అడుక్కుంటూ అడుక్కుంటూ
వెళ్ళిపోతుంటాం
మనకొక రహస్యం దాపు కావాలి
చమ్కీల ఆశ్చర్యం కావాలి
బారులు తీరిన
కోరికల కాగడాల వెలుతురులో
రెక్కల్ని పురివిప్పుకొని
ఆకలి గొన్న పురుగులా
వెతుక్కుంటూ ...
మెడమీద
తుపాకీ గురికి పొద్దు పోదు
కనిపించిన పుర్రెనల్లా
బూజు దులుపుకోమని
వేడుకుంటూ ...
శుభ్రమైన ఓ ఆలోచన కోసం
కంటి నుండి రాలుతున్న
అగ్ని ధారల్ని నలిపి నుసి చేస్తూ
భూమండలాన్నంతా
చెక్కిలిగిలి పెట్టుకుంటూ
తోసుకుంటూ...
అక్షరాలని పూజిస్తూ
అనంతమైన ప్రేమను
వాటికి నూరి పోస్తూ ...
దిక్కులు తెలియని వేదనల
శ్వాసిస్తూ
పురాతన జ్ఞాన శకలాల్ని
విత్తుకుంటూ ...
మల్లెల పరిమళపు బీజాల్ని
మట్టిలో నాన్చుకుంటూ
రేపటి పసికూనల ఆకాశానికి
చేతుల్ని నాటుకుంటూ
కమ్మని వాసనల కల
పాడుకుంటూ ...
.....
No comments:
Post a Comment