Monday, May 5, 2014

అన్న ప్రహసనం



చిన్నప్పుడు అన్నం తింటుంటే
కిందబడ్డ మెతుకును కండ్లకద్దుకొని
తలెల వేసుకోవడం నేర్పిండు మా నాయిన

ఎందుకు నాయినా అంటే
''అన్నం దేవుడు బిడ్డా''
అన్నప్పుడు అర్ధం కాకపోయింది

అదెట్లనో ఇన్నెండ్లకు
తేలిపోయింది

అందుకే కూటి కోసం కోటి విద్యలని...
అందరి పని వెనకాల అన్నమే ఉన్నదన్నది
నిజమేనని తెలిసి పోయింది

అంత ముఖ్యం కనుకనే
ఒకని కడుపు కొట్టొద్దని
నోటికాడ బుక్క గుంజొద్దని
పెద్దలు సద్ది మూట గట్టిండ్రు

* * *

ఎందుకో పొద్దట్నుండి తినడానికి కుదర్లే
ఒకరిద్దరి జీవితపు దారుల్లో
ఏం జరుగుతుందీ కలబోసుకున్నాక
సాయంత్రం వచ్చి చేరింది
కానీ ఆకలి నన్ను మర్సిపోలే

అప్పటికి ఎటూకాని టైం
రోగాల రాగాల మధ్య
ఆకలి ఘీంకారం ఆగలేదు

ఇంకొంత సేపటికి
ఏదీ వినబుద్ధి కాని స్థితి
ఎవరితో మాట్లాడలేని అశక్తత
''ఫేస్ బుక్'' ఓపెన్ చేద్దామా?
ఛి ఛీ ...వద్దు వద్దు'' ఫేక్ బుక్ ''

కణజాలం లో అలజడి
లోపలంతా భూమండలం ఖాళీ
ఎడారి ఎరుపు
కళ్ళల్లోకి చేరిన చీకటి జ్వాల

మాట్లాడే మనుషులు
కనిపించే మనుషులు
మనసులో మనుషులు
ఒకేసారి గుమికూడిన చర్చ

ఎక్కడెక్కడో లోకాలమీది నడక
అసలు వాతావరణం లో తేమ లేదు
నాలుక మీద జ్ఞానం లేదు
బాధలు బంధాలు నవ్వులు జ్ఞాపకాలు అన్నీ
కట్ట కట్టుకొని కూలిపోయాయి

ఒక తేలికైన భారం
భరించలేని ఉనికి
ఆవురావురంటున్నదొకటే
ఆకలి

పద్యం రాసుకుందామా ?
చేతి వేళ్ళలో కదలికలు లేవు
మెదడంతా చీకటి వలయాల మధ్య
తప్పిపోయింది

ఈ ప్రపంచానికి ఏం జరిగిందో?
ఉందా అసలిది...
లేక నేనే కల గంటున్నానా ...!

రాత్రి పది దాటాక
ఎట్లా చేరానో ఇంటికి
ఏం జరిగిందో ఒంటికి ...
కడుపులకి ఒక్కో ముద్దా ఎట్లా చేరిందో చేరింది

మెల్ల మెల్లగా...
మెలకువ లో మెలకువ
టీవీ లో పాటలు ప్రచారం చేస్తున్నాయి

శబ్దాలకు రసం తెలిసింది
స్పర్శకు రంగులు కలిసాయి
ఆలోచనకు అమృతం దొరికింది

మా నాయిన మాట గుర్తొచ్చింది
''నాభి కాడ సల్లబడితే నవాబు తో జవాబియ్యొచ్చ''ని

అన్నం కడుపుల కొచ్చాక
ప్రపంచం లేచొచ్చింది

అన్నం పరబ్రహ్మ స్వరూపం
అన్నం తిన్నాక అన్నీ గుర్తొచ్చాయి

కండ్ల ముందట
మనసు లోపట వున్న లోకాలు
అన్నీ లేచాయి

మా నాయిన చెప్పింది నిజమే
అన్నమే దేవుడు.

.....
3-5-2014

2 comments:

  1. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్।

    ReplyDelete