ఆనందుడు
డా.పులిపాటి గురుస్వామి
Thursday, January 9, 2014
ఆత్మవెలది 53
వెళుతూ వెళుతూ కొందరు
నింద విసిరి పోతారు
మనలను చూసీ
మరొకరిని పలకరించి పోతారు
తెలిసీ నటించడం వెనక
తెలియకనే స్వభావం విప్పుకుంటారు
ఈ మసకలోకం
ఆడంబరాలకు అలవాటు పడింది
ప్రియురాలా ...!
తడితడి మనసుండగా మనకేం తక్కువ
.....
9-12-2013
వారాంతపు పని
ఎగురుతూ దుముకుతూ
ఉద్దేశ్యం లేని పరుగుతో
ఒగిరిస్తూ
దాచుకున్న ఆటని
బయటకు లాగుతూ
కిందపడి దెబ్బని తాకి
ఒక రక్తపు చుక్కని కూడా
అబ్బబ్బ అన్న తీరుతో
అబ్బుర పరుస్తూ
ఏడుపుకు ఏడుపుకు మధ్య
దొంగేడుపుతో అలరిస్తూ
పిల్లలు
ఆదివారాన్ని ఆనందిస్తారు
పెద్దలు
రోజూ ఏదో ఒక ఏడుపు
ఏడుపు లాంటి ఏడుపు
ఏడుపు కాకుండ ఏడుపు తో
ఆరు రోజులు కారించి
ఆదివారం రోజు
ఆరురోజుల ఏడుపును గుర్తుచేసుకుంటూ
వచ్చిన వారికి వడ్డించుకుంటూ...
.....
6-1-2014
కానుకను
సాయంత్రం కమ్మని వెన్నెల కాసే
మల్లె చెట్టొకటి నీకోసం
తెస్తాను
బహుశా
ఇప్పుడు నచ్చకపోయినా
అది కొప్పునిండా పూలుపెట్టుకున్నట్టు
పూసినరాత్రి
వెన్నలా అదీ మాట్లాడుకుంటుంటే ...
మధ్యలో ఆ మాటల్ని వింటూ
ఈ ప్రపంచంలో
ఏ మాత్రం వాసనలేని నువ్వు
ఎంత పరిమళిస్తావో
.....
2-1-2014
Makeup naturally
నాకు నేను పరిచయం అయ్యాక
నా ముఖచిత్రం
నేను గీసుకుంటున్నాను
కాలం కొంత నడిపించాక
నడక కొంత మొదలెట్టాక
అడుగుల రుచి తెలిసాక
డొంకల వంకల వొంపులు కలిసాక
కొరుకుల దారులు నిమిరాక
నడక అనివార్యమని తేలిపోయాక
పూలసంచిలా కొంతసేపు
సౌందర్యపు వాసనకి నోచుకున్నాక
విప్పటానికి ఏమ ీవుండదని
ఆకాశానికి పాదాలు నడవలేవని
భూమికి మించిన ఆధారం మరోటి లేదని
మనసుకు మించిన సమీప శత్రువు
మరొకడు దొరకడని అనిపించాక
ఏ కాలమైనా ఒకటే
వెంట్రుకలు తెలుపును ఇష్టపడుతున్న సమయము
వేదన...బాగోగుల పొలుసులు
విప్పుకుంటున్న వేళ
సరదాగా దు:ఖంతో పరాచకాలాడే
ప్రియురాలిని కల్గివున్నాక
సమస్త భ్రాంతుల్ని తెంచేసుకునే
తాయెత్తు మొలమీద కట్టుకున్నాక
ఇక...
ఏ కాలమైనా ఒకటే
.....
1-1-2014
Newer Posts
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)