Sunday, February 2, 2014

ఆనందకాలం 5



పిల్లలు చాన వుషారైండ్రు ఈ మధ్య .

పొద్దుగూకంగనే ''ఏంది స్పెషల్'' అంటుండు ఆనందుడు.

''ఏముంటది ర...అన్నం కూర ''అంటే

''అబ్బ ఎప్పుడవేనా డాడీ ''

''మరేముంటది ర '' అంటే

''ఏదన్న స్పెషల్ గావాలె'' అంటుండు.

మా సిన్నప్పుడు ఈ వయసుల (ఆరేండ్లకు) అంగి లాగులు గూడ లేకుండె.సెప్పు లైతె పదో తరగతి ల తొడిగినం...అది గూడ లబ్బరువి...అంటే సిప్పర్లు.
తినడానికి అన్నం .....కూర వుంటె వున్నట్టు లేకుంటె లేనట్టు.

మా అమ్మ సింతకాయ పచ్చడి నూరి పెట్టేది కచ్చ పచ్చ.
అప్పుడప్పుడింత తీసి మెత్తగ నూరి పోపుతాలింపు పెడితె.....అబ్బ ఎంత రుచో....అందుల ఇంత నెయ్యి సుక్క ఏస్తే..... నా సామి రంగ... ఏ కూర పనికొస్తది.

పొద్దున్న పొద్దుమూక అదే కలుపుకొని తింటే కడుపు గూడ సల్లగ ముడుసు కునేది .కన్ను సల్లగ మలిగేది.

కూరగాయలకు దుకాన్లకు పోయిన రోజులు తక్కువ

వాకిట్ల కు తట్టల్లో మోసుకొని ఆకుకూరలో ,కాయగూరలో వస్తె గీములాడి గీములాడి పావుకిల కొంటె పాణం పాయె .

ఇప్పుడు రోజులెట్లున్నై...

ఈ మధ్య పట్నం సందుల్ల అంగడి రోజులు మొదలు పెట్టిండ్రు .

బజారుకోరోజు అంగడి లాగ కూరగాయల బజార్లు జరుగుతున్నై .

మల్లక్క పోయేటపుడు ...ఏడ్చి...ఎంటపడి... మా ఆనందుడు కూడా పోబట్టిండు.

కొనే కూరగాయలు వాడే సెలక్టు సేయ బట్టిండు.

కిందటి వారం ఏం కొన్న డో తెలుసా...!

ఒక ఆన్ప కాయ (సొర కాయ )
ఇంత సింత పండు
కారట్ గడ్డలు

ఇంకేం కొననియ్య లేదట మల్లక్కను .

ఎందుకు రా అంటే...''అన్నీ అవసరం లేదు డాడీ...పప్పుసారు అన్నం ఉంటె సాలదా ...అండ్ల ఇవేసి పప్పుసారు కాస్తే సూపరుంటది ''
భలే అనుకున్న ....వెంటనే...
''అప్పుడప్పుడు ఎగ్గు రైసు ...ఇంక చికెన్ బిర్యాని''
అనంగనే గుభిల్లుమన్న.
''అన్ని కూరగాయ లెందుకు వేస్టు...''అని ముగించిండు.

మొన్న సంక్రాంతికి మొదటి సారి మా ఇంట్ల 'చికెన్ బిర్యాని' వండటం జరిగింది.

బిర్యాని వండకం మల్లక్కకు రాదు .
ఫోన్ హెల్పు తో తంటాలు పడ్డది .పొరపాటున బాగా కుదిరింది.

పిల్లలకు నాన్వెజ్ అలవాటు చెయ్యొద్దని ఇప్పటి దాకా పెట్టలే.

ఎప్పుడూ చికెన్ తినని మహారాజా ఆనందుడు ఆ రోజు ''ఊపేసిండు...''
అదీ కథ.

రెండ్రోజుల తర్వాత ...''డాడీ ఏదన్నా తిన బుద్దైతుంది'' అన్నడు

''ఏంటో...'' అన్నాను

సప్పుడు లేదు.

''గుజ్జలాం తింటావా''(గులాబ్ జాం )
మామూలుగా అయితే ఎగిరి గంతేస్తాడు.సప్పుడు లేదు మరి .

''బిలేజీ''(జిలేబీ)

''ఉహూ''తలూపిండు.

''ఏందో చెప్పరాదూ...''అన్నా.

వాళ్ళమ్మ వంక చూస్తుండు.
తల్లీ కొడుకులు ఏదో మాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టున్నరు.

'' తినబుద్దైతుంది డాడీ ప్లీజ్''

''ఏంటో చెప్పంది ఎట్లా తెలుస్తది రా"

'' బిర్రు...''అన్నాడు.

అర్ధం కానట్టు చూసా...
వాళ్ళమ్మ దిక్కు మల్ల చూసిండు.

ఆమె సప్పుడు సేయలే.

''అప్పుడప్పుడు స్పెషల్ చెయ్యొచ్చుగా డాడీ మమ్మీ...''సూపుడు వేలు అమ్మ దిక్కు తిప్పుకుంటూ అన్నడు.

''అవును కదా ....'' అన్నాను

''నీకు ఎప్పుడన్నా ఆమ్లెట్ ఏసియ్యమంటే వెంటనే ఎసిస్తాది కదా...నేను చికెన్ బిర్యాని చెయ్యమంటే చేస్తలేదు''...ఆవేశం చెంచాడు కలిపిండు.

మల్లక్క నవ్వడం షురూ చేసింది .

ఇక నేనేం చెయ్యాలె...ఇరికించాడు.

.....
21-1-2014.

No comments:

Post a Comment