Saturday, January 18, 2014

ఈ మాత్రం దానికి 5


ఏం జరుగుతుందో
తెలిసేలోపే ...
అంతా అయిపోతుంది

మంత్రించిన
జ్ఞానం చల్లారిన పొగలు
మురిపెంగా ముసురుకుంటాయి

యథావిధిగా దినచర్య
వెంటపడుతుంది

నునుపనుకున్న పోరాటం
కంటినిండా నిద్రపోతుంది

పారిపోయిన చోట
ఉన్నదే ప్రత్యక్ష మౌతుంది
పాత దుఃఖమే కొత్తగా
తలుపులు తీస్తుంది

ఏంకావాలనుకుంటున్నామో
తెలిసే లోపే
జీవితం ముడతలు పడుతుంది

.....
17-1-2014

Sunday, January 12, 2014

నిన్న వెలిగిన నీడలు


కలలెప్పుడూ చిన్నబోవులే
వెతుకులాట లొ దొరికిన కరుణ
మనసు నిమురుతుంది
పై పైన మొలిచిన తుమ్మలకి
పలుకులు వాడి ...ఐనా

కంకులు మొల్చిన నేల కంకర పాలైనా సరే
తడి తప్పక మాటిస్తుంది ప్రియురాలా!

మనుషులు వాడిపోలేదే...
చీకటి మొహాన నీ చున్నీ కప్పు.

అనుకోకుండా మొలిచిన బీజం
వేళ్ళతో వెతుక్కుంటుంది
ఎవరూ నేర్పని ఆకలి
కడుపును కనికరిస్తుంది
పన్నీరు కూడా పల్చనైనపుడు
కన్నీటితో కలిసిపోతుంది

పరుగెత్తుకొచ్చేపరుషాలు కూడా
పుష్పాలై నిలుస్తాయి ప్రియురాలా!

మనుషులు రాలి పోలేదే...
చీకటి మొహాన నీ చున్నీ కప్పు.

ఇంకా ప్రాచీన రుచులు వాడిపోలేదు
కొత్త నగిషీల నడక సోలిపోలేదు
అంతా నిర్మోహ కలల సౌరభమే
నిజంగా ప్రవహిస్తున్నది

రాతి శిలల మధ్య దాచుకున్నదేదో
ఆకుల ఆత్మను మెరిపిస్తుంది

భూమిలో నాటుకు పోయిన వేళ్ళే కాదు
గాలిలో చేతులూపుతున్నవి కూడా
పచ్చగా పలకరిస్తాయి ప్రియురాలా!

మనుషులు చచ్చిపోలేదే
చీకటి మొహాన నీ చున్నీ కప్పు.

.....
(కృష్ణఅప్పూ లకి ఇష్టంగా)

12-1-2-14

Friday, January 10, 2014

ఆనందకాలం 4



''డాడీ నాకో కైట్ కొనిస్తవా'' అడిగిండు ఆనందుడు .
ఆర్నెళ్ల పరీక్షలు రాసి అలిసిపోయిండు గావచ్చు పోరడు ఒకటో తరగతివి.

ఇగ పిలగాల్లకు పనేముంది సంక్రాంతి సేలవులాయే.

మా సిన్నప్పుడు గూడ ఇట్లనే ఆడుకునేదనుకో ...
''కొనుడెందుకు రా నేను చేసిస్త...ఆ న్యూస్ పేపర్ పట్టుకరా ''అని నేను రెండు ఆం ఆద్మీ పొర్క పుల్లలు తెచ్చిన.{పొర్క గురించి చెప్పినప్పుడు ఆం ఆద్మీ ని తలుచుకోవటం ఇప్పటి మాట.}

''గదెందుకు''?అంటూ ముఖం ఏదోలా పెట్టిండు.

''న్యూస్ పేపర్ , పొర్క పుల్లలతో పతంగి చెయ్యొచ్చు'' అన్నాను .ఎన్కటి కి గవే చేస్తుంటిమి.

''థూ....''

''ఇవతలికి అవతలికి ముఖం కన పడ్తదా దీంతోని ...''

''ఎగిర్తే సాలు కద...ముఖం ఎందుకు కనపడాలె?''అన్న...
ఇప్పుడు ప్లాస్టిక్ పతంగులాయే...

''అందరి పతంగులు నవ్వుతయ్ మనదాన్ని చూసి..పో డాడీ ఇదొద్దు..''అనుకుంటూ అవతలికి పోయిండు నిష్టూరంగ.

అసలు నాకు పతంగులు ఎగరెయ్యడం ఇస్ష్టం లేదు .దానికో కథ వుంది.కొద్దిగ చెప్త.

... ... ...

గిట్లనే నా సిన్నప్పుడు ...సెలవులల్ల ...పతంగి చేస్కొని పేపర్ తో...మాంజ దారం పేనుకొని...నానా తంటాలు పడి మిద్దెక్కిన .

ఎవ్వరు లేరు ఎంట ...ఎవరి మిద్దె మీద వారు ఎగరేసు కుంటున్నరు .

నేనొక్కన్నే ...అటుతిప్పి ఇటుతిప్పి ...దారం గుంజుతుంటే పతంగి ఎగిరింది.

''హే''...

ఆనందం ల ఎనకెన్కకు పోయి...గండి గూడుల కెళ్ళి కింద పడ్డ మిద్దె మీది నుండి.

ఎన్కట మా ఇండ్లల్ల దర్వాజ దాటంగ నే గజంపావు పొడవు గండి గూడు ...వెల్తురు కోసం ,వానకోసం వుండేది.అండ్ల కెళ్ళి కింద పడ్డ.

లొల్లి విని సుట్టు పక్క లోల్లు ఉరికొచ్చిరి.

కొద్ది సేపు నేను బేవోషి అయిన్నంట .

''ఎంత సక్కని పోరడు ...ఇట్లా పడే ...పతంగులు పాడుగాను'' అనుకుంట లేబట్టి కుసపెట్టి
ఏడేడ దెబ్బలు తాకిన యో చూసి ...ముఖం మీద ఇన్ని సన్నీల్లు జల్లి ...లేపి కుసపెట్టిండ్రు .

ఎన్కకు పడ్డ గద...మోచేయి బాగ గుద్దుకుంది.

తల్కాయకు తగలలే...మా అమ్మ అదృష్టం .

మోచేయికి బట్ట తడిపి సుట్టిండ్రు.

ఇంతల మా నాయిన వచ్చిండు.అప్పటి దాక లేడు ఏదో దావతుకు పోయిండు.

ఇగ సూడు నా బయం కాదు .
ఏమన్లె కాని ...మల్లెన్నడు ...పతంగి ఎగిరెయ్యనియ్యలే...అంతేనా సైకిల్ తొక్కనియ్యలె...
ఈతకు పోనియ్యలె ...
ఇంకో వూరికి పంపియ్యలే ఒంటరిగ.

ఇగో గా బయంతో నేను కూడా ఎప్పుడు పతంగుల సూసుడే గాని ఎగరేసుడే చెయ్యలే...

ఇప్పుడు ఆనందుడు వూకునే తట్టు లేదు .కొనిద్దామనే అనుకున్న.రేపటె ల్లుండి కొనియ్యోచ్చు లే అనుకుంటుంన్న.

నేను బయటకెళ్ళి వస్తుంటే ఆనందుడు దోస్తులతో మాట్లాడుతున్నది ఇనబడి పరిషాన్ అయిన.

వాడి దోస్తు...''ఒరే ఆనందు...మీ డాడీ కైట్ కొనిస్త లేడా''అడిగిండు.

''హే...చాల కొనిస్తన్నడు.కానీ నేనే వద్దన్న.''అన్నడు.

''ఎందుకురా'' దోస్తు అడిగిండు.

''విమానాలొచ్చి తగిల్తే పతంగి పాడైతదని నేనే వద్దన్న'' అన్నడు.

అక్కడి నుండి ఆపుకొని ...ఇంట్లకొచ్చి నవ్విన.

ఇన్నంక మల్లక్క కూడా ఆపుకోకుండ నవ్వింది.
కొడుకుకు పతంగి కొనియ్యలేదని అలిగింది కూడ.

.....
10-1-2014

ఆనందకాలం 3



ఆనందుడు యధావిధి గా వస్తూ ... కాలెగరేసి ''డిషుం'' అని
బోర్లా వేసిన v అక్షరం లా కాళ్ళు పక్కకు జరిపి నిలబడ్డడు.

'నాకో డౌట్ డాడీ '
నడుం మీద చేతులు రెండు బ్రాకెట్ల లా పెట్టిండు

వచ్చాడంటేనే ఒక విశేషం ఉంటుంది లెండి

చెప్పు...అన్నాను.

'జిజంగా చెప్పాలె' అన్నాడు చూపుడు వేలు పైకెత్తి .

తలూపాను .

'అసలు హార్సు , డంకీ ...ఒక్క తీర్గానే ఉంటయ్ కదా!'

చూపుడు వేలు ఇంకా దింపలే ...బలమైన ప్రశ్న సుమా! అన్నట్టుంది.

అవునన్నాను .

'మరి వాటికి వేరు వేరు పేర్లెందుకు పెట్టిండ్రు ? హార్సని... డంకీ అని '

ఎలా చెప్పాలా అని క్షణం అలోచించి ...అర్ధమవటం కోసమని ...

'గాడిద పొట్టిగా ఉంటుంది...
గుర్రం కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా అందుకే'

తల పట్టుకున్నాడు .
నా జవాబుకు ఇంకో ప్రశ్న సిద్ధం చేసాడు.

'మరి మమ్మి పొట్టిగ ఉంది ...నువ్వు పొడవున్నవ్ గా ...మనుషులంటున్నాం కద్దా...'

గన్ పేల్చాడ్.....

వెంటనే...'మరి మరి ...కుక్కలు కొన్ని పొట్టిగ కొన్ని ఎత్తు గ వుంటే కూడా కుక్కలనే అంటున్నాం కదా...'

''ఒరేయ్''....అరవాలనిపించింది .
కాని అరవలే...
కొంచెం తెలివిగా సమాధానం చెప్పాలె వీడికి అనుకొని ...

'గాడిద కు ఉరకడం రాదు ...డల్లుగా నడుస్తది...
గుర్రమైతే స్పీడుగ ఉరుకుతది...active...గా ఉంటది .'

అన్న వెంటనే

'మరి నీకు ఉరకడం రాదు కద నా లెక్క 'అనుకుంట
అవతలికి ఉరికిండు.

అటు మల్లక్కని నన్ను ఇరుకున పెట్టిండీ రోజు .
పిల్లాడు చూసిండ్రా .

.....
6-1-2014.

ఆనందకాలం 2

డాడీ ఏదైనా పాట పాడవా అనుకుంట వచ్చిండు మా ఆనందుడు.

వస్తూనే ఇట్లా అడిగిండు... ఏంటో కథ అనుకుంటున్నా ...
ఏం లేదులే ...మా క్లాసుల పిల్లలంతా పాటలు పాడుతున్నరు ...నాకే ఏం రావు.
అందుకే నేర్పుతవా...

పాటలు నాకు రావురా ...పద్యాలు నేర్పుతా నేర్చుకో అన్నాను.

ఒక్కటి పాడు వింటా అంటే..

''తల్లి దండ్రి మీద దయలేని పుత్రుడు
పుట్టనేమి వాడు గిట్టనేమి
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వనుర వేమ''

''థు''అనడం తోటే గలీజుగ చూసిండు.

ఇదేం పాట డాడీ...అన్నడు

నాకు గివె వచ్చు రా అన్నాను.

ప్చ్...అని తల పట్టుకున్నడు

పోనీ డాన్స్ వచ్చా ...అన్నడు.

రాదు అన్న...
వచ్చు అంటే ఉండే ప్రాబ్లం తెలుసు కద.

అసలు నీకేం వచ్చు డాడీ ...నిదానంగ ప్రశ్న ఓ రకంగ పలికిండు

ఇరికిచ్చాడు అనుకుంటనే ఉన్న

మళ్లీ తనే .....ఈత వచ్చా అన్నడు.

చచ్చాం.

జీవుడు గిల గిల కొట్టుకుంటున్నడు

మల్లక్క అవతల నవ్వుడు షురూ చేసింది

నా మొఖం ల రంగులు సూసిండు మావాడు.....

పో...కవిత్వం రాసుకో ...అనుకుంట పోయిండు.

...

ఆనందకాలం 1



మా ఆనందుడు
నేనెప్పుడన్నా మౌనంగా వుంటే
ముభావంగా కూర్చుంటే కవిత్వం వస్తుందా అనేటోడు.

అనీ అనరాక ఏదన్నా పదం పలికి ...మళ్లీ వాడే
బాగుందికదా పోయెం రాసుకో అనేటోడు.

ఈ మధ్య
వాడే ఏదో మాట్లాడి
బాగ చెప్పిన కదా అంటుండు.

నాకో డౌటు వస్తనే వుంది

ఇయ్యాల అన్నంత పని అయ్యింది

డాడీ నేను పోయెం రాస్తా అన్నడు.

కవిత్వం రాసుకో కవిత్వం రాసుకో అనేటోడు
రాస్త రాస్త అనేకాడికి వచ్చె
ఏం చెప్పాలె ...

ముందుగాల ఒత్తులు దీర్ఘాలు
సున్నాలు సుక్కలు
అచ్చులు హల్లులు
నేర్చుకో తర్వాత చూద్దాం గాని అన్న.

వాడొక సూపు సూసి బయటకి పోయిండు.

మా మల్లక్క దిక్కు తిరిగి
ఒక్కటే చెప్పిన...
ఏం చేస్తవో చెయి
కవిత్వం దిక్కు రాకుండ చూడమని.

అరె అ ఆ లే రాకపాయె
అమరకోశం దాక పాయె.

ఎట్లుంది చూడు తరం.

Thursday, January 9, 2014

చెదలుకు కూడా ఆహారం కావాలి


సాగిపోతున్న కన్నీటి ఉదయాన
రవంత నీ నులివెచ్చని నీడ కింద
ఎవరూ సిద్ధంగా లేరు

ఏ పలుకూ అమృతమయం కాని సమయమూ
నీ వెంట ఎండపొడతో నిలబడదు

సిమెంటు బలగాల మార్బలం
ఎప్పుడో ఘనీభవన స్థితిని చేరింది

కొన్ని వాసనల మునిగిపోయిన పెదాలు
నీతిని నేర్వలేదు

చిరిగి పోతున్న కళ్ళల్లోంచి
ఎలా కనిపిస్తావో తెలుసుకదా...!

నటనలో సులభంగా కలిసిపోయిన
ప్రేమను గుర్తించక పోవడం
వాతావారణ మార్పుకి కారణం

ప్రయత్నించినా
కాదనుకోలేనితనం కింద
అవిటిమనసుకు అవస్థలే తోడు.

.....
9-1-2014

ఉన్నదే తెలుసుకునేది



ఈ ఉదయం మార్దవంగా కలిసింది
ఆశ్చర్యంగా వంక చూసే లోపునే
ఇంకా ప్రశాంతంగా పలకరించింది

కోయిల రాగాల పెట్టె తెరిచింది
కొన్ని నవ్వుల పూతల మధ్య
మందారం చిన్నబోయింది

కను చూపులకు కొత్త జ్ఞానం కలిగి
ప్రపంచం చాలా పాత కౌగిలిలా
నమ్మకం తెరిచింది

కింది అందిన కొమ్మల చిగురు కోస్తున్న
వాణ్ని చూసి చింత నవ్వింది
పై చిగురు కొమ్మల చూపి
పాఠం రాసింది

మూడు గుర్రాల రధం
ముంచేస్తుందని ,తనకు తాను నడిచే
రెండింటిని కట్టేయాలని స్పృహ కలిగింది

నువ్వు నడపగలిగితే ఒక దాన్నే
సవ్యంగా నడుపు లేదా.....
ఏది ఎప్పుడు నడుస్తుందో
చూస్తూ ఉండని కొన్ని హెచ్చరికలు

ఎక్కడి నుంచో కొన్ని
మార్గాలు మన మీదుగా పోతాయి
స్పర్శకు చేరే లోపే
సూర్యుని వెంట జారిపోతాయి

రాత్రి ప్రవహించిన చీకటి కింద తడిసి
పొద్దున్నే నన్ను నేను
ఎవరని ప్రశ్నించు కున్నాను.

......

8-7-2013.

ఆత్మ కేంద్రకం


కంఠంలో ఎవరో?
వెలుతురు కిటికీలన్నీ మూతలు పడినట్టు
వికలాంగ దుఃఖం

నిర్మానుష్య సమయం
నేను మనిషిని కానప్పుడో కాదో
గోడకు తగులుతున్నాయి కాలండర్
టీవీ మీద గడియారం
భూమికి వేలాడుతూ....

మొండి వాదనలు ఒంటరిగా
ఆకలికి చుట్టుకుటాయి

శబ్దం ఎలకలు చుట్టూ తిరిగి
గిన్నెల మీద పడిపోయింది
చిందర వందర కళ్లల్లోంచి
మెతుకులు మెతుకులు గా బతుకు

పుస్తకాల వాసనతో
అజ్ఞానం తీరేదిగా లేదు

జీవితం రుచి వెగటు వెగటు

నన్ను పంచుకోనందుకు ఒక హృదయం పగిలిపోయింది
పంచుకున్నందుకు ఒక గుండె బద్దలయ్యింది

ఉఛ్వాస నిశ్వాసల మధ్య
విశ్రాంతి కోసం
వెతుకులాట.

......
28-6-2013.

పంజరం వెలుపలి పాట



ఒక కాంక్ష ఒంటరిగా లోపల్లోపల వెంటపడుతున్నట్టు, ఒక నీడ తల తిప్పినప్పుడల్లా నా దేహం కింద మసలుకుంటే కుంటునట్టు, నేను పట్టించుకేన్ సమయంలో అదే నన్ను తడుతున్నట్టు

ఒక దుఃఖపు కోర

ఈ పగలు రాత్రి ప్రపంచం కింద చీకటి నిద్రపోతున్న నా సందర్భానికి గొంతులో ఆరిన తడికి తృప్తి పరిచే పలుచని మెలుకువ ఓ బృందతటాకాలను ఇటు వైపే డెక్కల ధూళి కప్పినట్టు

ఒక మైనపు చార

అనేక ప్రస్థావనల ఒకే ప్రపంచానికి దిక్కు లేక నానాటికీ ఛిన్నాభిన్నమైన ఆనందం
అవిటి నిద్రను మోయలేక మోయలేక సమస్తం సహకరించని కండరాలు ఒఠ్ఠి పశువును కట్టేసిన కొయ్యవలె నిర్దిశల గాంభీర్యపు గురక వార్చిన పేగుల్లో సమస్తం క్రీడే

ఒక తాత్విక భ్రమ

జీవించిన వారికెపుడు
భావించిన రుచి దొరకదు భారము తీరని
స్రవించిన నయనములకు
ద్రవించిన గుండె తోడు తోవలు నడవని

.....
4-7-2013.

ఎటు?



ఏ ప్రశ్నలూ లేక
ఏ సంశయాలూ లేక
ఇప్పుడు మాట్లాడుకోవాలి

జాగ్రత్త కోసం ఓ సూచన
భూగోళం కాళ్ల కింద తిరుగుతుంది
వెలుతురు అస్తమించక ముందే
భయంతో పాటు శవాన్ని కాల్చేయాలి

గొడవ పడే అనేక విషయాలకు
దృష్టి మొలిచింది
వాటికీ నిరుత్సాహపు ఎదురుచూపు

అనివార్యమైనదొకటే
తడబడుతూనైనా తట్టుకోవటం

కడుపారా మాట్లాడుకుందాం
ద్రవీభవించిన బాధల్ని వార్చుకోనీ
అర్ధాంతర సాయంత్రం ఆవహిస్తుందేమో

రహస్య కన్నీటి జాడలు
కొన్నివాక్యాలను ఇంకా ఉఛ్ఛరిస్తూనేవున్నాయి

విషయాలను హత్తుకొని
మనుషుల్ని వదిలేసుకున్న అజ్ఞానంతో
వెనక్కి చూసినపుడు
నేను బయలుదేరిన చోటే ఇంకా ఆగి వున్నావు

సరే!
ఇక సమస్త గర్వాలకి,భయాలకు
సమస్త ఈసడింపులకి
సమాధానం దొరకని ఆవేశాలకి
సగం కాలిన అహంకారాలకి
వినమ్రంగా తలవంచుకొని.

.....

భిక్షకుడు


కడుపు నిండా ఆకలి
కలగంటున్న వేళ

రుచెరగదు కానీ
రుచిని హత్తుకునే మునకలేస్తుంది

రెండు చేతుల నిండా అన్నం
అవే చేతుల క్రింద హృదయం
జీవన సారాన్ని నములుకొని
సూర్యుడికి జోల పాడతాయి
దాపుకు దుఃఖం జడలు పెంచుకుంటుంది

మీ ఇంటి ముందు
నిల్చున్న నాకు
తళతళల ప్రేమను ఒక ముద్ద
పరిచయం చేయండి.

.....
24-4-2013

ఊయల చీర



చిరు చిరు నిద్ర
చిటికెడు

కన్రెప్పల కింద ఊయల ఊగుతున్న
రాత్రి

పాలాకలి కొద్దిసేపు
కలలోకి

ముఖం గుండ్రని
వెన్నెల ముద్ద

ఆకాశమా!
నీకొక్క చంద్రుడే

రాత్రీ! ఇంటికో చంద్రున్ని
జోకొట్టే భాగ్యం నీదే

పక్క తడిస్తే
ప్రపంచం మేల్కొంటుంది

ఊయల చీరకి
మరో జోల పాడక తప్పదు .

.....

ఘనము ద్రవము కాని మత్తు జోల వాయువు కూడా కాదు



లెక్కలో సగం నువ్వుండి
మోహించక మానవు

నా నీడవి ,
ప్రేయసి దేవివి
నను మరువని దాసివి

జీవ కళేబరాలను చేసే మంత్రం తెలియక
వేడుకుంటున్నానే
నా తూకం రాని బంగారమా !

మెడలు వంచో
నడుము తుంచో
వంకర టింకర టింకర బుంకర
సొగసు బిగుసుగా
గురక గరుకుగా
పరక నురగగా
ప్రణయం తో నిండిపోతావ్

పాత కక్షలన్నీ పట్టించుకోక
పారిపోయే అంగాలకు మాటు వేస్తావ్
చెప్పకుండానే వచ్చి
చెప్పలేని రుచిని కప్పిపోతావ్

ఏనాటికీ సాధ్యం కాని సౌందర్య కలల్ని
చూపిన నీటితెరవి
నా సగం జీవితమా!
నా రాత్రుల నెరజానవి.

పెళ్ళగించిన నరాల కోరికలు
ఒక్కొక్కటీ నేల రాలాయి

నువ్వు ప్రవహించే నీతి తెలియక
ప్రవేశించే దారి తెలియక
రొజొక్క తీరు కౌగిలింతతో
కసి తీర్చుకుంటా

ప్రియ సఖీ
నా వెన్నెల స్నేహితా!
నా కనిపించని అవయవమా ...
నీకెందుకింత కావలి.

.....

22/4/2013.

ఊగిసలాట



1

అలలు అలలైన కాంతి
కంటికి వెనకాల పూసిన హరితం
బిందు ఆనందం
ఆకాశం వైపుకి
ఆత్మ వైపుకి పయనించి
ఏ యుగపు ఉనికినో నాటుకుంది

2

ప్రపంచం మొలకెత్తిన స్థితి ఇదే
నువ్వు నేను కొన్ని
సందేహాల్ని చుట్టుకొని ఈదుకుంటూనే
అంచెలంచల ఊపిరిని పిసుకుతాం
ఊహల్ని ఊదు పొగల్తో పూజించి
నడవటానికి కాళ్ళను బదులు తెచ్చుకుంటాం
రాద్ధాంతాల రక్షలో
ఇన్సురెన్స్ కొత్త పాలసీకి దండవేస్తాం

3

నువ్వలా అంటావని,అంటూనే వుంటావని,
అన్నదేదీ వీలే కాదని
అనుకున్నా పట్టించుకోవద్దని
నానిన్ను,నీనన్ను
ఈ చీకటీ కాని పగళ్ళలో
పగలు చిక్కని చీకట్లో
ఉడుకు రక్తపు మడుగులొ
ఖాలీ సీసాల సాక్ష్యంతో
ఎవడో ఇచ్చిన బహుమతి బతుకుని
కుక్కపిల్లని దువ్వుకున్నట్టు
పొగ ఊది ,పౌడరద్ది ,తీర్చిదిద్ది
పరిచయానికి ముందే అంతా అర్ధమై
సాగనంపుతున్నట్టు.

......

8-4-2013.

ఆత్మవెలది 54



నేల మీద నడిచే వాడిని
మనం నమ్మవచ్చు

నేల విడిచి సాము చేసే వాడిని
చూస్తూ గడపొచ్చు

మనుషుల పై నడుస్తూ
నేలను కించపరిచే వాన్ని వదిలేయవచ్చు

ఈ మసకలోకంలో
చూపొక్కటే సరిపోదు
ప్రియురాలా .....!
కంటికి తోచని చీకట్లుంటాయి.

.....
10-12-2013

ఆత్మ వెలది 58


ప్రపంచం పాతబట్టల్ని
మార్చుకునే ప్రయత్నం లో వుంది

ఒక్క రోజునే ఓపిగ్గా
అనుభవించే ఆదుర్దా తో వుంది

కొత్త కాలాన్ని హత్తుకుందామనే
భ్రమలో వుంది

ఈ మసకలోకానికి
ప్రతి యేటా ఒకరోజే ఈ తంతు
ప్రియురాలా ...!
మిగిలిన రోజులన్నీ మనకే వదిలేస్తారులే

.....
30-12-2013

ఆత్మవెలది 55


పాటలు పాడే వాన్ని
గుండెకి తగిలించుకోవాలనిపిస్తది

బొమ్మలు గీసే వాని చేతిలో
కుంచెను కావాలనిపిస్తది

జీవితాన్ని రాసిన కవి
కాళ్ల కింది మట్టిగా మారాలనిపిస్తది

ఈ మసకలోకంలో
కొన్ని మిణుగురులు తిరుగుతుంటాయి
ప్రియురాలా .....!
ఆ వెలుతుర్లో మనల్ని తెలుసుకుందాం

.....
12-12-2013

ఆత్మవెలది 57



అక్కడ నేనెందుకుండను
నువ్వున్నప్పుడు

ఇక్కడ నువ్వు వుంటావు
నేనున్నప్పుడు

ఒంటరి ప్రేమకు ఎరుకలేదు
ఉన్నదంతా వెలుతురు వర్ణమే

ఈ మసక లోకానికి
గుసగుసలే ఇష్టం
ప్రియురాలా .....!
పవిత్ర కాంతి అందరిన ిచేరదు

.....
17-12-2013

ఆత్మ వెలది 56



క్షణికంలో సితాకోక
గుండె మీద వాలుతుంది

పచ్చనాకు మీద మంచు
ముత్యమై మెరుస్తుంది

ఆత్మకు దూరమైనవారు
అంటివున్నా చిగురేయరు

ఈ మసకలోకం
కలిసుంటాన్నామని భ్రమిస్తుంది
ప్రియురాలా .....!
మనతో పోలిక సరిపోదని చెప్పు

.....13-12-13

ఆత్మవెలది 53


వెళుతూ వెళుతూ కొందరు
నింద విసిరి పోతారు

మనలను చూసీ
మరొకరిని పలకరించి పోతారు

తెలిసీ నటించడం వెనక
తెలియకనే స్వభావం విప్పుకుంటారు

ఈ మసకలోకం
ఆడంబరాలకు అలవాటు పడింది
ప్రియురాలా ...!
తడితడి మనసుండగా మనకేం తక్కువ

.....
9-12-2013

వారాంతపు పని


ఎగురుతూ దుముకుతూ
ఉద్దేశ్యం లేని పరుగుతో
ఒగిరిస్తూ

దాచుకున్న ఆటని
బయటకు లాగుతూ

కిందపడి దెబ్బని తాకి
ఒక రక్తపు చుక్కని కూడా
అబ్బబ్బ అన్న తీరుతో
అబ్బుర పరుస్తూ

ఏడుపుకు ఏడుపుకు మధ్య
దొంగేడుపుతో అలరిస్తూ

పిల్లలు
ఆదివారాన్ని ఆనందిస్తారు

పెద్దలు
రోజూ ఏదో ఒక ఏడుపు
ఏడుపు లాంటి ఏడుపు
ఏడుపు కాకుండ ఏడుపు తో
ఆరు రోజులు కారించి

ఆదివారం రోజు
ఆరురోజుల ఏడుపును గుర్తుచేసుకుంటూ
వచ్చిన వారికి వడ్డించుకుంటూ...

.....
6-1-2014

కానుకను


సాయంత్రం కమ్మని వెన్నెల కాసే
మల్లె చెట్టొకటి నీకోసం
తెస్తాను

బహుశా
ఇప్పుడు నచ్చకపోయినా
అది కొప్పునిండా పూలుపెట్టుకున్నట్టు
పూసినరాత్రి
వెన్నలా అదీ మాట్లాడుకుంటుంటే ...

మధ్యలో ఆ మాటల్ని వింటూ
ఈ ప్రపంచంలో
ఏ మాత్రం వాసనలేని నువ్వు
ఎంత పరిమళిస్తావో

.....
2-1-2014

Makeup naturally



నాకు నేను పరిచయం అయ్యాక
నా ముఖచిత్రం
నేను గీసుకుంటున్నాను

కాలం కొంత నడిపించాక
నడక కొంత మొదలెట్టాక
అడుగుల రుచి తెలిసాక
డొంకల వంకల వొంపులు కలిసాక
కొరుకుల దారులు నిమిరాక
నడక అనివార్యమని తేలిపోయాక

పూలసంచిలా కొంతసేపు
సౌందర్యపు వాసనకి నోచుకున్నాక
విప్పటానికి ఏమ ీవుండదని

ఆకాశానికి పాదాలు నడవలేవని
భూమికి మించిన ఆధారం మరోటి లేదని
మనసుకు మించిన సమీప శత్రువు
మరొకడు దొరకడని అనిపించాక

ఏ కాలమైనా ఒకటే

వెంట్రుకలు తెలుపును ఇష్టపడుతున్న సమయము
వేదన...బాగోగుల పొలుసులు
విప్పుకుంటున్న వేళ
సరదాగా దు:ఖంతో పరాచకాలాడే
ప్రియురాలిని కల్గివున్నాక
సమస్త భ్రాంతుల్ని తెంచేసుకునే
తాయెత్తు మొలమీద కట్టుకున్నాక
ఇక...

ఏ కాలమైనా ఒకటే

.....
1-1-2014

ఈమాత్రం దానికి 2



ఒక లిప్త కాలంలోనే
అనేక ఆలోచన్లు కలుసుకుంటాయి
పొంతన లేకుండా
ఒక మెరుపు తునకలా
ఒళ్లు ఝళ్లు మనేలా వచ్చి పోతాయి

మనసు పచ్చని పైరులా వుంటే
పిల్ల గాలుల్లా వచ్చే ఆలోచన్లు
హాయిని తెలుపగా
గుండెని తడుపుతాయి

గాయమైన చర్మం లా మనసుంటే
ఆలోచన్ల మంటలు
ఆ భగ్గుమనే అంటుతాయి

సంపదకనుకూలంగా కూడా
కొన్ని చమక్కుమంటాయి
కానీ...లేనపుడు
ఏకాకి విచారమే ముసురుకుంటుంది

ఈ రోజు మనకేం కావాలో
అదే పనివైపు జరుగుతాం
అనుకోకపోయినా

కొందరు కొన్ని పనుల్లో
ఆరితేరివుంటారు
డబ్బుకు సంబంధం లేనివి
ఉదాహరణకి ఎదుటివాడి జీవితంలో కాలు పెట్టడం

స్నేహం ను గొప్ప వేషం లా
రక్తి కట్టించడం అలవాటైన విద్య కొందరికి
ఈర్ష్య ...ద్వేషం
కోపం...అహంకారం
అనేక వేషాలు ఒకేసారి వేయగల సత్తా
సరిపోను నిల్వ కలదు

ఇక

ఏది మనకు అనుకూలం కాకపోయినా
బోలెడు చింత జమా.

చింత చిగురించి చిగురించి
పూతై...కాతై
బీపీ నో.....సుగర్ నో
ఒంటి నిండా నింపాక...

ఇంకేముంది
గిలగిలబతుకు

.....
27-12-2013

ఆత్మ వెలది 52


నువు పక్కనుంటే
చుక్కల మీదికి దృష్టి పోనే పోదు

పరిశుభ్రంగా ఈ ప్రపంచం
పండగ లో తడుస్తుంది

తగిలీ తగలని నీ స్పర్శ
శ్వాస కే ఉక్కిరిబిక్కిరి

ఈ మసకలోకం
మనల్ని గుసగుసగా చూస్తుంది
ప్రియురాలా ...!
ఈ రాత్రిని వెన్నెల చెయ్యి.

.....
7-12-2013

ఆత్మ వెలది 51



ప్రశ్న కు ప్రశ్నే
సమాధానం అవుతుంది కొన్నిసార్లు

చేతకానితనమే
చెప్పలేని బలమౌతుంది

మౌనం కొన్నిసార్లు
గొప్ప సంభాషణౌతుంది

ఈ మసకలోకానికి
మన గురించే దుగ్ధ
ప్రియురాలా .....!
మాటల్ని కొలబద్దలు చేయకు

.....
6-12-2013

ఈ మాత్రం దానికి ...3



ఒంటరిగా ఉండలేని మనం
కొన్ని పరిస్థితుల వెంట పడతాం
కొన్ని సృష్టించుకుంటాం

కొంతకాలానికి
అవే వెంటబడతాయి
మన చుట్టూతా దాని వల
చుట్టుకుంటుంది

ఇంకొంత కాలానికి
అవే కనిపిస్తాయి

చివరికి
ఉండే పరిస్థితి
లేని పరిస్థితి
మధ్య ఉండిపోవడం

.....
7-1-2014