నిజమే కదా?
మనుషుల కంటే మనం
ఇంక దేన్నో ప్రేమిస్తున్నాం
మొత్తం నాటకమంతా గ''మ్మత్తు''గా నడవటానికి
అసూయ నింపిన పాత్ర ఒక్కటి చాలు
చిందర వందర వ్యక్తిత్వం పరుచుకోవటానికి
పిసరంత ద్వేషం అంటుకుంటే మహా
వలలు చాలా పరుచుకున్నాక
హృదయానికి శ్వాస దొరకదు
ఏ జీవీ భూమ్మీద
ఇట్లాంటిది పోల్చుకోవటానికి నిలవదు
అన్నీ ఎరికే
ప్రకృతి మీదనో
పచ్చనాకు మీదనో
పూల గుత్తి మీదనో
పాల మీగడ మీదనో
పోటీకి దిగలేం
పక్కనుండి చెయ్యందిచ్చిన వాన్నే
వీపు వెనక నుండి విరిచేస్తాం
ఎన్ని యుగాలు మారితేనేం ?
సౌలభ్యం కోసమే పెనుగులాట
ఎన్ని చదువులు పారితేనేం?
స్వభావం విడువని ముసుగుబాట
కేవలం జీవించటం లో
దాగిన ఆనందాన్ని అవతలికి తిప్పి
నటిస్తూ జీవిత కథను
రక్తి కట్టిస్తున్నాం
విషాదమైన విషాదం
ఇంతకు మించి లేదేమో!
.....
4-5-2014
No comments:
Post a Comment