ఒక్కోసారి
ఒంటరి నిశ్శబ్దం కదులుకుంటూ
నిన్ను నాలోకి తోసి పోతుంది
ఆత్మలా హత్తుకున్నపుడు
తడిసి తడిసి వెన్నెల కురిసి
కాగితం పూల కొమ్మ కళ్ళు నింపుకుంది
నీ కోసమే ఇక్కడ
ఒక ప్రత్యేక మందిరం లాంటి పవిత్రాశయం
ఎదురు చూస్తున్నట్టుంది ...వెన్వెంటనే
నాడుల మీదుగా ,నాదంగా
ఎర్రెర్రని సూర్య కాంతిలో తేలుతున్న
హృదయం కనులలోకి తొంగి చూస్తుంది
ఏమో!
అభయమో! భయమో!
లేక రెండూ కలిసిన కౌగిలింతో ...
ఎవ్వరికీ తెలియనివ్వని
ఆ సమయాన్ని సేద తీర్చుకుంటున్న
జీవ ద్రవ్యపు అంతరకాంతి
పడవపిల్లలా అటూ ఇటూ
కొన్ని నీళ్ళు తాపి
గోడమీది పటం లో బిగిసిన దేవుడి మీద
నిలిచిన చూపును తట్టి
ఎవరొస్తారోనని తలుపుకు తగిలి ...
ఇంకాసేపు
నిన్నట్లాగే కణజాలం నిండా
పొదివి పట్టుకోలేని చేతకాని తనానికి
తలొగ్గి ,
నిను ఊపిరి తీయకుండా రెప్పల మధ్య అదిమి
కంఠం లో బిరడా బిగించి
మరో సారికి రప్పించుకునే మర్యాదకి
నమస్కరించి
అప్పుడప్పుడిలా వచ్చిపొమ్మని మాత్రమే...
వేడుకోగలిగి.
.....
No comments:
Post a Comment