నువ్విలాగే వెంటాడతావ్
చెప్పిందే చెప్పి
మొదటిది చివరికి వేసి
చివరిది మధ్యకి చేర్చి
తిరగేసి తిప్పేసి ...
ముఖం లోని ముడతల మధ్య
కములుతున్న రక్తం చుక్కలు కనిపించవు
చెమట చేతికి చిక్కిన క్షణాల్ని
సేద తీర్చుకునే యోగ్యత వుండెందుకో ...
ప్రశ్నల్ని మోహించుకుంటూ
ప్రశ్నల్ని ప్రోగు చేసుకుంటూ
ప్రశ్నల మీద ప్రశ్నల్ని పేర్చుకుంటూ
వాలిన వసంతాలు
ఎండిన కాలువలు
పండుబారిన ప్రయాణాలు
నేనెక్కడికి పోతానో?
నువ్వెందుకు?
అద్దం గురించే అర్ధం కాక
ఒంటరినై పోతున్న నన్ను
అందులో కనిపించని దాని
నాట్యాన్ని చూసి గర్వించమంటావ్
నువ్వెప్పుడూ ఇంతే
నా వెంట పడితే పడ్డావ్
నా నిద్రని ,
కలల్ని
వొదులొదులు జ్ఞానాన్ని
పేరుకుపోతున్న దుఃఖాన్ని...
ప్లీజ్
వదిలివెళ్ళు
ఎన్నో భరించలేని
భస్మ క్షణాల్ని వదిలి వెళ్ళు .
.....
No comments:
Post a Comment