Thursday, January 9, 2014

ఈమాత్రం దానికి 2



ఒక లిప్త కాలంలోనే
అనేక ఆలోచన్లు కలుసుకుంటాయి
పొంతన లేకుండా
ఒక మెరుపు తునకలా
ఒళ్లు ఝళ్లు మనేలా వచ్చి పోతాయి

మనసు పచ్చని పైరులా వుంటే
పిల్ల గాలుల్లా వచ్చే ఆలోచన్లు
హాయిని తెలుపగా
గుండెని తడుపుతాయి

గాయమైన చర్మం లా మనసుంటే
ఆలోచన్ల మంటలు
ఆ భగ్గుమనే అంటుతాయి

సంపదకనుకూలంగా కూడా
కొన్ని చమక్కుమంటాయి
కానీ...లేనపుడు
ఏకాకి విచారమే ముసురుకుంటుంది

ఈ రోజు మనకేం కావాలో
అదే పనివైపు జరుగుతాం
అనుకోకపోయినా

కొందరు కొన్ని పనుల్లో
ఆరితేరివుంటారు
డబ్బుకు సంబంధం లేనివి
ఉదాహరణకి ఎదుటివాడి జీవితంలో కాలు పెట్టడం

స్నేహం ను గొప్ప వేషం లా
రక్తి కట్టించడం అలవాటైన విద్య కొందరికి
ఈర్ష్య ...ద్వేషం
కోపం...అహంకారం
అనేక వేషాలు ఒకేసారి వేయగల సత్తా
సరిపోను నిల్వ కలదు

ఇక

ఏది మనకు అనుకూలం కాకపోయినా
బోలెడు చింత జమా.

చింత చిగురించి చిగురించి
పూతై...కాతై
బీపీ నో.....సుగర్ నో
ఒంటి నిండా నింపాక...

ఇంకేముంది
గిలగిలబతుకు

.....
27-12-2013

ఆత్మ వెలది 52


నువు పక్కనుంటే
చుక్కల మీదికి దృష్టి పోనే పోదు

పరిశుభ్రంగా ఈ ప్రపంచం
పండగ లో తడుస్తుంది

తగిలీ తగలని నీ స్పర్శ
శ్వాస కే ఉక్కిరిబిక్కిరి

ఈ మసకలోకం
మనల్ని గుసగుసగా చూస్తుంది
ప్రియురాలా ...!
ఈ రాత్రిని వెన్నెల చెయ్యి.

.....
7-12-2013

ఆత్మ వెలది 51



ప్రశ్న కు ప్రశ్నే
సమాధానం అవుతుంది కొన్నిసార్లు

చేతకానితనమే
చెప్పలేని బలమౌతుంది

మౌనం కొన్నిసార్లు
గొప్ప సంభాషణౌతుంది

ఈ మసకలోకానికి
మన గురించే దుగ్ధ
ప్రియురాలా .....!
మాటల్ని కొలబద్దలు చేయకు

.....
6-12-2013

ఈ మాత్రం దానికి ...3



ఒంటరిగా ఉండలేని మనం
కొన్ని పరిస్థితుల వెంట పడతాం
కొన్ని సృష్టించుకుంటాం

కొంతకాలానికి
అవే వెంటబడతాయి
మన చుట్టూతా దాని వల
చుట్టుకుంటుంది

ఇంకొంత కాలానికి
అవే కనిపిస్తాయి

చివరికి
ఉండే పరిస్థితి
లేని పరిస్థితి
మధ్య ఉండిపోవడం

.....
7-1-2014