Wednesday, November 28, 2012

నా సెలయేరు హృదయం .....32



మా వేప చెట్టు కూడా 
వెన్నెల్ని పూసిందీవేళ 


నువ్వొస్తే ,తొంగిచూస్తే 
తులసి పరిమళానికీ పండగే 


ఎన్ని సార్లు వచ్చినా  నీ లెక్కనే  
కార్తీకం రాత్రి 


ఈ మసక లోకానికి 
రోజూ నిద్రే ,మనకెందుకు 
ప్రియురాలా ...!
నీకు వెన్నెలకి అభేద మెలా చెప్పను.



నా సెలయేరు హృదయం .....31




నిన్ను తులా భారం వేస్తా 
నీ చెవుల చెక్కిళ్ళు మారుస్తా ఈ రోజు 


కళ్ళు దోసిళ్ళు చేసుకో 
మనసు గోడల్ని తుడుచుకో 


సమయాన్ని జారనివ్వకు 
మాటలు మూసెయ్యి నిశ్శబ్దంగా 


ఈ మసకలోకానికి 
వెండి వెన్నెల్లో తడవటం తెలియదు 
ప్రియురాలా ...!
కార్తీకపు వెన్నెల్లో తెలికౌదాం రా...

     .....

Tuesday, November 27, 2012

నా సెలయేరు హృదయం .....30



కథలు కథలు గా మనుషులు 
కలిసి పోతారు 


నమ్మకాలను చెక్కుకుంటూ 
కాలం దోర్లిస్తారు 


గుట్టును మింగుకుంటూ 
గుడ్లు తేలేస్తారు 


ఈ మసక లోకానికి 
వచ్చిన పని తెలియదు 
ప్రియురాలా ...!
ఈ రాత్రిని అలంకరించు ప్రేమతో.

    .....

నా సెలయేరు హృదయం .....29



భయం నిండా కొమ్ములు 
ఐనా హత్తుకుంటావు 


పిరికితనానికి పీలికల రంగులు 
ఐనా మురిపిస్తావు 


ఆశకు ఒళ్ళంతా తూట్లు 
ఐనా ప్రయత్నిస్తూనే ఉంటావు 


ఈ మసక లోకానికి 
ఏది ఎంత అవసరమో తెలియదు 
ప్రియురాలా ...!
ఈ రాత్రి వెన్నెల వెలిగించు .

        .....


నా సెలయేరు హృదయం .....28




తేదీలు వెంటపడవు 
గడియారం శరీరం మీద తేలదు 


కిటికీ లోంచి జ్ఞానం తీసుకోవు 
దండెం మీద ఆరవు 


కడుపుకు అర్ధం కావు 
కన్నీళ్ళకు జోల పాడవు 



ఈ మసక లోకానికి 
కాసుల గోలే సుప్రభాతం 
ప్రియురాలా ...!
ఎంకన్న కు గుండుగీయటం ఎంత తేలికో...!

       .....

నా సెలయేరు హృదయం .....27



మౌనం ముచ్చటగా 
నీ వెంట పడుతుంది 


ధ్వనిలో నీవు 
కాలుష్యానికి హత్తుకుంటావు 


సాలె గూడులో నువ్వున్నావా?
నీలో అది ఉందా!...


ఈ మసక లోకానికి 
ఏది ఎక్కడ ఉండాలో తెలియదు 
ప్రియురాలా...!
ఈ రాత్రికి ఆనందం తినిపించు.

      .....

సైటోప్లాసం లో ఈత



రహస్యపు మొలకలు 
కాంతి వత్సరాల దూరపు ప్రేమ 
ఇప్పటిది మిథ్యే అయితే 
రాగల జన్మల స్థానం సర్దుబాటు ఎటు?


నరలోకమే అన్నిలోకాలకు ఉనికి 
ఆకలిని జయించట మే 
ప్రపంచ యుద్ధ ఫలితం 
రెండింటి మధ్య నలిగి పోయే దివ్యత్వం 


ఏమ్ ముఖం పెట్టుకొని బతకాలి 
మనదేమీ లేనప్పుడు...
పశువులు పొర్లాడినట్టే  
జీవితమంతా మురికి .

       .....

క(కా)వికలం



అగరొత్తుల పొగ పెట్టాలి 
ధూపం ,దీపం నైవేద్యం 
మంచి నెయ్యి సమర్పించాలి 
హాహాకారాలతో అభిమానంతో 
స్తోత్రాలు జై కొట్టాలి 
లేదంటే కనికరింపుకు 
కంటి చూపు తక్కువ.


పంచ రసాలు లేకుండా 
పకడ్బందీ పాయసం 
ఉడికీ ఉడకని రుచితో 
ఆకాశం తో సహా అన్ని దిక్కులకీ 
పంచగల సమర్ధత తో 
నీటి పుణ్య గతులకు 
లాగే శక్తికేం తక్కువ ?


శతాంశాల,సహస్రాంశాల పొగరు కూడా 
ఒక్కోసారి పొలికేకలు పెట్టి 
కీర్తి మీద రంకె ముద్రలు అద్దుకుంటూ 
కొత్త ముఖ చిత్రాన్ని 
త్రీడీ టెక్నాలజీ తో 
ఖండానికో తెలివిని 
ఆశ్చర్యం లో ఓలలాడిస్తూనే ఉంటది .


ఎటొచ్చీ జ్ఞానమో,మేధావితనమో  
ఒంటి రెక్క పూవులా వెలవెల పోకుండా 
రంగు రంగుల దేశ దేశాల దుస్తులతో 
ఆహార్యంతో ,ద్రువాల చలి గడ్డల్ని 
విసర్జించక పొతే 
కాన్వాస్ మీద వెలవెల పోక తప్పదని 
లోలోపల కుత కుతకి 
ఎవడ్నో ఒకడ్ని 
మంటల్లో వేయించక తప్పదు.


శుభం తధాస్తు .


తలలు శుభ్రం చేసుకోక  తప్పదు  
అక్షింతలు పట్టుకొని 
సిద్ధమైన లోపలి మేధావుల కోసం.

      .....

నా సెలయేరు హృదయం .....26


వెన్నెల గుణం
తెలుపొకటే అనుకున్నావా?

కటువైన మధువుకు
మత్తు మాత్రమే గుణమనుకున్నావా?

నిన్ను చేరవేయడానికి
నిచ్చెనగా నిలబడతాయవినాకు


ఈ మసక లోకానికి
ప్రియ గుణాలు వృధా...వృధా...
ప్రియురాలా...!
ఈ రాత్రిని అలంకరించు.

.....

Monday, November 12, 2012

కలవరం



ఏవి ఎక్కడుంటాయో 
ఎవరికీ తెలియదు 


పుచ్చు అవయవాలు కూడా 
ఒక్కోసారి ఎదురొస్తాయి 


అంతమేరకే అంగం తొలగించి 
హత్తుకొని దాచుకోవాల్సిందే 


మనుషుల గురించి 
అవయవాలక్కూడా ఏమీ తెలియదు 


దుఃఖాన్ని తొడుక్కున్న మనసు 
కన్నీటితో చల్లబడక ముందు 
అగ్నిపర్వత గర్భం తలనిమురుతుంది 


నీటికి వాసన లేదంటాం కానీ 
మలినాలు మోసుకున్నాక 
ఎదో ఒకటి కప్పుకోవాల్సిందే 


తెరలు తెరలుగా 
ఆనందాల మధ్య మెలికలతో దుఃఖం 
కుట్టుకుంటూ పోతూనే ఉంటుంది 


జీవితం ఎవరికీ పరిచయం కాదు 
దాని దారి దానిదే .

      .....

Friday, November 9, 2012

పుష్పించే కాలం



ఒక నాటి రాతిరి 
ఆమె కలలో కొచ్చింది 
కౌగిలించు కోకుండానే 
మాయమయ్యింది 


ఒక నాటి జీవితం లో 
ఆమె ఎదురొచ్చింది 
కౌగిలింత సిగ్గుపడి 
మాయమయ్యింది 


ఆమె నేను 
ఎప్పుడూ దూరంగానే ఉంటూ ...
ప్రేమే అటూ ఇటూ 
తిరిగి తిరిగి 
అలిసిపోతుంది 


రెండు జీవిత కాలాలు 
కలిసి ప్రయాణిస్తాయి .

      .....