ఇంతకీ నువ్వెవరో తెలియదు
బహుశా నేను పుట్టటానికి ముందు
నీతో స్నేహం చేసి ఉన్నానేమో !
ప్రయాణం లో నన్ను హక్కున చేర్చుకున్న
నీ ఆలింగనం
అమ్మ తర్వాతది ,
చలి రోజుల్లో కప్పుకున్న దుప్పటి ,
నను దాచుకున్న గుడిసె,
మెత్తని వెన్నెల గుజ్జు తాకిడి
నా భుజం మీద నీ చేయి వేసినపుడు
నా బరువంతా
నిప్పుల్లో దూకిన అగురుధూమంలా గాలిలోకి...
మనసుకు పట్టిన దుమ్మంతా
నీ రెండు చేతుల్లో
సద్దకంకిని నలిపినట్టు నలిపి,ఊదేసి
మళ్ళీ నా మనసు నాలోకి నింపేస్తావ్...
ఇంతకీ నువ్వెవరో నాకు తెలీదు
నువ్వు తలపుకు వస్తే
కోరికల రాజ్యం నాదే
అందులో కొలువుండే వాడు
నావాడే...
యుగాలనుండి
బంధించ బడ్డ పావురాయి
నీ చేతుల్లో ఎగిరిపోయి
వెనక్కి చూసి ,నీ చేతుల్ని
ముద్దాడటం మరిచి పోయినందుకు
సిగ్గు పడతాయి
ఎవరెవరు ఏమేమి ఏరుకుంటారో
నీ తీరం వెంట నడుస్తూ ...
నా చేతుల్లో పట్టేటన్ని
గులక రాల్లనే తీసుకుంటా...
నీతో తడిసిన వాటి చల్లని సుఖ స్పర్శ చాలు నాకు
నీ నోటి నుండి పారిన హొయల పాటల
తనువును మీటి పోతే చాలు
నా దేహము ,దాని దేహము
ఆనందపు లోయలో
రెక్కలు చాచిన పక్షిలా గాలిలో ...
ఇంతకీ నువ్వెవరో తెలియదు
ఈ భూమిని ముద్దాడిన
వాత్సల్యపు కొండవి
పోరాటానికి పొద్దుపొడుపువి
అక్షరాలకి,ఆత్మీయతకి ముద్దుబిడ్డవి
ఏ కాలము భయపెట్టని
మంచుగడ్డవి .
.....
నా ప్రియమైన అన్న డా.పిల్లలమర్రి రాములు కి....ఇష్టంగా.
No comments:
Post a Comment