Friday, March 22, 2013

మూడు




లేత పసుపు ఎండ
పొద్దు పొద్దున్నేపలకరిస్తున్నప్పుడు
పిచ్చుకలు,మైనాలు,గువ్వలు
బావి తొర్రల్లో బుర్రున ఎగురుతూ
టపటప రెక్కల్ని గాలికి తాడిస్తూ
వాయిద్య కారులంతా వాకిట్లోకోచ్చినట్టు...

కచేరీ వింటున్న వెడురుకొమ్మల నుండి
కిందికి పాకిన లతలు,గూడూచి తీగలు
పసి మెత్తని చేతులూపి
ప్రతి రోజును ఒకేలా స్వాగతించే నేర్పును
ఏరోజుకారోజు జీవించే సొగసు ను పరిచయం చేస్తున్నట్టు.

ఎవరి స్వభావాన్నో చర్చకు ముందుకు లాక్కొని
తినే తిండిని,తాగే ద్రవాన్ని కలుషితం చేసుకుంటూ
నీవి నావి
నిజాలో అబద్దాలో
విన్నవో ,వినలేనివో
కలగాపులగంగా కుప్పపోసుకున్న అనుమానాల్ని
కెలికి కెలికి
కుల్లుకుంటున్న ,వాసన ముసురుకుంటున్న
పదార్ధ జ్ఞానాన్ని
పదేపదే నవ్వుల్లోకి ,నరాలలోకి వొంపుకొని.....

ఏ రోజూ పక్షిలానో
జంతువు లానో
పచ్చనాకు లానో
జీవించలేని భాగ్యానికి
తలదించుకుంటూ.

.....
22-3-2013.

No comments:

Post a Comment