Sunday, January 12, 2014

నిన్న వెలిగిన నీడలు


కలలెప్పుడూ చిన్నబోవులే
వెతుకులాట లొ దొరికిన కరుణ
మనసు నిమురుతుంది
పై పైన మొలిచిన తుమ్మలకి
పలుకులు వాడి ...ఐనా

కంకులు మొల్చిన నేల కంకర పాలైనా సరే
తడి తప్పక మాటిస్తుంది ప్రియురాలా!

మనుషులు వాడిపోలేదే...
చీకటి మొహాన నీ చున్నీ కప్పు.

అనుకోకుండా మొలిచిన బీజం
వేళ్ళతో వెతుక్కుంటుంది
ఎవరూ నేర్పని ఆకలి
కడుపును కనికరిస్తుంది
పన్నీరు కూడా పల్చనైనపుడు
కన్నీటితో కలిసిపోతుంది

పరుగెత్తుకొచ్చేపరుషాలు కూడా
పుష్పాలై నిలుస్తాయి ప్రియురాలా!

మనుషులు రాలి పోలేదే...
చీకటి మొహాన నీ చున్నీ కప్పు.

ఇంకా ప్రాచీన రుచులు వాడిపోలేదు
కొత్త నగిషీల నడక సోలిపోలేదు
అంతా నిర్మోహ కలల సౌరభమే
నిజంగా ప్రవహిస్తున్నది

రాతి శిలల మధ్య దాచుకున్నదేదో
ఆకుల ఆత్మను మెరిపిస్తుంది

భూమిలో నాటుకు పోయిన వేళ్ళే కాదు
గాలిలో చేతులూపుతున్నవి కూడా
పచ్చగా పలకరిస్తాయి ప్రియురాలా!

మనుషులు చచ్చిపోలేదే
చీకటి మొహాన నీ చున్నీ కప్పు.

.....
(కృష్ణఅప్పూ లకి ఇష్టంగా)

12-1-2-14

No comments:

Post a Comment