Friday, August 31, 2012

శోక తరంగాల ధ్వని లాలన



రోజులు ఒలికి పోతుండగా 
చిలకరించ బడ్డ బతుకు 
కొక్కాలైపోయి 
మొక్కబోయి 
వీపు మీద అతుక్కుపోయి 
మోస్తున్న దుఃఖం జాలువారి 
చారలు చారలుగా 
అట్టలు కట్టుకొని వంకలు తిరిగి 
మురికై 
వాసన మూలాల మీద 
దేవి దేవి __
చాలా సమయం నా పక్కనే 
కూచున్నందుకు 
గట్టి పరిచయమై 
వదల్లేని పర్యవసాన 
అశుభ సందర్భాల మెడల మీద
ఊరేగి ,
ఉప్పొంగి 
నడిచి 
మోకాళ్ళు విరిగి 
వణికి ,ముసలితనం  చర్మానికి 
కథలు చెప్పి 
ఏడ్పుకు పాట నేర్పి 
గాలి కోణాల మీద రాత్రంతా 
జలకాలాడి 
సూర్యుడి ముఖాన్ని గుంజుకొని 
కడుపులో అలలై పారుతున్న 
ప్రపంచంలో 
ముంచి 
జోల పాడుకుంటున్నా .....
      .....

Wednesday, August 29, 2012

బై బై చెప్పే చేతులు



నిన్ను చూడటానికి వచ్చానా !
నా కళ్ళ భాషను
హత్తుకోకుండానే ఆనందం ప్రకటిస్తావ్

ఈ ఒక్క క్షణమే
మనసు మీదుగా
అన్ని మూసిన కిటికీలను తెరవలేక

నువ్వూ నేను చీకటికి తెలియం
చీకటైన నువ్వు తెలుసు స్పష్టంగానే

బేరలు చేడిపేస్తే మనం దగ్గరే
నీ చుట్టూ ఎన్నున్నాయో
నా చుట్టూ ఎన్నున్నాయో
ఎప్పుడు లెక్క కట్టాలె

దూరం నుండే చేతులూపుకుంటూ
గుండెను బలవంతంగా
జోకొట్టుకుంటున్నాం.

.....

Wednesday, August 22, 2012

ఐతుందంతా కానున్నదే


దురదృష్టం ఏదీ లేదు 
అదృష్టం అంతకన్నా లేదు 

ఆకాశం నుండి రాలే చినుకుల్ని 
ఒక్కోరకంగా ఒక్కోడు వాడుకుంటాడు

ఏడవటం లో ఒకడికి త్రుప్తి 
ఏడిపించడంలో మరొకడికి 
ఏదో ఓ సమయంలో రెండు అవతారాల్ని 
తొడుక్కుంటావ్

ఏదో ఒకరోజు 
నీ వాహనం మీద ప్రయాణించిన కొంతసేపటికి 
''ఇది ఇంతేగా''అని 
కునిర్దారణకు దిగి 
కరుకు నిగ నిగ వెకిలి నవ్వు 
భుజం మీద కప్పుకుంటావు 

వాహనం అదుపు తప్పిన వేగానికి 
నువ్వు పట్టుదప్పి 
రోడ్డు మీద రక్తపు కుప్పలో తేలతావ్ 
రెండు చేతులు మాత్రం 
చప్పట్లు కొడతాయి 
అవి నీవే 

ఏదేమైనా 
నువ్వు పూల భాషలో 
జీవించ నంతకాలం 
మనుషుల చావు తప్పదు .
      .....

Tuesday, August 21, 2012

తీరొక్క బాధలు


ఎన్ని చెరిపినా 
ఇంకొన్ని మిగిలే ఉంటాయి 

నిన్ను తెలుపని వాసనలు కొత్తవి 
నా మీదికి తెరుచుకున్నపుడు 
నాకు సందేహమే నువ్వు 

నువ్వెప్పుడూ ఇంతే 
మనసులో కలిసి వెల్లిపోతావ్
గావర పెడతావ్ 
గుండెను చేది పెడతావ్ 

ఎవరు ఎవరికీ అర్ధం కాని బజారిది 
అలుపెరుగని కాళ్ళ శ్వాస 

ఒకరు పూర్తిగా 
అర్ధం కావాలనుకోవటం భ్రమ 
తెగదు ముడిపడదు 
యాప్యము.
    .....

Monday, August 20, 2012

పరిమళమే తానైన ...


ఇంతకీ నువ్వెవరో తెలియదు 
బహుశా నేను పుట్టటానికి ముందు 
నీతో స్నేహం చేసి ఉన్నానేమో !

ప్రయాణం లో నన్ను హక్కున చేర్చుకున్న 
నీ ఆలింగనం 
అమ్మ తర్వాతది ,
చలి రోజుల్లో కప్పుకున్న దుప్పటి ,
నను దాచుకున్న గుడిసె,
మెత్తని వెన్నెల గుజ్జు తాకిడి 

నా భుజం మీద నీ చేయి వేసినపుడు 
నా బరువంతా 
నిప్పుల్లో దూకిన అగురుధూమంలా గాలిలోకి...
మనసుకు పట్టిన దుమ్మంతా 
నీ రెండు చేతుల్లో 
సద్దకంకిని నలిపినట్టు నలిపి,ఊదేసి
మళ్ళీ నా మనసు నాలోకి నింపేస్తావ్...

ఇంతకీ నువ్వెవరో నాకు తెలీదు 

నువ్వు తలపుకు వస్తే 
కోరికల రాజ్యం నాదే 
అందులో కొలువుండే వాడు 
నావాడే...

యుగాలనుండి
బంధించ బడ్డ పావురాయి 
నీ చేతుల్లో ఎగిరిపోయి 
వెనక్కి చూసి ,నీ చేతుల్ని 
ముద్దాడటం మరిచి పోయినందుకు 
సిగ్గు పడతాయి 

ఎవరెవరు ఏమేమి ఏరుకుంటారో 
నీ తీరం వెంట నడుస్తూ ...
నా చేతుల్లో పట్టేటన్ని 
గులక రాల్లనే తీసుకుంటా...
నీతో తడిసిన వాటి చల్లని సుఖ స్పర్శ చాలు నాకు 
నీ నోటి నుండి పారిన హొయల పాటల 
తనువును మీటి పోతే చాలు 
నా దేహము ,దాని దేహము 
ఆనందపు లోయలో 
రెక్కలు చాచిన పక్షిలా గాలిలో ...

ఇంతకీ నువ్వెవరో తెలియదు 

ఈ భూమిని ముద్దాడిన 
వాత్సల్యపు కొండవి 
పోరాటానికి పొద్దుపొడుపువి 
అక్షరాలకి,ఆత్మీయతకి ముద్దుబిడ్డవి 
ఏ కాలము భయపెట్టని 
మంచుగడ్డవి .
     .....
నా ప్రియమైన అన్న డా.పిల్లలమర్రి రాములు కి....ఇష్టంగా.

మోసపోకుండా నడిచే నేల కావాలి


ఎవరికీ చెప్పక పోయినా సరే 
నీకు కొన్ని చెప్తాను 

ఎవరినీ పూజించకు 
దేవుడు కలవర పడతాడు 

ఎవరినీ వెక్కిరించకు 
కొన్ని బాణాలు 
వెనక్కి తిరిగి తగుల్తాయి 

మాటలతో శూలాలు తయారు చేయవచ్చు 
కానీ
పూలు తయారు చేస్తే 
నీకు ఇతరులకు కూడా 
సౌరభమూ,నిర్మలత్వము 

నువ్వు భూమి మీద చేసే విన్యాసాలను 
ఎవరూ ప్రసారం చేయాలను కోకు 
వాటికి జీవం ఉంటె నాల్కల మీద బతుకుతాయి 

ఎవరికోసమో 
సూర్యుడి సమయాన్ని వృధా  చేయకు 

రోజూ పండగ చేసుకోవచ్చు 
గాలిని కూడా పూజించు కోవచ్చు 
నీ హృదయం చుట్టూ 
చువ్వల్ని తొలగించు కోవాలి 
కాకపోతే 
పూల మకరందం లో ముంచుకోవాలి 

మరోసారి ఇంకొన్ని చెప్తాను 
నీకు నచ్చితే 
నీ కిటికీ దగ్గర నిలబడి గట్టిగా చదువు 

మనుషుల వాతావరణం లో 
పరిశుభ్ర పరిమళం చేరుకుంటుందేమో 
చూద్దాం.
     .....

Monday, August 13, 2012

నీకు తోచని నీ ప్రపంచం


నను చూడగానే 
నీకు కొన్ని ప్రశ్నలు పుడతాయి 

నాతో మాటలు కలిపే సమయానికి 
అవి నిన్ను అడుగుకు తొక్కి 
పైన తేలతాయి 

నా ప్రమేయ మేమీ లేని 
నా గురించిన ప్రశ్నలు 
ఊపిరాడకుండా చేసి నీ చేతనే 
సమాధానాలు ఊహింప చేస్తాయి 

ఇప్పుడు ప్రశ్నలు నీవే 
సమాధానాలు నీవే 
అన్నీ మల్టిపుల్ ఆన్సర్స్ 
నీకు తోచిన రచనలే 

చివరికి ''అన్నీ కరెక్టే ''అనే 
వెకిలి హాసాన్ని కలుపుతావు 

ఉండేదొకటి
నిన్ను నీలో ఉండనివ్వనిదొకటి 
        .....

Sunday, August 12, 2012

స్పర్శ కల్గించే ఈ ఉదయం


మనసు మీద 
కురుస్తున్న వాసన 

ఆ మెత్తెక్కిన గాలి పని అంతేగా 
నిలవనియ్యదు
నీరసపడనియ్యదు 

చెదలు పట్టిన కారణాలకిక ముఖం 
లేదు 

అచ్చం చీకటిని 
అచ్చం వెలుతురును 
భరించటం సాధ్యమయే పనేనా?

ముల్లుకు ప్రేమించే గుణం లేదని 
ఎలా నిర్దారించగలరు ?

పండించుకోము 
ఆనందాన్ని పంచుకోము 
వీధుల్లో నిలబడి విషాదాన్ని కూడా 
ధైర్యంగా ధరించలేము

మనుషుల చుట్టూ ఉండే 
కాంపౌండ్ వాల్స్ దుర్భేధ్యాలనే 
పునాదిలోని బాధ 

పీడించేవి అదుపాజ్ఞలేనని
ఇప్పటికైనా తెలుసుకున్నాను 

శాస్త్రం ప్రకారమో 
సిద్ధాంతాల ప్రకారమో 
కళ్ళల్లోకి చూసుకుని 
రక్తం లో కలుస్తారా !నిజమేనా!

అనుభవం కల్గిన చూపుడువేలు 
అవసరమే.

     .....

Tuesday, August 7, 2012

విషయ సూచిక


ప్రతి విషయాన్ని
గుండెల మీద అంటించ వద్దు

ఈ రోజు లాగే తేడా లేని
ప్రతి రోజు పలకరించి పోతుంది

సమస్యలు అనేక ముఖాలతో
నీ చుట్టూ తిరుగుతాయి

మితంగా తింటూ ,సరదాగా అన్నిటినీ
కష్టాన్ని ప్రేమ గా మచ్చిక చేసుకోవాలి

జీవితమంతా పండగలా,నీటి అద్దంలా
ఇష్టంగా,దీపం లా ధ్యానంగా గడపాలి .

.....

నా సెలయేరు హృదయం.....19


ఈ భూమికి నేను 
పరదేశిని 

ఇక్కడి గాలికి నేను 
ప్రియమైన అతిథిని 

నాకైతే త్రికాలాలలో నువ్వు 
ఆశ్చర్యానివి 

        ఈ ఈర్ష్యా లోకానికి 
        ఇది అర్ధం చేయించు 
        ప్రియురాలా...!
        ఈ రాత్రిని వెళ్ళనీయకు .

        .....

Sunday, August 5, 2012

గడియారం గుంజుకు పోతుంది


పగలుకున్న అన్ని ముఖాలు 
ఇంకా తెలుసుకోక ముందే 


రాత్రికున్న అన్ని కోణాలు 
ఇంకా స్పర్శ లోకి మలుచుకోక ముందే 


నిజానికి చుట్టుకున్న కొత్త జీవితం 
అడుగుల్ని తడపక ముందే 


దృష్టికి ఉన్న స్వచ్చత 
మనసుని ఇంకా కడగక ముందే 


ప్రేమ కి ఉన్న ఓదార్పు 
ఇంకా తల నిమరక ముందే.....


.....ప్రతి రోజు పాతదై పోతుంది 
     పదును వయసు ముడతలౌతుంది.
          .....

Saturday, August 4, 2012

కవులు పాడే కాలం


పండగ 
ఆనందం పండగ 
సొగసు రంగుల అక్షరాలు 
కలిసి కురిసే రమణీయ వాన 


పూలు కలుసుకునే చోటు ,
రంగుల పేర్లు ఎన్నని చెప్పేది 
వికసించిన వాసనల తోట సౌరభం 
అనేక వర్ణాలు ,అనేక మధురాలు 
అనేక జ్ఞానాలు,అనేక మధువుల తేనెతుట్టె 
అనేక రసాల కవిత్వపు పాలపుంత 


పరిశుభ్రమైన చూపును 
సీతాకోక చిలుకల మీద విసరండి 
చిలక పచ్చని శ్వాస తో 
గడ్డి పూల నవ్వుల్నీబంధించుకోవచ్చు 


ప్రేమల్ని పూసిన కవుల జాతరని 
కాలం చేసుకునే పండగ 


ఆత్మను పెనవేసుకున్న భాషా చిలుకలు 
మౌనం పొడుచుకొని బయటకొచ్చిన 
పచ్చిక మెదళ్లు 
రాత్రులకు పగల్లకు 
సౌందర్యమద్దిన రింగన్నలు
వ్య్ధధలకు వెన్నెల నద్దిన దివ్యపురుషులు


సూర్యుడికి ఉదయం సాయంత్రం 
కలువల దండ సిద్ధం చేసే దండు 
అక్షరాలే జీవద్రవమైన 
మాదకాలంకార ప్రియులు 


నడిచొచ్చే సుతిమెత్తని ముళ్ళ పొదలు 
గాయాల రూపాయి బిళ్ళలు 
రాజుల పక్కటెముకల కింద మొలిచే 
పగిలిపోయే గడ్డలు 
దడదడ గుండెల్ని ఉరికించిన 
పిడికిలి పాళీలు 


రహస్యం లో చుట్ట చుట్టుకొని 
శ్వాసలని సాగ దీసే మెదడు పురుగులు 
విజ్ఞాన శిఖలు ,
సొంత తలకి కొరివి పెట్టుకోగల
రహస్య  హస్తధరులు 


దుఃఖంతో రమించగల రసికులు 
ఆకలికి గుండె పెండేరం తొడిగే రసరాజులు
భూమి మీద పూసిన నక్షత్రాలు 
చరిత్రలోకి నడక చూపిన చూపుడు వేల్లు


సొగసు వీచిన గంధర్వ వృక్షాలు
ఆత్మీయ వర్ణమాలలు ధరించిన 
వెలుతురు పిట్టలు 
ఎగిరొచ్చి ఎగిరొచ్చి వాలతాయి 
కమ్మని కోయిలల శబ్ద ధ్వనులకు 
వసంతం తొంగి చూస్తుంది 
నా అనాది పూర్వ కవుల ఆత్మలు 
పండగ చేసుకుంటాయి 


ఒక దీపం వెలిగిద్దాం 
అది అక్షరం పుట్టిన నాటిది 
నాడులలో ,నరాలలో
పాకిన వెలుతురు ఊరికే ఉండదు...

ప్రకాశంతో భూమ్మీద కాగడాలు మొలకెత్తుతాయి 
ముందు తరాల జన్యువులు 
కవిత్వపు క్రోమోజోములు కలిగి పుడతాయి 


        .....

Friday, August 3, 2012

జీవితానికి దారి ఎటు?


మనల్ని మనం 
మౌనాంగాలతో భర్తీ చేసుకోలేం 


ఇంకా మిగిలిన 
అంటుకు పోయిన మూలల్ని
గాలికే వదిలేస్తాం 


ఒకర్నొకరు 
సమస్య చేత గుర్తించబడతాం 


ఇంకా దాగిన 
రోజు రోజు అలిసిన క్షత క్షణాల్ని 
నిర్లిప్త దుప్పటి కింద తోసేస్తాం 


నువ్వు నేను 
చెల్లా చెదురు అంశాలతో కలుపబడతాం 


ఇంకా మనకంటిన 
కొందరి నమ్మకాలకు దిమ్మిస వేసుకుంటూ 
మనుషుల్లో నిమజ్జనం చేసుకుంటూ 
          .....

Thursday, August 2, 2012

నిస్తంత్రీ ప్రేమ

1


మన మధ్య 
పరిచయమైన దూరం ఉండగా 
పరామర్శించే వ్యత్యాసం కూడా 
కేవలం పలకరిస్తుంది 


నువు నాకు 
తెలుసనుకునే లోపునే 
ఒక ఖాళీ పేజీ ,పుస్తకం మధ్యలో 
అవతలి ఇవతలి విషయాల మధ్య 
ఎట్లా పూరించాలో తెలియక 


మనం నిజానికి చాలా దగ్గర 
ఎంతగా అంటే 
రూపాయి తూకాల్లో జారిపోయేటంత


2


మన ఇద్దరి లోకాలు 
ఒకటి కాకపోవచ్చు 
కొన్ని స్వర చాలనాలు 
కొన్ని ఆత్మాలింగానాలు 
రహదారిలో తటస్థ పడవచ్చు 
అవి నీ జ్ఞాపకాల మీద పుట్టుమచ్చలవచ్చు 


తెలియక చేసిన తప్పు కూడా 
గొంతు పెకిలించు కోవచ్చు 
ఒంటరిగా వున్నప్పుడు కొన్ని ప్రశ్నలు 
ఊపిరికి చుట్టుకోవచ్చు 


మనం నిజానికి చాలా దగ్గర 
ఎంతగా అంటే 
వాతావరణం విడదీయ గలిగినంత 
       .....

Wednesday, August 1, 2012

నా సెలయేరు హృదయం .....18


భూమి నుండి జల పైకి రాగల 
ప్రేమ ఎంత స్వచ్ఛమైనది 




ఆవిరి బిందువులన్నీ మళ్లీ 
భూమిని చేరే ఆకర్షణ పవిత్రమైనది 




మన మధ్య అటూ ఇటూ ప్రవహించే 
అనుభందపు వ్యసనం అనంతమైనది 


            ఈ మసక లోకానికి 
            ఇది ఎట్లా తెలియటం 
            ఓ ప్రియురాలా...!
            ఈ రాత్రిని వెళ్ళనీయకు .


             .....