Monday, December 2, 2013

సం ''దేహం''


ఊరికే ఉదయించడమొక్క 
సూర్యుడికే చేతనౌను 

పది నిమిషాలు మనసు నిలుపుకోలేక 
కలగాపులగపు అభిప్రాయాల మధ్య 
ఈ ప్రపంచాన్నే ఇరుకున పెట్టేస్తాం 

పారిపోవడం తెలుసు 
ఉన్న భావాల్లోంచి 
ఉన్న మూలల్లోంచి 
దగ్గరి మనుషుల్లోంచి 
కూలిపోతున్న ఊరినుంచి 

కొత్త లోకమొకటి 
తయారుగా కొన్నాళ్ళు నచ్చుతుంది 
తర్వాత, పిడికిలి లోకి 
లోకాన్ని కూర్చడం కోసం తంటాలు 

సౌందర్యాన్ని స్వీకరించడం వదిలేసి 
మెరుగులు దిద్దడం మొదలెడతాం 
అనాకారులం 

ఊరికే గమనించడమొక 
కాంతికి తెలుసు 

పోలికల కింద 
పీలికలు పీలికలై పోతం 
కనిపించి నంత వరకు 
కాలం కలిసొస్తే కబలింప సాహసిస్తాం 

జీవించినంత మేర 
బతకడానికొక గొప్ప సూత్రం కోసం 
వెతుకుతుంటాం 

.....
2-12-2013.

No comments:

Post a Comment