ్వే 


జ్ఞాన రంద్రానివి 
అమావాస్య శిఖవి 


     .....     
24.1.2013.

Tuesday, January 22, 2013

కాలం వెంట ...


ఎవరూ కాజేయని
విలువలకి సెలవుండదు

ఎటో వెళ్ళిపోతూ
కొన్ని కుంగి పోయే సమయాల్ని
నిమురుకుంటూ
పరువపు వాక్యాల తోడుగా
నీక్కావాల్సిన పూలని
కంటి మైదానం లో పూయించు కుంటావు

ఎడారులను నిమురుకుంటూ
ఎవరూ కొలువని
భూదేవత కట్టమీది ఉగ్ర రూపాన్ని
నీ తడి నెత్తురుతో
ఆరబోసుకుంటావు

నీ లోపల ప్రవహించే
గాలి దుమారాన్ని
వృధాగా ఎగిరిపోకుండా
కాసేపు నీ తల రంధ్రాలను మూసిపెట్టు

గాలి పటం ఆనందమై
విహరిస్తున్నది
ముళ్ళ కనుమలు కొలువు దీరాయి గురువా!
పైలం.

.....
15.1.2013

DR GURUSWAMY PULIPATI

గింగారం



నువ్వు
నేను
ఆకాశాన పూసిన పువ్వు
ఒకేలా ఉంటాం
ఉన్నదున్నట్టుగా ఉంటాం

ఏమనుకుంటారోనని
రాత్రికి రాత్రి లేచి
మెరిసి పోలేం
నిద్ర పోయినా నిగనిగలాడటమే
మన బలం

ఆశలకి ఊత కర్రనిచ్చి
నడిపిస్తాం ---
అందాలు విరిగి పోకుండా
అద్దాల్ని ముద్దాడతాం

కలలకి కోరికలై
యవ్వనాన్ని మోసుకొస్తాం
తృప్తిని దాపుగా వుంచి
ఈ రోజుని వెలిగిస్తాం

పాటలు పాడతాం
ఉన్నంతసేపు
మెరుపుల్ని కురుస్తాం
బతికున్నంత సేపు.

.....

గింగారం ..బంగారం కి సమానంగా ఉపయోగించే రోల్డ్ గోల్డ్ కి సమానార్ధకంగా వాడాను.

DR GURUSWAMY PULIPATI

13.1.2013.

Thursday, January 10, 2013

స్మైల్ ప్లీజ్


దేన్నీ జయించలే౦ హృద్యంగా ,లాలిమగా ....
అనుకుంటాం గాని 
అన్నీ ఉన్నంత వరకు 
చమక్కున మెరిసి పోయేవే...నక్షత్రా లొక్కటేనా...
రాత్రి పగలు కూడా 
నీ సంచీ లోంచి జారి పడ్డ వస్తువులా ...
పోతున్నా గమనించే సిద్ధత్వం 
ఇంకా నరాల్లో ఇమడక 
పసితనపు పోర్లాటగా 
లోపలికి బయటకి విరుచుకు పడుతున్న 
ఆవేశాల మధ్య 
నీ వైపుకి నావైపుకి 
తిరిగి తిరిగి కూలుతున్న 
ఆక్రోశాల చీదరింపుల నిగారింపు ల 
పురాతన ఖాళీ పగిలిన తవ్వకాల జ్ఞాపకాల చిరుగుల మధ్య 
రవ్వంత హత్తుకోలేని  కారుణ్యానికి
మసి పూసి మూతి మూసి శ్వాస మూసి 
గల గల నవ్వుల్నీ మీసం కింది మూతిలో ముంచేసి 
తే న్చి
పొట్ట నిమురుకొని 
ఇన్ని కాలాలు బతికామని 
కొవ్వొత్తులు బలి చేసి 
మెత్తటి మాధుర్యాల భ్రమరాలు కోసి 
పంచుకుంటూ గింజుకుంటూ నటించుకుంటూ
పెరిగామో తరిగామో లెక్కతేలని మత్తులో 
కాలాన్ని కరిచి కక్కి 
విశ్వాసాల్ని కామసాక్షిగా నిందించి 
బర బారా లాక్కెళ్ళి 
గొంతులో కుక్కి తాళం  వెయ్ ....


నవ్వొచ్చుగా ...ఫోటో కోసం 


జీవితం ఎప్పుడూ నిలుపుకోదనే 
నిలుపుకోలేవనే.

     .....

దేవి స్తోత్రం



నా బంగారు కాంతి పుంజమా 
నా హృదయావరణానివి 


నా లో గొంతుక 
నా పుప్పొడి తపనవి 


నా హోయల కుంచె 
నా ఒకే ఒక రసానివి 


నా చిగురాకు గానమా 
నా తడిసిన కలవి 


నా వీణా దేహమా 
నా పెదాల నగ్నానివి 


నా అజ్ఞాత కేంద్రకమా 
నా నమ్మలేని కలవి 


నా దుఃఖపు కవచమా 
నా నరాలలోని చందమామవి 


నా నవ్వుల విష్ణు కాంతమా 
నా అందపు వెలుతురివి 


నా సొగసుల కిరీటమా 
నా సెలయేటి పరువానివి 


నా చెమ్మగిల్లిన నయనమా 
నా పగటి కాంతి పుడకవి 


నా ఉద్రేక ప్రదాతా 
నా ఆవేశ నాశనివి 


నా గుభాలించిన వెన్నెలా 
నా మట్టి సంతకానివి 


ప్రకృతి కాంతా !
జయము !జయము!!


     .....

Tuesday, January 1, 2013

పొరల కింద...



ఇదీ మామూలుగానే 
తెల్లారింది 
నీ మనసులోనే ఏదో ఉంది 
కొత్తనీ 
పాతనీ 


అదీ మామూలుగానే 
పరుచుకుంటుంది 
నీ మనసులోనే ఏదో ఉంది 
దగ్గరనీ 
దూరమనీ 


ఏ క్షణమైనా ఒకేలా ఉంటుంది 
ప్రేమగా 
నీ మనసులోనే ఏదో ఉంది 
ఎక్కువనీ 
తక్కువనీ 

    .....